గురువారం 03 డిసెంబర్ 2020
Adilabad - Oct 29, 2020 , 01:31:24

సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానానికి నేడే అంకురార్పణ

సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానానికి నేడే అంకురార్పణ

 • సులభం, వేగం, పారదర్శకత కోసమే  సరికొత్త విధానానికి శ్రీకారం
 • మూడుచింతలపల్లిలో సీఎం ప్రారంభించిన  వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు
 • ఇక తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు..
 • ఏర్పాట్లు చేసిన రెవెన్యూశాఖ అధికారులు
 • రిజిస్ట్రేషన్‌లో విప్లవాత్మక మార్పులు..
 • అరగంటలోనే దస్తావేజులు,పాసు పుస్తకాలు
 • సర్వత్రా హర్షాతిరేకాలు
 • రిజిస్ట్రేషన్ల కోసం సులభంగా స్లాట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం 
 • సామాన్యులకు అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ రూపకల్పన
 • దస్తావేజులు, పట్టాదారు పాసుపుస్తకం, మ్యుటేషన్‌ సహా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అరగంటలోనే పూర్తి
 • క్రయ విక్రయాలకు సంబంధించి కొనుగోలు, అమ్మకందారు పాసుపుస్తకాల్లో వెంటనే వివరాలు మార్పు 
 • ఒకే దగ్గర పనులు. ఏ కార్యాలయాలకు తిరగాల్సిన పనే లేదు
 • తహసీల్దార్ల చేతుల్లోనే వ్యవసాయేతర భూమిగా మార్చే అధికారం 
 • మార్కెట్‌ విలువను ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు 
 • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  70 మండలాల్లో అమలు

యావత్‌ ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ధరణి పోర్టల్‌' నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల చరిత్రలోనే నూతన అధ్యాయం మొదలుకాబోతున్నది. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఏండ్ల నాటి బాధలకు తెరపడి, సరికొత్త విధానానికి అంకురార్పణ జరుగబోతున్నది. భూ వివాదాలకు స్వస్తి పలికి.. యజమానులకు సంపూర్ణ హక్కులు, భద్రత, భరోసాను కల్పించి.. దశాబ్దాల వెతలను దూరం చేయనున్నది. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టబోతుండగా, ఆ మరుక్షణం నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 70 తహసీల్‌ కార్యాలయాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇక నుంచి అరగంటలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టదారు పాసుపుస్తకం చేతికి అందనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

- నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ 


నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : యావత్‌ ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్‌ గురువారం నుంచే అందుబాటులోకి రానున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో వెబ్‌సైట్‌ను పక్కాగా అమలు చేసేందుకు కలెక్టర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనుండగా, ఆ మరుక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నది. కొత్త విధానంలో అరగంటలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టాదారు పాసుపుస్తకం చేతికి అందనుండగా, రైతుల దశాబ్దాల బాధలు తీరనున్నాయి. భవిష్యత్‌లో భూవివాదాలు తగ్గడంతోపాటు యజమానులకు సంపూర్ణ హక్కులు, పూర్తిస్థాయి భద్రత లభిస్తుంది. దశాబ్దాల నాటి రికార్డులను తారుమారు చేసే విధానానికి చెక్‌ పడడమే కాకుండా, భూక్రయవిక్రయాల ప్రక్రియ పారదర్శకంగా ఉండనున్నది. ధరణి వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభిస్తుండడం, సామాన్యులకు అర్థమయ్యేలా రూపొందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

కూర్చున్న చోటు నుంచే వివరాల నమోదు

రెవెన్యూశాఖలో రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ఇబ్బందులు దూరం కానున్నాయి. గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. అత్యంత సులభంగా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. కూర్చున్న చోటు నుంచే అన్ని వివరాలు నమోదు చేసుకోవచ్చు. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ దాకా మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇదే సమయంలో ఫొటోలు, బయోమెట్రిక్‌ వేలిముద్రలతో పకడ్బందీగా రిజిస్ట్రేషన్లు జరుగ నున్నాయి. నమోదుకు ఓటీపీ సిస్టమ్‌ను కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు గతంలో మాదిరిగా బ్యాంకులకు వెళ్లి చలాన్లు కట్టా ల్సిన అవసరం లేదు. ఎవరికి వారే ఆన్‌ లైన్‌లో మార్కెట్‌ విలువను బట్టి పేమెంట్‌ చేసే వెసులుబాటు కూడా కల్పించారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సర్వం సిద్ధం

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విషయంలో సరికొత్త విధానానికి నేటి నుంచి అంకురార్పణ జరుగబోతున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను రిజిస్ట్రేషన్లశాఖ నుంచి రెవెన్యూ శాఖ ఆధీనంలోకి తీసుకొచ్చి తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగానే ధరణి(సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం) గురువారం నుంచి అందుబాటులోకి రానున్నది. ఇందులో సమస్త భూముల వివరాలు నిక్షిప్తం కానున్నాయి. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ ఇక నుంచి తహసీల్‌ కార్యాలయాల్లోనే జరుగుతాయి. ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 70 మండలాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. తహసీల్‌ కార్యాలయాల్లో అన్ని పరికరాలు, యంత్రాలు అమర్చారు. రెండు కంప్యూటర్లు, రెండు సీసీ కెమెరాలుసహా ఫుటేజీల పరిశీలన కోసం పెద్ద టీవీ, ఒక స్కానర్‌, ప్రింటర్‌, బయోమెట్రిక్‌ మిషన్‌, ఐరిష్‌ కెమెరాతోపాటు ప్రభుత్వ నెట్‌, ప్రత్యామ్నాయంగా మరో నెట్‌ సౌకర్యాన్ని కల్పించారు.

ఇవేకాదు అదనంగా మరిన్ని సౌకర్యాల కల్పన కోసం ప్రతి ఆఫీసుకు రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పోర్టల్‌ను ప్రారంభించగానే, ఆ మరుక్షణం నుంచే రిజిస్ట్రేషన్లు చేసేందుకు అన్ని తహసీల్‌ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులు, నేటి నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్ధమయ్యారు. 50 రోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు తిరిగి గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి.

నాలుగు రకాల డాక్యుమెంట్లకు అనుమతి

తొలిదశలో నాలుగు రకాల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తహసీల్దార్లకు అనుమతి ఇచ్చారు. సేల్‌డీల్‌(భూముల విక్రయాలు), పార్టిషన్‌ (భూపంపకాలు), సక్సేషన్‌ (వారసులకు భూములపై అధికారం), గిఫ్ట్‌ డీడ్‌ (బహుమతి)లను తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాల కోసం వ్యవసాయేతర భూములుగా మార్చే అధికారం కూడా వారికే ఇచ్చారు. దీంతో నాలుగు రకాల డాక్యుమెంట్ల నమోదుతోపాటు నాలా(వ్యవసా యేతర భూమార్పిడి) అధికారంతో తహసీల్దార్లు బాధ్యతలు చేపడుతున్నారు. ధరణి ఆధారంగా తహసీల్దార్లు ఈ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయనుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 20 లక్షల ఎకరాల పట్టా భూముల క్రయవిక్రయాలన్నీ తహసీల్‌ కార్యాలయాల్లో జరుగనున్నాయి.

తప్పనున్న తిప్పలు

గతంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, తర్వాత దస్తావేజులు తీసుకోవడం, మ్యుటేషన్‌, పహాణీల్లో మార్పులు చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేది. రోజుల తరబడి తిరిగినా పని పూర్తయ్యేది కాదు. కానీ.. కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లతో ఇబ్బందులన్నీ తప్పనున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్దేశిత సమయం ప్రకారం అర గంటలోనే జరుగుతుంది. ఆ వెంటనే దస్తావేజులు, పట్టాదారు పాసుపుస్తకం, మ్యుటేషన్‌ ఉత్తర్వులు ఇస్తారు. కొనుగోలుదారు కొన్న భూమిని అతని పట్టాదారు పాసుపుస్తకంలో చేర్చి ప్రింట్‌ తీసి సంతకం చేసి ఇస్తారు. విక్రయదారుడి పట్టాదారు పుస్తకం నుంచి తొలగిస్తారు. ఇలా క్రయవిక్రయాలకు సంబంధించిన అన్ని హక్కులు సంబంధిత పత్రాల్లో మారడంతోపాటు అదే సమయంలో మ్యుటేషన్‌ కూడా కానుంది. ఇక నుంచి వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మ్యుటేషన్‌కు, పట్టాదారు పాసు పుస్తకాలకు, దస్తావేజులకు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అన్ని ఒకేచోట చేసి అరగంటలోనే సంబంధిత అధికారులు, క్రయవిక్రయదారులకు దస్తావేజులు, అవసరమైన పత్రాలు చేతిలో పెట్టి పంపిస్తారు. దీని ద్వారా వ్యయ ప్రయాసలు తగ్గడమేకాదు, ప్రతి పనిలో అవినీతికి తెర పడి, పారదర్శకత పెరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, ఆపరేటర్లకు ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కాగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

భూ సమస్యలకు పరిష్కారం

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : గతంలో చాలా ప్రాంతాల్లో భూ సమస్యలు ఉండే. దీంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ధరణితో భూ సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం లభించనుంది. ఆన్‌లైన్‌లో అన్ని పొందుపర్చి ఉండడంతో స్థానికంగా రిజిస్ట్రేషన్లు వెంటనే అవుతాయి. భూమికి సంబంధించి ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఉండేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

-దుర్గం పోశం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు 

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

మంచిర్యాల, నమస్తే తెలంగాణ :  కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులమంతా రుణపడి ఉంటం. ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందుతాయని అనుకుంటున్న. ఈ పోర్టల్‌తో అన్ని సమస్యలకు పరిష్కారం లభించే వేదిక ఉంటుందని అందరూ అంటున్నరు. నిజానికి ఇదొక మంచి నిర్ణయం. గతంలో రైతుల ఇబ్బందులను పట్టించుకున్న నాథుడే లేడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దశాబ్దాల కాలంగా ఉన్న భూ వివాదాలకు స్వస్తి చెబుతూ ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నరని తెలిసింది. దీని ద్వారా తహసీల్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేతే నాలాంటి అన్నదాతలకు మేలు చేస్తది. 

-సల్పాల నాగన్న రైతు, మల్లంపల్లి