మంగళవారం 27 అక్టోబర్ 2020
Adilabad - Oct 19, 2020 , 02:20:01

నాలుగు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలు

నాలుగు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలు

స్థలాలు కేటాయించిన సర్కారు   

ఒక్కో నిర్మాణానికి పార్టీ నుంచి రూ.60 లక్షలు

ప్రధాన పనులన్నీ పూర్తి.. దసరాకు ప్రారంభించేందుకు సన్నాహాలు

సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ హాజరయ్యే అవకాశం

నిర్మల్‌/ఆదిలాబాద్‌/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌, కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ మాదిరిగా జిల్లాకో పార్టీ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ నిర్మిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవనాల నిర్మాణం తుది దశకు చేరుకున్నది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కొండాపూర్‌ వద్ద, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్‌లో, ఆదిలాబాద్‌లోని కైలాస్‌నగర్‌ రోడ్డులోని వైట్‌ క్వార్టర్స్‌లో, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వీటిని నిర్మిస్తున్నారు. నాలుగు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. నిర్మల్‌లో ఎకరం, ఆదిలాబాద్‌లో 36 గుంటలు, ఆసిఫాబాద్‌లో 2.25 ఎకరాలు, మంచిర్యాలలో ఎకరం స్థలం కేటాయించింది. తెలంగాణ భవన్‌ నిర్మాణానికి ప్రతి జిల్లాకు రూ.60 లక్షల చెక్కును టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అందజేశారు. నిర్మల్‌లో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి రూ.కోటి వరకు వ్యయమవుతుండగా, మిగతా రూ.40 లక్షలను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సొంతంగా వెచ్చించారు.

నాలుగు నెలల్లో పూర్తి..

పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేయగా, నిర్మాణాలు శకవేగంగా పూర్తి చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ప్రధాన పనులు పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. విజయదశమి నాటికి అందుబాటులోకి తేవాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని చోట్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. ప్రస్తుతం చిన్న చిన్న పనులు పూర్తి చేసి.. తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం కేసీఆర్‌ లేదంటే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధంగా ఉంచారు. ఆయా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి అల్లోలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌లో కార్యాలయం, సమావేశ మందిరం, వంట గది, స్టోర్‌ రూం, వాచ్‌మెన్‌ క్వార్టర్లు, పార్కింగ్‌, టాయిలెట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యాలయం, సమావేశం హాల్‌, వంటగది నిర్మాణ పనులు పూర్తికాగా, స్టోర్‌రూం, వాచ్‌మన్‌ క్వార్టర్లు, టాయిలెట్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అనువుగా ఉండేలా పార్టీ కార్యాలయాలకు రూప కల్పన చేశారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించేలా సమగ్ర చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగానే అన్ని హంగులతో నిర్మాణం చేసి.. దసరా నాటికి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, సమీక్షలు ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహించేవారు. బస్టాండ్‌ నుంచి ఫంక్షన్‌ హాళ్లు దూరంగా ఉండడంతో వెళ్లేందుకు కార్యకర్తలు కొంతమేర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. జిల్లా కేంద్రంలో ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ శ్రేణులకు అనువుగా ఉండేలా స్థలాలను కేటాయించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తవుతుండడంతో.. పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ చౌక్‌, బస్టాండ్‌కు దగ్గరలోని ఉంది. నిర్మల్‌లో మంచిర్యాల-ఖానాపూర్‌ రోడ్డులో కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఉండగా, మూడు నియోజకవర్గాలకు అనుకూలంగా ఉంది. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లోనూ అందరికీ సౌకర్యంగా ఉండేలా నిర్మించారు.logo