శనివారం 31 అక్టోబర్ 2020
Adilabad - Sep 18, 2020 , 01:20:37

పేకాట నిర్వహకుడిపై పీడీ యాక్ట్‌

 పేకాట నిర్వహకుడిపై పీడీ యాక్ట్‌

  • కమిషనరేట్‌ పరిధిలో తొలిసారిగా అమలు 
  •  ఉత్తర్వు కాపీని  అందించిన పోలీసులు
  •  వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలింపు

ఫర్టిలైజర్‌సిటీ/గర్మిళ్ల :  పేకాట స్థావరాలపై రామగుండం కమిషనరేట్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శిబిరాలపై వరుసగా దాడులు చేస్తూ నిర్వాహకుల గుండెల్లో వణుకుపుట్టి స్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కమిషనరేట్‌ పరిధిలోని చెన్నూర్‌ మండలం నాగారానికి చెందిన జూదం నిర్వాహకుడు అన్నాల తిరుపతిపై  సీపీ సత్యనారాయణ గురువారం పీడీ యాక్టు అమలు చేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తిరుపతికి మంచిర్యాల సీఐ లింగయ్య అందజేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పట్టణాలు, గ్రామాల శివారు అటవీ ప్రాంతాల్లో పేకాట శిబిరాలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారనే సమాచారంతో చాలా చోట్ల టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేసింది. దాడులు చేసి పేకాటరాయుళ్లు, నిర్వాహకులను పట్టుకున్నారు. అయితే క్లబ్‌లు మూసివేయడంతో కొంతకాలంగా పేకాట రాయుళ్ల చేతులు కట్టేసినట్లయింది.

దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, వని, రాజూరా ప్రాంతాలకు వెళ్లి జూదం ఆడుతున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పేకాటను పూర్తిగా అరికట్టడంతో కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర జిల్లాలకు బృందాలుగా బయటకు వెళ్లి అక్కడ మూడు ముక్కలాటలో మునిగి తేలుతున్నారు. దీనిపై సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. నిర్వాహకులు, ఆడేవారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంచిర్యాల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేకాట స్థావరం నిర్వహిస్తున్న అన్నాల తిరుపతిపై ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతనిపై రాచకొండ, రామగుండం పోలీస్‌ కమిషనరేట్లు, జయశంకర్‌ భూపాలపల్లి పరిధిలో 4 కేసులు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి అందర్‌ బాహార్‌ పేరుతో పేకాట నిర్వహిస్తున్నారని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి వారితో కుటుంబాలు రోడ్డు పాలవుతాయని పీడీ యాక్టు అమలు చేసినట్లు పేర్కొన్నారు.  

నిర్వాహకులపై టాస్క్‌ఫోర్స్‌ నిఘా..

అందర్‌ బాహార్‌ పేరిట జూదం నిర్వహిస్తూ, అధిక వడ్డీలకు ఫైనాన్స్‌లు ఇస్తూ పేకాట రాయుళ్లను పోగుచేసి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి  వారిపై నిఘా ఉంచి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి, మంచిర్యాల, సీసీసీ నస్పూర్‌, చెన్నూరు, గోదావరిఖని, పెద్దపల్లి, రామగిరి, మంథని ప్రాంతాలకు చెందిన పేకాట ఆడుతున్న వారి సమాచారం సేకరించి జాబితా సిద్ధం చేశామని చెప్పారు.  టాస్క్‌ఫోర్సు సీఐలు రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్‌ఐలు షేక్‌ మస్తాన్‌, కిరణ్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. అన్నాల తిరుపతిపై పీడీ యాక్టు అమలుకు కృషి చేసిన జైపూర్‌ ఏసీపీ, మంచిర్యాల ఇన్‌చార్జి ఏసీపీ నరేందర్‌, ఇన్‌స్పెక్టర్‌ లింగయ్యను సీపీ అభినందించారు.