గురువారం 26 నవంబర్ 2020
Adilabad - Sep 21, 2020 , 00:45:59

సిరుల పంటకు సాంకేతిక పరిజ్ఞానం

సిరుల పంటకు సాంకేతిక పరిజ్ఞానం

వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే, అద్భుతాలు ఆవిష్కృ తమవుతాయి. సాగులో సందేహాలను నివృత్తి చేసుకుని అన్నదాత సిరులు పండిస్తాడు. ప్రస్తుతం రైతు చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు అక్కడికక్కడే సాగు సమాచారం అందుతున్నది. రూపాయి ఖర్చు లేకుండానే పంట పొలాల్లో సమస్య తీరుతున్నది. వ్యవసాయాధికా రుల వద్దకు వెళ్లకుండానే నిమిషాల్లోనే పని పూర్తవుతున్నది. సిరుల పంటకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ‘నమస్తే తెలంగాణ” అందిస్తున్న ప్రత్యేక కథనం.- ఇచ్చోడ

ఇచ్చోడ: ఆదిలాబాద్‌ జిల్లాలో 5, 68, 546 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నాయి. మొత్తం 18 మండలాల్లో పత్తి (తెల్ల బంగారం) 4 , 35,088 ఎకరాలు, సోయాబీన్‌ 46,423 ఎకరాలు, కందులు 85,742 ఎకరాలు, వరి 1293 ఎకరాల్లో నియంత్రిత పద్ధతిలో రైతులు సాగు చేస్తున్నారు. సుమారు 60 శాతం మంది రైతన్నలు సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను సెల్‌ఫోన్‌ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కార్యాలయానికి వెళ్తే వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారో... లేదో. పని మీద వేరే గ్రామానికి వెళ్తే.. వేచి చూసే అక్కర లేకుండా ప్రభుత్వం చేసింది. సెల్‌ఫోన్‌ ద్వారా నేరుగా సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. ఇలా సెల్‌ఫోన్‌ వినియోగించి, తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. సిరుల పంట పండించేందుకు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

అధికారులు అందుబాటులో లేకున్నా..

ప్రస్తుతం వ్యవసాయ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా, గ్రామాల్లోకి వెళ్తూ రైతుల సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. మధ్యాహ్నం తిరిగి వచ్చి మిగతా శాఖాపరమైన పనుల్లో నిమగ్నమవుతున్నారు. పంటలు సాగు చేసే సమయంలో క్షేత్రస్థాయిలో రైతులకు సమస్యలోస్తే అధికారులు అందుబా టులో లేకున్నా సెల్‌ఫోన్‌ ద్వారా సాగుపై సందేహాలను నివృత్తి చేసుకునే వీలుంది. ఈ విధానంతో జిల్లాలోని రైతులు నేరుగా ఏరువాక శాస్త్రవేత్తలతో, జిల్లా, మండలాల అధికారులతో మాట్లాడుతూ సూచనలు, సలహాలు పొందుతున్నారు. 

ఇలా సంప్రదించాలి..

రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. కంప్యూటర్‌ మాదిరిగానే సెల్‌ఫోన్‌లో కూడా సమాచారం అందుతుంది. ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 18004291939కు ఫోన్‌ చేస్తే ‘కిసాన్‌ కాల్‌ సెంటర్‌' మీకు స్వాగతమంటూ వినిపిస్తుంది. జిల్లా, మం డలం, గ్రామం, రైతు పేరు పంటల సాగు తదితర అంశాలను అడుగు తారు. సమస్యకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. 

ఆన్‌లైన్‌ ద్వారా..

వ్యవసాయం, ఉద్యానవనం, పశువైద్యం, మత్స్యశాఖలకు సంబంధించి ఏదో ఒక విభాగాన్ని ఎంచుకుంటూ రైతులు సమాధానాలు పొందుతు న్నారు. కాస్త కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన వారంతా www.tsagrinet. gov.in లోకి వెళ్లి సాగు సమాచారం తెలుసుకుంటున్నారు. మరి కొందరు రైతులు యూట్యూబ్‌ ద్వారా తెలుసుకుంటున్నారు.

తక్షణమే సమాచారం...

సాగు విధానంలో వచ్చిన సందేహాలను పంట చేలోనే ఉంటూ తెలుసుకుంటున్న. కొత్త పంటల సాగు విధానం గురించి వివరంగా చెబుతున్నరు. విత్తనాలు, ఎరువుల మోతాదు, పంటలపై మందుల పిచికారీ అంశాలపై వివరిస్తున్నరు. పంటలు తెగుళ్ల బారిన పడిన సమయంలో అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా సెల్‌ఫోన్‌తో తెలుసుకున్న సమాచారం ఎంతో మేలు చేస్తున్నది. ఈ విధానం మరింతగా పెరగడానికి రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.-బొంగురాల జహేందర్‌ రైతు కోకస్‌మన్నూర్‌ , ఇచ్చోడ

సాగు విధానం తెలుసుకోవచ్చు

పంట పొలాలను క్రిమికీటకాలు ఆశించి న సమయంలో దుకాణాదారుడు ఇచ్చిన మందును పిచికారీ చేయడం రైతులకు అలవాటుగా మారింది. కిసాన్‌ కాల్‌ సెంటర్‌కు దుకాణం నుంచే ఫోన్‌ చేసి మం దుల వివరాలను తెలుసుకోవాలి. ఈ సెంటర్‌ నుంచి మనకు సరైన సమాచారం వస్తుంది. ఒక్కోసారి దుకాణాదారులు వారి వ్యాపారానికి అనుగుణంగా మందులు అంటగట్టే అవకాశం ఉంటుంది.    -నౌలె సంజీవ్‌ రైతు ముక్రా (కే), ఇచ్చోడ 

సాంకేతిక వాడకం పెరిగింది..

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా మంది రైతులు స్వయంగా ఫోన్లు చేసి సందేహాలను అడిగి తెలుసు కుంటున్నారు. మేము ఇచ్చిన సూచనలు,సలహాలు పాటిస్తున్నా రు. సాగులో ఇబ్బందులు ఎదు ర్కొంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఫోన్‌ చేసి సమాచారాన్ని అడిగి తెలు సుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసేందుకు మేమెప్పు డూ వెనుకాడం. ఓపికతో సమాధానం చెబుతున్నాం. - జాదవ్‌ కైలాశ్‌, వ్యవసాయ అధికారి, ఇచ్చోడ