శుక్రవారం 04 డిసెంబర్ 2020
Adilabad - Oct 30, 2020 , 00:38:58

మొదటి రోజు ముంచెత్తిన పత్తి

మొదటి రోజు ముంచెత్తిన పత్తి

  • మార్కెట్‌యార్డుకు తరలివచ్చిన దూది బండ్లు
  • రూ.5,825 మద్దతు ధర చెల్లించి కొనుగోలు
  • ప్రారంభించిన జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే, కలెక్టర్‌
  • మొదటి రోజు ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డును పత్తి ముంచెత్తింది. గురువారం వేకువజాము నుంచే దూది బండ్లు బారులుదీరాయి. కాగా.. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ప్రారంభించారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో మద్దతు ధర రూ.5,825 చెల్లించి కొనుగోలు చేశారు. మంచు కురుస్తుండడంతో పత్తిని ఆరబెట్టుకొని తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.   - ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మద్దతు ధరతో  కొనుగోలు చేస్తున్నది.

ఈ ఏడాది వానకాలంలో రైతులు సాగుచేసిన పత్తి పంట కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో పంట కొనుగోళ్లను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ప్రారంభించారు. మొదటి రోజు భీంపూర్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌, మావల మండలాలకు చెందిన రైతులు వాహనాల్లో భారీగా పంటను విక్రయానికి తీసుకొచ్చారు. సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధర క్వింటా లుకు రూ.5,825  చెల్లించి పత్తిని కొనుగోలు చేశా రు. రైతులు ఇబ్బందులు పడకుండా మార్కెటింగ్‌ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు కాంటాల్లో కొనుగోళ్లు చేపట్టారు. తేమశాతాన్ని పరిశీలించడానికి అదనంగా సిబ్బందిని నియమించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ..

జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వానకాలం పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. జిల్లాలో పది సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో పంటను కొనుగోలు చేస్తామని తెలిపారు. మంచు కురుస్తుండడంతో తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని, రైతులు పంటను ఆరబెట్టుకొని మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌, అధికారులు పాల్గొన్నారు.