శనివారం 31 అక్టోబర్ 2020
Adilabad - Sep 18, 2020 , 00:42:23

నయా ఎల్‌ఆర్‌ఎస్‌

నయా ఎల్‌ఆర్‌ఎస్‌

  • ఫీజుల్లో మార్పు చేస్తూ సర్కారు ఉత్తర్వులు
  • జీవో నంబర్‌ 135 విడుదల
  • పాత మార్కెట్‌ విలువ ప్రకారమే క్రమబద్ధీకరణ 
  • శ్లాబులవారీగా చార్జీలు
  • ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల యజమానులకు ఊరట 
  • అక్టోబర్‌ 15 వరకు గడువు

తాంసి : అనధికారికంగా ఏర్పాటు చేసిన లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత నెలలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 131కు సవరణలు చేస్తూ, తాజాగా గురువారం జీవో నంబర్‌ 135 విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం ఫీజులను నిర్ణయించగా, అనధికారిక, అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారికి ఈ ఫీజులు భారంగా మారినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రజల విన్నపం మేరకు క్రమబద్ధీకరణ రుసుమును తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్‌ కొన్న రోజు ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం, చార్జీలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

వ్యక్తిగత ప్లాట్లకు రూ.1000 రిజిస్ట్రేషన్‌ ఫీజు    

ఈ ఏడాది ఆగస్టు 26 వరకు రిజిస్ట్రేషన్‌ అయిన అనధికారిక ప్లాట్లకు, లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత ప్లాట్ల యజమానులు రూ.1000 రిజిస్ట్రేషన్‌ కింద చెల్లించాలి. అలాగే లేఅవుట్‌ యజమానులు రూ.10 వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఈ ఫీజును, ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో, మీసేవ కేంద్రాల్లో, సీఎస్‌సీలలో, సెల్‌ యాప్‌ ద్వారా చెల్లించవచ్చు.

వీటిని రిజిస్ట్రేషన్‌ చేయరు..

చెరువులు, కుంటలు, నదీ పరిసరాలు, శిఖం భూములు మొదలైన వాటి పరిధిలో ఉన్న లే అవుట్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నదుల సమీపంలో 30 మీటర్లలోపు ఉన్న వాటిని క్రమబద్ధీకరించరు. అలాగే 10 హెక్టార్లకుపైగా ఉన్న చెరువుల సమీపంలోని వాటిని కూడా క్రమబద్ధీకరించడానికి వీలులేదు. 10 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు, కుంటలు, శిఖం భూములకు 9 మీటర్ల దూరంలో ఉన్నవాటిని మాత్రమే క్రమబద్ధీకరించడానికి వీలుంది. నీటి కాలువలకు, వాగులకు 9 మీటర్ల అవతల ఉన్న వాటిని మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. మురుగు కాలువలకు రెండు మీటర్ల కంటే దగ్గరగా  ఉన్న ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

అక్టోబర్‌15 వరకు గడువు.. 

అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అక్టోబర్‌ 15 వరకు గడువు విధించింది. ఈ తేదీలోగా సంబంధిత రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సేల్‌డీడ్‌లు తీసుకుని వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొదటి పేజీలో సెల్ఫ్‌ అటెస్టెడ్‌ చేయాలి. అలాగే లే అవుట్లలో మొత్తం ప్లాట్లలో కనీసం 10 శాతం అమ్ముడు పోకుంటే అందుకు సంబంధించిన పత్రాలను సంబంధిత యజమా ని సమర్పించాలి. ఇందుకు సంబంధించిన సేల్‌డీడ్‌ను అందజేయా లి. క్రమబద్ధీకరణకు ఇదే చివరి గడువు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భవిష్యత్‌లో ఎలాంటి క్రమబద్ధీకరణ ఉండదని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పేర్కొన్నది.

భారీ ఊరట..

ప్రభుత్వం గత నెల 30న అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత రిజిస్ట్రేషన్‌ ప్రకారం ఫీజులు చెల్లించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంలో యజమానులకు భారీ ఊరట లభించింది.

ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చార్జీలు..  

2020 ఆగస్టు 26 రిజిస్ట్రేషన్‌        క్రమబద్ధీకరణ చార్జీలు   

 మార్కెట్‌ విలువ  చ.మీటర్‌ 

3,000 లోపు                                     20 శాతం

3,001 నుంచి 5,000                     30 శాతం

5,001 నుంచి 10,000                        40 శాతం

10,001 నుంచి 20,000                         50 శాతం

20,001 నుంచి 30,000                             60 శాతం

30,001 నుంచి 50,000                     80 శాతం

50,001కు పైన                             100 శాతం