గురువారం 03 డిసెంబర్ 2020
Adilabad - Oct 22, 2020 , 00:13:40

మీ త్యాగం మరువం...

మీ త్యాగం మరువం...

  • శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులే కీలకం
  • స్తూపం వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
  • పట్టణాల్లో భారీ ర్యాలీలు.. మొక్కలు నాటిన ప్రముఖులు..
  • అమరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేత

ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులే కీలకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా బుధవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. జ్ఞాపికలు అందజేశారు. వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల  జిల్లా మందమర్రిలో సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్‌  జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌,  ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌, మంచిర్యాల బెటాలియన్‌లో కమాండెంట్‌ సురేశ్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు, నిర్మల్‌  జిల్లాలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ,  జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. 

ఎదులాపురం/నిర్మల్‌ అర్బన్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. విధి నిర్వహణలో వారి ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు, బాధ్యతలు స్ఫూర్తిదాయకమని పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌, శిక్షణ ఐపీఎస్‌ అధికారి అక్షాన్ష్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఏఎస్పీ రాంరెడ్డి పాల్గొని, అమరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, కమాండెంట్‌  ఎంఐ సురేశ్‌ అమరులకు నివాళులర్పించారు. శ్రీరాంపూర్‌లో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ 2కే రన్‌ను ప్రారంభించారు. బెల్లంపల్లి ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, ఏసీపీ రహెమాన్‌ పుష్పగుచ్ఛం పెట్టి, నివాళులర్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ, ఏఎస్పీ సుధీంద్ర పాల్గొని విధి నిర్వహణలో సిబ్బంది సేవలను ప్రశంసించారు. అమరుల కుటుంబాలకు మెమొంటోలు అందజేశారు.