ఆదివారం 29 నవంబర్ 2020
Adilabad - Oct 31, 2020 , 00:27:01

‘రసాయనాల’పై అవగాహన కల్పించాలి

‘రసాయనాల’పై అవగాహన కల్పించాలి

  • పత్తి పంటకు నష్టం వాటిల్లకుండా చూడండి
  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సూచన
  • వ్యవసాయాధికారులతో సమీక్ష
  • రైతులకు సీసీఐ కొనుగోళ్ల కూపన్లు  అందించాలని ఆదేశం 

ఎదులాపురం : పత్తి పంటకు నష్టం వాటిల్లకుండా వినియోగించాల్సిన రసాయనాలపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని  ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.  పంట నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శాస్త్రవేత్తలు వివరించిన  విధంగా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సన్న, చిన్న కారు రైతుల్లో భరోసా కల్పించాలని చెప్పారు. క్లస్టర్ల వారీగా నియమించిన వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలోని రైతులను కలిసి పంటల వివరాలపై తెలియజేయాలన్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన దృష్ట్యా క్లస్టర్ల వారీగా, గ్రామాల్లోని రైతులకు రెండు రోజుల ముందుగానే కూపన్లు అందించాలని  సూచించారు.

కొనుగోలు కేంద్రాలకు పత్తి తరలించే ముందు ఉండాల్సిన తేమ శాతం, ఆర బెట్టే విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్న పంటల వివరాలను సేకరించాలన్నారు.  జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రైతు వేదికల నిర్మాణాలను వారంలోగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలన్నారు. మండల విస్తరణ అధికారులు వారి క్లస్టర్లలోని రైతులను కలవాలని అదనపు కలెక్టర్‌ జీ సంధ్యారాణి సూచించారు. జిల్లాలో సీసీఐ ద్వారా పది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 28 జిన్నింగ్‌ మిల్లులు గుర్తించామని చెప్పారు.

రైతులకు ముందస్తుగా కూపన్లు అందించాలన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో  పత్తి విక్రయించుకునేలా గిరిజన రైతులకు సలహాలు అందించాన్నారు. గాదిగూడ, నార్నూర్‌ వంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లోని రైతులకు గులాబీ పురుగు, కాయకుళ్లు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై వ్యవసాయ విస్తరణ అధికారులకు శాస్త్రవేత్తలు ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌ వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఉన్నారు.