సోమవారం 30 నవంబర్ 2020
Adilabad - Oct 22, 2020 , 00:13:40

రాష్ట్రంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు

  • బీజేపీ నేత లక్ష్మణ్‌ అబద్ధాలు ఆడొద్దు
  • బీసీ నేత ప్రధానిగాఉండి ఏం చేశారు?
  • రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం
  • ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న  

  ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : బీసీ నేత దేశ ప్రధానిగా ఉన్నా బీసీల కోసం ఏం చేశారో బీజేపీ నేత లక్ష్మణ్‌ చెప్పాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్‌లోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీసీల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన లక్ష్మణ్‌ తెలంగాణ ప్ర భుత్వం బీసీలకు ఏమీ చేయడం లేదంటూ అబద్ధ్ధాలాడుతూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధ తి కాదని సూచించారు. బీసీ వర్గానికి చెందిన నేత దేశ ప్రధానిగా ఉన్నారని బీజేపీకి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారే తప్పా దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు ఏం చేశారో లక్ష్మణ్‌ సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వర్ణభారత్‌, స్టార్టప్‌ ఇండియా అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారే తప్పా ఆరున్నరేళ్ల పాలనలో బీసీలకు చే సిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలపై తనతో లక్ష్మణ్‌ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ చేశారు.

రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సంక్షేమ ప థకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో బీసీ విద్యార్థుల చదువుల కోసం 19 రెసిడెన్షియల్‌ పాఠశాలలుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 261 పాఠశాలలు, 19 జూనియర్‌ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతంలో 6,005 మంది బీసీ విద్యార్థులు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుకునే వారని, ప్రస్తుతం లక్ష మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు.

రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా మూడు లక్షల కుటుంబాలకు రూ.2,600 కోట్లు,  విదేశాల్లో చదువుకునే 1100 మంది బీసీ విద్యార్థులకు రూ.165 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బీసీల్లో వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రూ.1000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బీజేపీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల వ్యతిరేక పార్టీగా ముద్రపడిందని, ఆ పార్టీ నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు బండారి సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.