బుధవారం 02 డిసెంబర్ 2020
Adilabad - Oct 20, 2020 , 06:16:23

టీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజన గ్రామాల అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజన గ్రామాల అభివృద్ధి

ఆదిలాబాద్‌ రూరల్‌ : జిల్లాలోని గిరిజన గ్రామాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందాయని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గిరిజన గ్రామాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనడం సిగ్గు చేటన్నారు. 73 ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌, బీజేపీలు చేయని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరున్నరేళ్లలో చేసిందన్నారు. నేడు 90శాతం గిరిజన గ్రామాలకు రోడ్లు వేశారన్నారు. బీజేపీ అధ్యక్షుడి సొంత గ్రామానికి సైతం రోడ్లు వేసిన ఘనత ఎమ్మెల్యే జోగు రామన్నకే దక్కుతుందన్నారు. బోథ్‌ పొచ్చెర నుంచి ఘన్‌పూర్‌ వరకు రూ.75కోట్లతో రోడ్లు వేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? అని ఎంపీని ప్రశ్నించారు. కేంద్రం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుంటే కనీసం అడిగిన పాపాన ఎంపీ పోలేదన్నారు. బీజేపీ నాయకులు ఆస్తుల వివరాలు కావాలంటే ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్‌కు ఎప్పుడో సమర్పించారని, అక్కడి నుంచి తెప్పించుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషిని చూసి బీజేపీ నాయకుల మతిపోతున్నదన్నారు. దమ్ముంటే అభివృద్ధి గురించి బీజేపీ నాయకులు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వచ్చి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చకు బీజేపీ నాయకులు రావాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌ . కౌన్సిలర్‌ బండారి సతీశ్‌, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.