మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 13, 2020 , 00:22:37

జల సవ్వడి

జల సవ్వడి

కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం.. ఆకాశాన్ని తాకుతున్న ట్టున్న కొండలు.. పక్షుల కిలకిలరావాలు.. అక్కడక్కడ కనిపించే వన్యప్రాణులు.. గలగల పారే సెలయేళ్లు.. వందల అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతాలు.. పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఆ జలపాతాలు చూడాలంటే కరోనా నిబంధనలు పాటిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను సందర్శిస్తే సరి.. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కట్టిపడేస్తున్న జలపాతాలు

  • n 250 అడుగుల ఎత్తు నుంచి పాల నురగలా జాలువారే జలం
  • n పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి రమణీయత

రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో అడవులు ఆకుపచ్చ చీరను అలంకరించుకున్నాయి. వాగులు వంకలు నీటితో ఉరకలేస్తూ జలకళను సంతరించుకున్నాయి. అడవుల్లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొండలపై నుంచి వచ్చే నీటి ప్రవాహంతో సహజ సిద్ధమైన లోయల్లోనికి జాలువారుతున్న నీరు తెల్లని నురగలా కనువిందు చేస్తున్నది.                   

- కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/ 

బోథ్‌/నేరడిగొండ/ నార్నూర్‌/ఇచ్చోడ/బజార్‌హత్నూర్‌

పొచ్చెర.. 

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ధన్నూర్‌(బీ), అందూర్‌ ప్రాంతాల్లో కురుస్తున్న వానతో నీటి ప్రవాహం పెరిగింది. జలపాతం క్రాస్‌ రోడ్డు వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అనుమతించడం లేదు. 

ఇలా వెళ్లాలి.. : నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండలం ఉంటుంది. ఇక్కడి నుంచి 3.5 కిలోమీటర్లు వెళ్తే బోథ్‌ క్రాస్‌రోడ్డు వస్తుంది. ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్తే పొచ్చెర జలపాతం దర్శనమిస్తున్నది.

కొర్టికల్‌ 

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలో కొర్టికల్‌ జలపాతం ఉంది. ఇది కొర్టికల్‌-బి గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా వెలిసింది.  ఇలా వెళ్లాలి : నిర్మల్‌ నుంచి 20 కిలోమీటర్లు. ఆదిలాబాద్‌ నుంచి 60 కిలోమీటర్లు. హైవే 44పై ప్రయాణించాలి. ఇది జాతీయ రహదారి పక్కనే ఉంది. బ్రిడ్జి పైనుంచి కూడా జలపాతాన్ని వీక్షించవచ్చు.

మైసమాల్‌

ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం ఝరి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మైసమాల్‌ జలపాతం ఉంది. ఈ జలపాతం వర్షాకాలంలో కనువిందు చేస్తున్నది.

ఇలా వెళ్లాలి.. : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామానికి వెళ్లాలి. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. అక్కడి నుంచి ఝరి గ్రామానికి కిలోమీటరు దూరం వెళ్తే జలపాతం వస్తుంది.

చింతల మాదార..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదార జలపాతం దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి జాలు వారుతున్నది. కొండల పైనుంచి బండ పరుపుగా ఉన్న రాళ్లపై తెల్లటి నురగ వలె ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. 

ఇలా వెళ్లాలి.. : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించి తిర్యాణి మండల కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు బస్సు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించి మాదారం గ్రామానికి వెళ్లొచ్చు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. 

మిట్టె..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ అడవుల్లో మిట్టె జలపాతం ఉంది. దీనినే సప్త గుండాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడి అడవుల్లో ఒకదాని తరువాత ఒకటి ఏడు జలపాతాలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతారు.

ఇలా వెళ్లాలి.. : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మిట్టె జలపాతం ఉంది. జిల్లా కేంద్రం నుంచి లింగాపూర్‌ వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో పిట్టగూడ వరకు వెళ్లాలి. ఈ గ్రామం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు అడవిలో నడిచి వెళ్లాలి. మొదట పది అడుగుల ఎత్తు నుంచి జాలువారే పెద్ద మిట్టె వస్తుంది. తరువాత 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారె రెండో మిట్టె కనువిందు చేస్తుంది.

గుండాల.. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల జలపాతం నీటి ప్రవాహంతో జలకళ సంతరించుకున్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కొండ పైనుంచి జాలువారుతున్న నీరు కొత్త అందాలను తీసుకొస్తున్నది. దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి పాల నురుగుల వలె జాలువారుతూ ఆహ్లాదం నింపుతున్నది. 

ఇలా వెళ్లాలి.. : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లాలి. ఇక్కడి నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న రోండపల్లి గ్రామం వరకు బస్సులో చేరుకోవాలి. అక్కడి నుంచి దాదాపు 9 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే వస్తుంది.

కనకాయ..

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని బలన్‌పూర్‌ గ్రామ సమీపంలో  కనకాయ జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి భారీగా చేరిన వరదనీరు ఎత్తైన ప్రదేశం నుంచి గలగల పారుతూ చూపరులకు కనువిందు చేస్తున్నది.

ఇలా వెళ్లాలి.. : ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజార్‌హత్నూర్‌ మండలం బలన్‌పూర్‌ గ్రామం మీదుగా కాలినడకన జలపాతానికి చేరుకోవచ్చు.

కుంటాల.. 

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గ్రామంలో ఉంది. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్నది. యేడాది మొత్తం వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. 

ఇలా వెళ్లాలి.. : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. నిర్మల్‌ నుంచి 30 కిలోమీటర్లు జాతీయ రహదారి 44 మీదుగా నేరడిగొండ వరకు ప్రయాణించాలి. మండల కేంద్రం నుంచి కుంటాల జలపాతం వరకు మరో 11 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రైవేట్‌ వాహనాల్లో చేరుకోవచ్చు.

పారేఖాతి.. 

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం మాన్కాపూర్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో పారేఖాతి జలపాతం ఉంది. ఈ జలపాతం చుట్టుపక్కల పచ్చదనంతో కళకళాడుతున్నది. గుహపై నుంచి పడుతున్న నీటి ప్రవాహం కనువిందు చేస్తున్నది.

ఇలా వెళ్లాలి.. : ఆదిలాబాద్‌ నుంచి వెళ్లి ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద దిగాలి. ఎక్స్‌రోడ్డు నుంచి మాన్కాపూర్‌ గ్రామానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే పారేఖాతి జలపాతాన్ని తిలకించవచ్చు.

గుండాయి.. 

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని నడ్డంగూడ గ్రామ సమీపం వద్ద గుండాయి జలపాతం ఉంది. ఎత్తైన రాళ్ల పైనుంచి నీటి ప్రవాహం జాలువారుతూ ఉంటుంది. వర్షాకాలంలో కనువిందు చేస్తున్నది.

ఇలా వెళ్లాలి.. : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్నూర్‌ మండల కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే జాతీయ రహదారి ఉంటుంది. ఈ రహదారి పక్కనే జలపాతం ఉంది.

పెద్దగుండం.. 

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని జాతీయ రహదారి-44 నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో కోకస్‌మన్నూర్‌ గ్రామం వస్తుంది. ఇక్కడి నుంచి మరో 2.5 కిలోమీటర్ల దూరం గాజిలి శివారం వరకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి అర కిలోమీటర్‌ కాలినడకన వెళ్లాలి. ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలో పెద్దగుండం జలపాతం కనిపిస్తుంది.

గాయత్రి..

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుంచి సిరిచెల్మ వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్లు వెళ్లాక మేడిగూడ గ్రామం వద్ద గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాల వస్తుంది. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గుండివాగు అనే గిరిజన గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి దట్టమైన అడవి గుండా మార్గం ఉంది. జలపాతం వరకు తాత్కాలిక మట్టి రోడ్డుపై ద్విచక్రవాహనాల ద్వారా వెళ్లొచ్చు. నాలుగు చక్రాల వాహనాలు జలపా తానికి సుమారు 100 మీటర్ల దూరం లోనే నిలిపి వేయాలి. అక్కడి నుంచి కాలినడకన వెళ్తే గాయత్రి(ముక్తి గుండం) జలపాతం వస్తుంది.


logo