బుధవారం 25 నవంబర్ 2020
Adilabad - Oct 22, 2020 , 00:13:40

మన బియ్యం మహారాష్ట్రకు..

మన బియ్యం మహారాష్ట్రకు..

  • సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులు
  • రాత్రివేళల్లో గుట్టుగా తరలింపు
  • వరుస దాడులతో వెలుగులోకి..

కుంటాల : పేదల కడుపు నింపేందుకు ప్రభు త్వం అందజేస్తున్న రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కులు గ్రామా ల్లో సంచరిస్తూ తక్కువ ధరకు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి రాత్రివేళల్లో క్వింటాళ్ల కొద్దీ సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ దందా అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నది. కొందరు ముఠాలుగా ఏర్పడి గ్రామాల్లో తిరుగుతూ చౌకగా రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. పెద్దమొత్తంలో సేకరించిన బియ్యాన్ని రాత్రి వేళల్లో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కుంటాల మండలంలో వరుసగా రేషన్‌ బియ్యం పట్టుబడుతుండడంతో అధికారుల్లో చలనం మొదలైంది. తాజాగా మంగళవారం 120 క్వింటాళ్ల బియ్యం పట్టుబడడం సంచలనంగా మారింది. గతంలోనూ నాలుగైదు సార్లు పలుచోట్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నా అక్రమార్కుల్లో మార్పురావడం లేదు. 

మన బియ్యానికి మహారాష్ట్రలో డిమాండ్‌..

ప్రభుత్వం అందజేస్తున్న మన రేషన్‌ బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ముఠాలుగా ఏర్పడి గ్రామా ల్లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నా రు. మహారాష్ట్రలో రూ.1400 వరకు క్వింటాల్‌ చొప్పున విక్రయిస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. మండలంలోని దౌనెల్లి, అంబుగాం, ఉమ్మడి మండలంలోని బూరుగుపల్లి గ్రామాల మీదుగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారు. గ్రామాల్లో కొందరు చిరు వ్యాపారులు బియ్యాన్ని సేకరించి  దళారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. 

అమ్మినా.. కొన్నా చర్యలు.. 

రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులు ఇతరులకు విక్రయించొద్దు. అలాంటి కార్డులను రద్దు చేస్తాం. ప్రజల వద్ద రేషన్‌ బియ్యం కొనుగోలు చేయడం కూడా నేరమే. పోలీసు, రెవెన్యూ శా ఖల సమన్యయంతో చర్యలు తీసుకుంటాం. 

- అడప శ్రీధర్‌, తహసీల్దార్‌