బుధవారం 25 నవంబర్ 2020
Adilabad - Oct 29, 2020 , 02:16:52

మాయదారి ‘మట్కా’

మాయదారి ‘మట్కా’

  • జిల్లాలో దర్జాగా దందా
  • రోడ్డున పడుతున్న కుటుంబాలురోడ్డున పడుతున్న కుటుంబాలు

ఎదులాపురం :   ఒకప్పుడు గుట్టుగా నడిచిన మట్కా దందా ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దర్జాగా సాగుతున్నది.  బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ఓల్డ్‌ బస్టాండ్‌, తాంసి బస్టాండ్‌, ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంతోపాటు రద్దీ ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి జనం ఆగమవుతున్నది.  డబ్బు ఆశతో మాయదారి మట్కాకు దాసోహమై తమ బతుకులను నాశనం చేసుకుంటున్నారు.  కరోనాతో ఏర్పడిన పరిస్థితులను ఆసరాగా చేసుకొని మట్కా నిర్వాహకులు , బ్రోకర్లు  పేదలు రోజు వారి కూలీలను ఈ మాయదారి ఆటలోకి దింపుతున్నారు. ఒక్క రోజులోనే వేల రూపాయలు వస్తాయనే ఆశ  చూపుతున్నారు. ఒకవేళ ఆట ఫలితాలు అనుకూలంగా రాకపోతే అటేనని, పెట్టిన పందెం డబ్బులు ఇవ్వాల్సిందేనని దబాయించి మరీ వసూలు చేస్తున్నారు.  ఇలా ప్రతి రోజూ కొత్తగా వందల మంది ఆటతో ఆగమవుతున్నారు. రోజు వారీ కూలీలు, కార్మికులు కొంత మంది ఉద్యోగులు సైతం దీని బారిన పడినట్లు సమాచారం.

అంతా ఆన్‌లైన్‌లోనే 

మహారాష్ట్ర కేంద్రంగా నిర్వహించే మట్కాకు ఆదిలాబాద్‌  ప్రాంతాల్లో వీరి తరఫున ప్రాంతాల వారీగా బ్రోకర్లు ఉన్నారు. మూడు రకాల ఆటలతో రోజంతా దందా సాగుతున్నది. మాధురి, కల్యాణి, బాంబే , రాజధాని మెయిన్‌ పేర్లతో ఈ ఆటను కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు ,అర్ధరాత్రి 12 గంటలకు ఈ ఆటల ఫలితాలు వస్తాయి, ప్రతి ఆటలో ఒక నంబర్‌ గెలుస్తుందని, దానిపై పందెం పెడితే వందల రెట్లు అదనంగా డబ్బులు వస్తాయని ఆశ చూపుతున్నారు. ఆ తర్వాత గెలిచిన నంబర్‌ బ్రోకర్ల ఫోన్లకు వస్తుంది. ఆశ చూపిన డబ్బులు రాకపోగా, మరుసటి రోజు  ఇలాగే నమ్మబలుకుతూ ఆటలోకి  దించుతున్నారు. అదృష్టం పేరుతో సాగే ఈ ఆటలో రూ. పది నుంచి రూ. వెయ్యి వరకు పోగొట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి తక్కువ మొత్తమే అయినా ప్రతిరోజూ రూ.కోట్లలో దోచుకుంటున్నారు.  కొందరు యువకులు సులువుగా డబ్బు  సంపాదించాలనే అత్యాశతో ఆటకు బానిసలవుతున్నారు.

నిఘా పెంచాం..

మట్కా సాగే ప్రాంతాలపై పక్కా నిఘా పెంచాం . ప్రతి రోజూ అందిన సమాచారం మేరకు మట్కా ఆడుతున్న వారిని అరెస్ట్‌ చేస్తున్నాం. ఎక్కడైనా మట్కా ఆడుతున్నట్లు తెలిస్తే నేరుగా మాకు సమాచారం ఇవ్వవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచు తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మట్కాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటాం.

-వెంకటేశ్వర్‌ రావు, డీఎస్పీ