ఆదివారం 25 అక్టోబర్ 2020
Adilabad - Oct 01, 2020 , 04:28:57

చూడముచ్చటగా వేదిక

చూడముచ్చటగా వేదిక

  • రైతుల చిత్రాలతో ఆకట్టుకుంటున్న భవనాలు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 101 రైతు వేదికల నిర్మాణాలు
  • కొన్నిచోట్ల పూర్తి.. మిగతా చోట్ల వివిధ దశల్లో పనులు
  • పర్యవేక్షిస్తున్న అధికారులు.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు
  • ఈనెల 10లోగా పూర్తిచేసేందుకు చర్యలు

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు చూడముచ్చటగా రూపుదిద్దుకుంటున్నాయి. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. జయహో రైతన్న, యువతా మేలుకో.. రైతన్నను ఆదుకో.. వంటి క్యాప్షన్లు బాగున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 101 భవనాలు నిర్మిస్తుండగా.. ఒక్కో నిర్మాణానికి రూ. 22 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో కొన్ని పూర్తికాగా.. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తూ.. అన్ని భవనాలను ఈ నెల 10 లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.        ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌, పంటల కొనుగోళ్లు లాంటి పథకాలు దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రైతుల సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడంతో పాటు వారికి సంబంధించిన ఇతర అవసరాల కోసం నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు జిల్లాలో వేగంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 101 వ్యవసాయ క్లస్టర్లలో రైతువేదికలను నిర్మిస్తున్నారు. ఉట్నూర్‌ మండలంలో 8, ఇంద్రవెల్లి మండలంలో 6, గాదిగూడలో 4, నార్నూర్‌లో 5, తాంసిలో 4, భీంపూర్‌లో 6, తలమడుగులో 7, గుడిహత్నూర్‌లో 5, ఇచ్చోడ మండలంలో 6, సిరికొండలో 3, బజార్‌హత్నూర్‌లో 6, బోథ్‌లో 7, నేరడిగొండలో 7, జైనథ్‌లో 11, మావలలో ఒకటి, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో 7, బేలలో 8 చొప్పున రైతు వేదికల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒక్కో దానిని రూ.22 లక్షలతో నిర్మిస్తుండగా.. భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పది రోజుల కిందట తలమడుగు రైతు వేదిక నిర్మాణం పూర్తయ్యింది. ఉట్నూర్‌, బోథ్‌, ఇచ్చోడలో నిర్మిస్తున్న రైతువేదికల పనులు చివరిదశకు చేరుకున్నాయి.

అధికారుల నిరంతర పర్యవేక్షణ..

జిల్లాలో నిర్మిస్తున్న రైతుల వేదికల పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మండల ప్రత్యేకాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు సై తం రైతు వేదికల నిర్మాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 10 నాటికి జిల్లాలోని 101 వ్యవసాయ క్లస్టర్లలో రైతువేదిక ని ర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఇటీవల జరిగిన సమావేశంలో సూచించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులు, వ్యవసాయశాఖ జిల్లా అధికారులు గ్రామాల్లో ప ర్యటిస్తూ రైతు వేదికల పనులను పరిశీలిస్తున్నారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నా రు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యం చేయొద్దని, ఏమైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని సూచిస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు వేగంగా సాగుతుండడంతో పాటు త్వరగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.  

ఉట్టి పడుతున్న అన్నదాత చిత్రాలు 

బోథ్‌: బోథ్‌లో నిర్మించిన రైతు వేదిక భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పూర్తి హంగులతో నిర్మాణం పూర్తయింది. ఉట్టి పడుతున్న వ్యవసాయ సాగు చిత్రాలతో ఆకట్టుకుంటున్నది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వేదిక నిర్మాణం చేపట్టారు. క్లస్టర్‌ స్థాయిలో వ్యవసాయ సూచనలు, సలహాలు, సాంకేతిక సమాచారం అందించడం కోసం ఈ భవనాన్ని వినియోగించనున్నారు. భవనం లోపలి భాగంలో ఎక్కడా లేని విధంగా మార్బుల్‌తో నిర్మించారు. వ్యవసాయ సాగు విధానంలో రైతుల చిత్రాలతో పాటు రైతు బంధు పథకం, కుటుంబ సమేతంగా పొలం పనులకు వెళ్తున్న చిత్రం, ఆవు, మేక, గొర్రె, కోడిపుంజు, వరి మొక్కను మిళితం వేస్తూ చిత్రాలను వేయించారు. బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, మండల పరిషత్‌ ఏఈ నర్సింగ్‌, ఉన్నతాధికారుల సహకారంతో 80 రోజుల వ్యవధిలోనే దీని నిర్మాణం పూర్తి చేయించారు. 


logo