శనివారం 05 డిసెంబర్ 2020
Adilabad - Nov 01, 2020 , 00:16:37

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • వల్లభాయ్‌ పటేల్‌, వాల్మీకి మహర్షికి ఘన నివాళి
  • నిర్మల్‌లో నివాళులర్పించిన అదనపు కలెక్టర్‌  హేమంత్‌

ఎదులాపురం: దేశ ఐక్యత, సమగ్రత, జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నా రు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రజలందరిలో ఐక్యత చాటారన్నారు. ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్‌ జీ సంధ్యారాణి మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని, ప్రజలందరినీ సంఘటితం చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. అంతకుముందు వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతపై ప్రతిజ్ఞ చేయించారు.  ఆర్టీ వో జాడి రాజేశ్వర్‌, కలెక్టరేట్‌ ఏవో అరవింద్‌ కుమార్‌, డీపీఆర్‌వో ఎన్‌. భీంకుమార్‌,  అర్బన్‌ తహసీల్దార్‌ భోజన్న, కలెక్టరేట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల కోసం వాల్మీకి మహర్షి కృషి..

బడుగు, బలహీన వర్గాల కోసం వాల్మీకి మహర్షి ఎంతో కృషి చేశారని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌ బీసీ స్టడీ సర్కిల్‌లో అధికారికంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా మహాత్మాజ్యోతిబాఫూలే విగ్ర హం, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి  వెనుకబడిన తరగతుల ఆరాధ్య దైవమన్నారు. అనంతరం వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి,  బీసీ సంక్షేమశా ఖ అధికారి ఆశన్న, కార్యాలయ ఉపసంచాలకుడు నాగరాజు, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పార్థసారథి, ఉపాధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌ ఖత్రి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం

నిర్మల్‌ టౌన్‌: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో శనివారం పాల్గొన్నారు. మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి రాసిన ఎన్నో కావ్యాలు మనకు గొప్పనీతిని అందించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజలింగం, అసిస్టెంట్‌ అధికారి రవీందర్‌, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి కరీం, డీఎస్‌డీవో కిషన్‌యాదవ్‌, బోయ వాల్మీకి సంఘం జిల్లా నాయకులు ఆకుల సుదర్శన్‌, కుమార్‌, వై.అశోక్‌, డీఆర్వో రమేశ్‌ రాథోడ్‌, టీఎన్జీవో నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఉద్యోగులు రవి, కలీం పాల్గొన్నారు.