బుధవారం 25 నవంబర్ 2020
Adilabad - Oct 22, 2020 , 00:13:36

తీరొక్క పూలు.. చేసెను మేలు..

తీరొక్క పూలు.. చేసెను మేలు..

  • బతుకమ్మ పండుగలో పూలకు ప్రత్యేకత
  • రంగు రంగులపూలల్లో ఔషధ గుణాలు
  • ప్రకృతిని ఆరాధించే సంస్కృతి గొప్పతనం

బతుకమ్మ పండుగ అంటేనే పూలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగలో ప్రథమ స్థానం పూలదే.. ఏటి గట్లపై, పొలం గట్లపై విరబూసిన అచ్చమైన పల్లె పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగురంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో.. తీరు తీరున బంగారు బతుకమ్మను అలంకరిస్తారు. తంగేడు, బంతి,గునుగు, కట్లపూలు, మందారాలు, గన్నేరు, గుమ్మడి.. ఒకటేమిటి ఎన్నో రకాల పూలు బతుకమ్మలో కొలువవుతాయి. అందుకే ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే చిహ్నంగా కీర్తి పొందుతున్నది. బతుకమ్మకు ఉపయోగించే పుష్పాల్లో ఔషధ గుణాలున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇందులో తంగేడు, గుమ్మడి, రుద్రాక్ష, గునుగు, పట్నం బంతి, గోగుపువ్వు, చామంతి, గోరింటలో మోతాదులో ఔషదాలు ఉన్నట్లు శాస్త్రం చెబుతున్నది.

- నేరడిగొండ/నార్నూర్‌

గునుగు ..

గునుగు పూలు గడ్డిజాతికి చెందిన సహజ వర్ణపువ్వులు. గునుగు పూల అందం .. దానిలోని తెల్లదనం బతుకమ్మకే ఆకర్షణీయంగా నిలుస్తుంది. దీని శాస్త్రీయనామం సెలోసియా అమరాందేసి. పెద్ద పేగులో బద్దె పురుగులను తొలగించడానికి ఉపయోగిస్తారు. అతిసార నివారణకు, రక్త విరేచనాలకు, రక్త స్రావానికి మందుగా వాడతారు. కంటి సంబంధిత రోగ నివారణకు ఉపయోగిస్తారు. గునుగు పూవ్వు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. నీటిలో కలుపగానే మలినాలు తొలిగిపోతాయి. మొక్కలను పశువుల దాణాగా ఉపయోగిస్తారు. 

గుమ్మడి..

బతుకమ్మలో ప్రధానంగా కనిపించే పువ్వు ఇది. దీని శాస్త్రీయ నామం కుకుర్భిటా మాక్సిమా. గుమ్మడి పూలు లేకుండా బతుకమ్మను పేర్చరంటే అతిశయోక్తి కాదు. పువ్వులోని పిందెలాంటి రూపాన్ని శ్రేష్ఠంగా అలంకరిస్తారు. గుమ్మడిలో విటమిన్‌ ‘ఏ’ ఎక్కువగా ఉండడం వల్ల కంటి సంబంధ రోగాలకు ఔషధంగా వాడుతారు. సబ్బులు, కాస్మోటిక్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. శరీరంలోని జీర్ణవ్యవస్థలో గల సమస్యల నివారణకు దీన్ని వినియోగిస్తారు. శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతౌల్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో తలెత్తే కాళ్ల నొప్పులను తగ్గించే గుణం ఉంటుంది. కీళ్ల వాతం, అతిమూత్రం, మూత్రపిండ, పేగు సంబంధిత వ్యాధుల చికిత్సలో దీన్ని వాడుతారు.

తంగేడు..

తంగేడు పువ్వు శాస్త్రీయనామం ‘సెన్నాక్యూలేటా ఫ్యాబేసి’ కుటుంబానికి చెందినది. పేడపూలు.. పేద పూలుగా ఓ కవి దీన్ని అభివర్ణించాడు. ఏ పువ్వు దొరక్కపోయినా కనీసం తంగేడు పువ్వయినా ముత్తయిదువలు తలలో పెట్టుకోవా లని తెలంగాణలో ప్రతీక. దీని ఆకులు, పువ్వులు పొడి తామర లాంటి చర్మవ్యాధుల నివారణకు, ఉదర కోశ వ్యాధులకు మందుగా వాడుతారు. పూలను కోసేందుకు వెళ్లడం, పూలను తాకడం, వాటి గాలిని పీల్చడం వల్ల చర్మ, ఉదరకోశ వ్యాధుల నివారణకు ఉపయోగంగా ఉంటుంది. కీళ్ల నొప్పులకు, అతిసార, నేత్ర వ్యాధులకు మందుగా ఉపయోగిస్తారు. తంగేడు పువ్వును నీటిలో వేయడం వల్ల నీటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. ఇది కంటి సంబంధ వ్యాధులు, మధుమేహం, మూత్రాశయ వ్యాధుల నివారణకు ఉపయుక్తం. ఏలికపాములు, చర్మవ్యాధుల నివారణకు దీని ఆకుల వేర్లు ఔషధంగా ఉపయోగపతాయి.

మందారం..

రంగురంగుల్లో పూసే మందార ప్రతి పూజల్లోనూ కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, వేర్లు అన్నింటిలోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. రక్త ప్రసరణను సరిచేసి రుతుస్రావాన్ని నియంత్రిస్తాయి. కాలేయ వ్యాధులు, రక్త పోటుకు దీన్ని మందుగా ఉపయోగిస్తారు. వీటితో చేసిన నూనెలను వాడడం వల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అతిసారతో బాధపడేవారికి ఈ పుష్పం ఉపశమనం కలిగిస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో, జుట్టు రాలకుండా ఈ పుష్పాన్ని వాడుతారు.

చామంతి..

దీని శాస్త్రీయనామం క్రెసాంథిమం ఇండికోర. మహిళలు అలంకరిం చుకునేందుకు, హారంగా వేసుకునేందుకు చామంతి పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో ఆరోగ్యకర లక్షణాలు అధికంగా ఉంటాయి. యాంటి బయోటిక్‌గా వాడుతారు. ‘ఫైరటమ్‌' అనే కీటక నాశన మందులను తయారు చేయడంలో వినియోగిస్తారు. జలుబు,గొంతునొప్పిని తగ్గిస్తుంది. నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల వచ్చే నల్లటి వలయాలను తగ్గించేందుకు వీటిని వినియోగిస్తారు. మొటిమలు తగ్గడానికి, వలయాలను చల్లబర చడానికి చామంతి ఆకులు పనిచేస్తాయి. కళ్లకు, కాలేయానికి, రక్త ప్రసరణ లోపాలకు సంబంధించిన వ్యాధులకు దీనిని మంచి మందుగా వాడుతారు. భావోద్వేగాలను ఈ పూలు తగ్గిస్తాయి.

తామర పువ్వు..

దీని శాస్త్రీయనామం నిలుంబోన్యూ సిఫెరా. కలువలుగా పిలుస్తారు. దీన్ని రక్తస్రావ నివారణకు మందుగా వాడుతా రు. పువ్వులను జీర్ణవ్యవస్థలో ఆరోగ్యకరమైన ఔషధంగా, సుగంధ ద్రవ్యాల తయారీలో వాడుతారు. హృదయ సంబంధిత రోగాలను తగ్గిస్తాయి. నీరసాన్ని దరిచేరనీయవు. కలువ గింజలు అజీర్ణానికి, జీగల విరేచనాలు, రక్త విరేచనాలు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అనేక సౌందర్య సాధనాల్లోనూ ఈ పూల రేకులను వాడుతారు. వీటిని నీటిలో మరుగబెట్టి ఔషధంగా సేవిస్తారు.

బంతి..

దీని శాస్త్రీయ నామం.. టాగెటవ్‌ పెటులా. వీటితో ఆరోగ్యకరమైన సుగంధ తైలాలు తయారు చేస్తారు. రక్తస్రావానికి మందుగా ఉపయోగి స్తారు. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. చర్మ వ్యాధులకు, వాతావరణం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లకు మందుగా ఉపయోగపడుతుంది. చర్మం ఎండవల్ల కందిపోయినప్పు డు, చిన్న దెబ్బలకు మందుగా పనిచేస్తుంది. కళ్ల కలక, కాలిన గాయాలు, తేనెటీగ కుడితే, రక్త నాళాలను శుద్ధి చేసే మందుల్లో బంతిపూలను విరివిగా వాడుతారు.

కనకాంబరం.. 

కనకాంబరాల్లో లెక్కకు మించిన ఔషధగుణాలున్నాయి. దీని ఆకులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచే స్తాయి. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారిస్తాయి.