గురువారం 26 నవంబర్ 2020
Adilabad - Oct 29, 2020 , 01:31:27

విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోండి

విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోండి

ఎదులాపురం / నిర్మల్‌టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2020-21 విద్యా సంవత్సరానికి గానూ మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యాపథ కం (ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌) కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల మైనార్టీ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, స్రవంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో 60 శాతం మా ర్కులు ఉండి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు, పీజీలో 60 శాతం మార్కులు వచ్చి పీహెచ్‌డీ చేయాలనుకునే వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఈ పథ కం ద్వారా లబ్ధి పొందే వారు జనవరి నుంచి డిసెంబర్‌-2020 వరకు ఎంపిక చేసిన విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొంది ఉండాలని తెలిపారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, సింగపూర్‌, న్యూజిలాండ్‌, సౌత్‌కొరియా దేశాలున్నాయని, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, జైన, పార్శి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

కావాల్సిన పత్రాలు..

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ మార్కుల జాబితా, జీఆర్‌ఈ, జీఎంఏటీ పరీక్ష స్కోర్‌ కార్డు, టీవోఎఫ్‌ఈఎల్‌, ఐఎల్‌ఈటీఎస్‌ పరీక్ష స్కోర్‌ కార్డు, కుల, నివాస, జనన, ఆదాయ (రూ.5 లక్షలు మించరాదు) ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. వీటితో పాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌ కాపీ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరినట్లు ధ్రువీకరణ (1-20), బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీ, ఫొటో స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అర్హతలున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో 30.11. 2020, సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో తేదీ 5.12.2020 లోపు సమర్పించాల్సి ఉంటుంది. లేదా దరఖాస్తులు www.telanganapass. cgg.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.