శుక్రవారం 23 అక్టోబర్ 2020
Adilabad - Sep 29, 2020 , 02:11:57

రెవెన్యూ చట్టాన్ని మనసారా స్వాగతిస్తూ భారీ ర్యాలీ

రెవెన్యూ చట్టాన్ని మనసారా స్వాగతిస్తూ భారీ ర్యాలీ

  • n 500 ట్రాక్టర్లు, 300 ఎడ్లబండ్లతో  ఆశీర్వాద యాత్ర
  • n పల్లెల నుంచి కదిలివచ్చిన కర్షకలోకం
  • n జై కేసీఆర్‌ నినాదాలతో మారుమోగిన పట్టణం
  • n సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
  • n కేంద్ర వ్యవసాయ బిల్లుపై నిరసన

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ జిల్లాలో రెవెన్యూ చట్టానికి మద్దతుగా సోమవారం రైతులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా నుంచి పట్టణంలోని తెలంగాణ చౌక్‌ వరకు నాలుగు కిలోమీటర్ల మేర కొనసాగింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు 500 ట్రాక్టర్లు, 300 ఎడ్లబండ్లపై తరలివచ్చారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, మాజీ ఎంపీ నగేశ్‌ ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. రెండున్నర గంటలపాటు సాగిన ర్యాలీలో నాయకులు, రైతులు, మహిళా రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లకు కేసీఆర్‌ ఫ్లెక్సీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు కట్టి జై కేసీఆర్‌, జైజై తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. తెలంగాణ చౌక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, రైతులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, నాయకులు యూనిస్‌ అక్బాన్‌, రంగినేని మనీషా పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు నష్టం వాటిల్లుతుంది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయి. రైతుల ఇబ్బందులు తీరుతాయి.

- జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

రైతులకు మంచి చేస్తున్నరు.. 

ఈ రోజు మాకు మస్తు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సారు కొత్త తహసీల్‌ కానూన్‌తోని అందరికీ మంచిగ చేస్తున్నరు. అందుకే తోటి రైతులతో కలిసి ఎడ్లబండ్లు కట్టుకుని అచ్చిన. కాస్తకారి (రైతు) బతుకులు తెలంగాణ సర్కారు బాగు చేసింది. తెలంగాణ రాక ముందు ఎవుసం చేద్దామంటే భయపడేటోళ్లం. ఇప్పుడు సంతోషంగా పంటలు పండిస్తున్నాం. సీఎం సారుకు మేమంత రుణపడి ఉంటం.

- కుమ్ర మారుతి, గిరిజన రైతు, చిట్టెల్‌బోరి, ఆదిలాబాద్‌

మా కష్టాలు తీరినయ్‌.. 

కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్‌ సారు అమలు చేయడంతో ఆనందంగా రైతులమందరం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ తీస్తున్నం. ఊళ్లలో పట్వారీలు బాగా పరేషాన్‌ చేసేటోళ్లు. భూమి పనంటే సతాయించేటోళ్లు. మా తాతముత్తాతల కాలం సంది  పట్వారీలతో మస్తు ఏగిచ్చినం. అందుకే సర్కారు తాహసీల్‌ కానూన్‌ను సక్కగా చేస్తున్నది. ఇప్పుడు మా కష్టాలు దూరమయితయ్‌.

- విఘ్నేశ్వర్‌, గిరిజన రైతు, చిట్టెల్‌బోరి, ఆదిలాబాద్‌ రూరల్‌ 

తరాల ఆస్తి ఇచ్చిన్రు.. 

సీఎం కేసీఆర్‌ సారు మాకు దళితబస్తీ కింద ఉచితంగా మూడెకరాల భూమి ఇచ్చిన్రు. సర్కారు ఇచ్చిన భూమిలో మూడేళ్ల నుంచి రెండు పంటలు తీస్తున్నం. రైతుబంధు వస్తున్నది. ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం అమలు చేసి మాలాంటి ఎందరో రైతులకు మంచి చేసిన్రు. కొత్త కానూన్‌ వల్ల చిన్న రైతులు, కుటుంబాలకు పరేషాన్‌ ఉండదు. సర్కారు రైతులను అన్ని తీర్ల ఆదుకుంటున్నది. మేమంతా సంతోషంగా ర్యాలీకి అచ్చినం.  - అవినాశ్‌, రైతు, పొచ్చెర, ఆదిలాబాద్‌ రూరల్‌ 

ఏండ్ల సంది ఇబ్బందులు పడుతున్నం.. 

భూముల సమస్యలతో రైతులందరం ఏండ్ల సంది ఇబ్బంది పడుతున్నం. మాలాంటి పేద రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు. ఈ చట్టంతోని రైతులకు ఇంకా అన్ని వర్గాలవారికే లాభమవుతుంది. మునుపు తాసీలోళ్లతోని మస్తు పరేషానుండె. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌, సబ్సిడీ, రైతు కల్లాలు, వేదికలు, మండలంలనే పంటలు కొనుడు.. గిట్ల రైతులకు ఏది అవసరమో అవన్నీ అమలు చేస్తున్నది సర్కారు. అందుకే సంతోషంగా ర్యాలీ తీసినం. తోటి రైతులతోని గిట్ల ర్యాలీల ఉండుడు సంతోషంగా ఉన్నది.

- జాదవ్‌ రంజన్‌, చిచ్‌ధరి ఖానాపూర్‌, ఆదిలాబాద్‌ రూరల్‌ 

రైతుల కోసం సాయం చేస్తున్నడు.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ రైతుల కోసం బాగా సాయం చేస్తున్నడు. ఇత్తనాల కాన్నుంచి పంట అమ్మే దాకా రైతులకు చాలా సౌలత్‌ అయింది. ఇప్పుడు భూముల సమస్యల పరిష్కారం కోసం కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. గ్రామాల్లో రైతులు ఏ చిన్న సమస్య వచ్చినా తహసీల్‌ ఆఫీసులు, పట్వారీల చుట్టూ తిరిగి పారేషాన్‌ అయ్యేటోళ్లం. ఎన్ని సార్లు తిరిగినా పని కాకపోవడంతో ఇబ్బందులు పడేటోళ్లం, ఇప్పడు ఎలాంటి సమస్యలు లేకుండా పోయాయి.

- పెందూర్‌ భూమన్న, రైతు, అంకోలి, ఆదిలాబాద్‌


logo