గురువారం 29 అక్టోబర్ 2020
Adilabad - Aug 07, 2020 , 03:52:49

ఆదిలాబాద్‌ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సాహితీ సారథి

ఆదిలాబాద్‌ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సాహితీ సారథి

  • n కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత  
  • n నేడు సామల సదాశివ మాస్టారు 9వ వర్ధంతి 

ఆదిలాబాద్‌ టౌన్‌ : సదాశివ.. భారత సాహితీ మేలిమి రత్నాల్లో ఒకరు. ఆ మహనీయుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా.. మాస్టారు రచనలు ఆయనను చిరంజీవిగానే నిలిపాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌, సీఎం కేసీఆర్‌ సదాశివ మాస్టారును తమ గురువుగా చెప్పిన ఉదంతాలున్నాయి.  మాస్టారు స్వర్గస్తుడై దశాబ్దం అవుతున్నా.. జ్ఞాపకాలు సదా పదిలమే. అవి వర్తమాల కవులు, రచయితలకు నిత్యనూతన పాఠాలే. కేంద్ర సా హితీ అవార్డు గ్రహీత సదాశివ తొమ్మిదో వర్ధంతిని ఆయన ఇంటి వద్దే జిల్లాసాహితీ లోకం నిర్వహించుకోనున్నది. కవులు, రచయితలు, సా హితీ అభిమానులకిది పండుగ రోజు. నేడు సదాశివ మాస్టారు 9వ వర్ధంతి. ఆయన యాదిలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

సామల సదాశివ మాస్టారు దహెగాం మండలం తెనుగు పల్లెలో 1928, మే 11న నాగయ్య, చిన్నమ్మ దంపతులకు జన్మించారు. ఆదిలాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎంఏ, బీఎడ్‌  చేసి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై పట్టు ఆసక్తి ఉండేవి. తెలుగుతో పాటు పలు భాషలను నేర్చుకున్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, అరబ్బీ, పార్శి భాషల్లో అపారమైన పాండిత్యం సంపాదించి అన్ని భాషల మూల లిపులను చదువుకోగలిగి, రాసి మెప్పించిన ప్రతిభాశాలి. అన్ని భాషల్లోనూ ఆయన కవి, పండితుడు, రసజ్ఞుడు. కవితా రచన, గానం, విమర్శ, వివిధ భాషల సాహిత్య చరిత్ర నిర్మాణం వంటి వాటికే పరిమితం కాకుండా హిందూస్తాని, కర్ణాటక సంగీతంతో పాటు చిత్రలేఖనంలో అపారమైన ప్రజ్ఞాపాటవాలను  సంపాదించారు. తెలుగు తీయదనాన్ని ఉర్దూ వారికి, ఉర్దూ నుడికారపు వంపుసొంపులను తెలుగు వారికి అనువాదం చేసి అందించారు. మాస్టారు రచించిన విమర్శనాత్మక వ్యాసాలు తెలుగు, ఉర్దూ పత్రికల్లోనూ పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. ప్రతి వ్యాసం ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. భారతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, యువ లాంటి దిన, మాస పత్రికలతో పాటు ఆజ్‌కల్‌, సియాసత్‌ తదితర ఉర్దూ పత్రికల్లోనూ, పార్శి, ఉర్దూ, మరాఠీ సాహిత్యంపై పరిశీలన వ్యాసాలు రాశారు. హిందీ నుంచి ఉర్దూ సాహిత్య చరిత్రను అనువదించారు. ఉర్దూ నుంచి తెలుగులో పద్యానువాదంగా అంజద్‌, రుబాయిలు, పార్శి నుంచి తెలుగులో పద్యానువాదంగా మౌలానా రూమీలను అనువదించారు.

కేంద్ర సాహిత్య పురస్కారం.. 

సామల సదాశివ మాస్టారు స్వరలయలు సాహిత్యానికి 2011లో కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. యాది ఆయన జీవితానుభవాల మూట కాగా సాహితీ రత్నాలు దాశరథి, కాళోజీల స్మారకంగా వారి పేరిట ప్రభుత్వం సాహితీ అవార్డులు ఇస్తున్నట్లే మాస్టారు సదాశివ పేరిట కూడా సాహితీ అవార్డులు ప్రకటిస్తే బాగుంటుందని జిల్లా కవులు, రచయితలు కోరుకుంటున్నారు.