ఆదివారం 29 నవంబర్ 2020
Adilabad - Oct 30, 2020 , 00:39:01

ధరణి హాసం..

ధరణి హాసం..

 • మొదలైన పోర్టల్‌ సేవలు
 • ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
 • తహసీల్‌ కార్యాలయాల్లో పండుగ వాతావరణం
 • తెలుసుకునేందుకు ఆఫీసులకు వచ్చిన రైతులు
 • వచ్చే నెల 2 నుంచి రిజిస్ట్రేషన్లు
 • స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్న కర్షకులు
 • వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం 
 • టీవీల వద్ద అతుక్కుపోయిన ప్రజలు
 • నవ శకానికి నాంది పలికిన కేసీఆర్‌
 • పలుచోట్ల చిత్రపటాలకు పాలాభిషేకం 
 • హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 
 • రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయం : మంత్రి అల్లోల

రెవెన్యూ చరిత్రలో ‘ధరణి’ శకం మొదలైంది. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్‌ కార్యాలయాల్లో చేసే ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధరణికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పోర్టల్‌ను ప్రారంభించారు.  తహసీల్‌ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొందరు రైతులు ఆసక్తితో ఆఫీసుల వద్దకు వచ్చారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొందరు స్లాట్‌ బుక్‌ చేసుకుంటుండగా.. వచ్చేనెల 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రెవెన్యూ చరిత్రలో ఇదో నూతన అధ్యాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. 

 - నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ

మనువడి పేరిట పట్టాజేత్తా..


తాండూర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు మస్తు ఇగురమున్నోడు. ఇది వరకు భూముల కోసం మస్తు కొట్లాటలయ్యేటియ్‌. గందుకే గీ ‘ధరణి’ తీసుకొచ్చిండని అందరంటన్రు. గిదైతే మస్తు మంచిగున్నది. ఇగ ఏండ్లసంది పడ్డ బాధలన్నీ పోతయ్‌. మా ఊర్లో నాకు పదెకరాల భూమి ఉంది. నా మనువడికి రెండెకరాలు పట్టా చేపిస్త అని అచ్చిన. అందరూ అనుకోంగ ఇని ఈడికచ్చిన. పెద్దసారు అక్కడ ఏదో మీట (ధరణి పోర్టల్‌) నొక్కిండట. ఇగ అంతట రిజిస్ట్రేషన్లు మొదలైతయట. గింతకుముందు మంచిరాలకు పోయి మస్తు ఇబ్బందులువడ్డా. ఇగ ఇక్కడనే పట్టా చేయించుకుంట. వచ్చే నెల రెండో తారీఖున అచ్చి నా మనువడి పేరు మీద చేయిస్త.     

- ఒగ్గు రాజలింగు, రైతు, రేచిని

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తహసీల్‌ కార్యాలయాల్లో  పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో గురువారం మధ్యాహ్నం 12.56 గంటలకు ధరణి సేవలను ప్రారంభించారు. వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 70 తహసీల్‌ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు కూడా లాంఛనంగా పోర్టల్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు వ్యవసాయ భూముల  రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో చేసేవారు. ఇప్పటి నుంచి మండల కేంద్రాల్లోని తహసీల్‌ కార్యాలయాల్లో తహసీల్దార్లు చేయనున్నారు. కొందరు స్లాట్‌ బుక్‌ చేసుకుంటుండగా.. నవంబర్‌ 2 నుంచి ధరణి పోర్టల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ తహసీల్‌ ఆఫీసుల్లోనే చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత రెవెన్యూ పరమైన పనులు చూస్తారు. ఉదయం రిజిస్ట్రేషన్‌ చేసి మధ్యాహ్నం మ్యుటేషన్లు చేస్తారు. ప్రస్తుతం నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సేల్‌డీడ్‌, పార్టిషన్‌, సక్సెషన్‌, గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్లను చేస్తారు. కాగా.. సీఎం కేసీఆర్‌ ధరణిని ప్రారంభిస్తుండగా రైతులు, ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. గుడిహత్నూర్‌ మండలంలో ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాగా.. ఆదిలాబాద్‌ రూరల్‌, మావల తహసీల్‌ కార్యాలయాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, తలమడుగు, నేరడిగొండ మండలాల్లో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, బేలలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌,మంచిర్యాల జిల్లా తాండూర్‌ తహసీల్‌ కార్యాలయంలో బెల్లంపల్లి ఆర్డీవో  శ్యామలాదేవి పోర్టల్‌ను ప్రారంభించారు.

- నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ

రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయం..

-  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి


ధరణి పోర్టల్‌ సేవలు అందుబాటులోకి రావడంతో భూపరిపాలనలో నూతన అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు రూపం పోసుకున్న పోర్టల్‌ ప్రజల ఆస్తులు కాపాడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు దళారుల బారిన పడకుండా పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త విధానానికి నాంది పలికిందన్నారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు సులభతర సేవలు అందించే దిశగా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.     

తానూర్లనే పని అయితది..: - లోనేకర్‌ పీరాజీ, రైతు (హిప్నెల్లి)


తానూర్‌: ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తెచ్చి మంచి పని జేస్తున్నది. ఇన్నాళ్లు మేం భూముల రిజిస్ట్రేషన్లకు భైంసాకు పోయేటోళ్లం. ఇప్పుడు అట్ల లేదు. తానూర్లనే మా పనులన్నీ అయిపోతై. అంత దూరం పోయి రావాలంటే ఇబ్బందులెదురయ్యేవి. ఇప్పుడు ఇంటికి దగ్గర్లనే పని అయితది. సీఎం కేసీఆర్‌ సారు చేస్తున్నవన్ని మంచిగుంటున్నయ్‌. ఆయన ఏదైనా ప్రజల గురించే ఆలోచించి చేస్తున్నడు. గతంలో ఇట్ల చేసిన నాయకున్ని నేనైతే సూడలె. ఇప్పటిదాకా ఉన్న ఇబ్బందులన్నీ ఇక తొలిగిపోతయనుకుంటున్న. ధరణి పోర్టల్‌తో సమస్యలకు పరిష్కారం లభిస్తుందనుకుంటున్న. సర్కారు తీసుకున్నది మంచి నిర్ణయం.