గురువారం 04 మార్చి 2021
Adilabad - Jul 24, 2020 , 23:36:10

మాతాశిశు మరణాల నివారణకు సర్కారు చర్యలు

 మాతాశిశు మరణాల నివారణకు సర్కారు చర్యలు

ఏజెన్సీ గ్రామాల్లో మాతాశిశు మరణాలు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గతంలో ఎవరైనా నెలలు నిండి ప్రసవ వేదన అనుభవిస్తే.. వాగులు, వంకలు దాటి దవాఖానకు వెళ్లేలోపు తల్లీబిడ్డల ప్రాణాలు ఏమవుతాయో తెలిసేది కాదు. కాని, స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రతి పల్లెకూ చేరువైంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో పూర్తిస్థాయి మార్పు కనిపిస్తున్నది. కాగా, వానకాలంలోనూ ‘కాన్పు కష్టాల’ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప్పొంగి ప్రవహించే వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన గ్రామాల గర్భిణులను ఆయా పీహెచ్‌సీల పరిధిలోని ‘జనన నిరీక్షణ’ శిబిరాలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. పదిరోజుల ముందుగానే వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతూ, అవసరమైన పౌష్టికాహారం అందిస్తున్నది. ఈ నెలాఖరులో పూర్తిస్థాయిలో ప్రారంభించే ఈ శిబిరాలతో ఏజెన్సీలో మాతాశిశు మరణాలకు తెరపడే అవకాశం ఉన్నది.    - ఉట్నూర్‌

మాది నార్నూర్‌ మండలంలోని దేవాపూర్‌ గ్రామం. మూడు రోజుల క్రితం నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన్రు. ఇక్కడ ఆశ కార్యకర్త మంచిగ చూసుకుంటున్నది. రోజూ మంచి అన్నం పెడుతున్నరు. కాజు, కిస్‌మిస్‌, పండ్లు ఇస్తున్నరు. పూర్తిస్థాయి విశ్రాంతి ఉండేలా చూస్తున్నరు. కాలక్షేపానికి టీవీ కూడా పెట్టిన్రు. నర్సులు వచ్చి మందులు ఇచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతున్నరు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో భయపడిన. కానీ ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా ఉంటున్న.-సార్ల లక్ష్మి, దేవాపూర్‌

ఉట్నూర్‌ : ఏజెన్సీలో మరణాలు ఒకప్పుడు సర్వసాధార ణం. తెలంగాణ వచ్చాక మరణాల రేటు చాలా తగ్గింది. గిరిజనులకు అందించే వైద్యంలోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా వైద్యాధికారులు కూడా ఏజెన్సీలో మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని కంకణం కట్టుకున్నారు. మరణాలను నివారించే మూ లాలను ఛేదించే పనిలో పడ్డారు.  ముఖ్యంగా వర్షాకాలంలో గర్భిణులను డెలివరీకి తరలించే సమయంలో ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటాల్సి వస్తున్నది. ఒకానొక సందర్భంలో వైద్యసిబ్బంది ఆ గ్రామాలకు పోలేని పరిస్థితు లు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో వైద్యసాయం అందక కడుపులోని బిడ్డలతో పాటు గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. వీటన్నింటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మాతాశిశు మరణాలను నివారించాలంటే ముఖ్యంగా రోజులు నిండిన గర్భవతులను 10 రోజుల ముందే ప్రత్యేక శిబిరానికి తరలించి పౌష్టికాహారం అందిస్తున్నారు. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు రంగం సిద్ధం చేశారు. మొదటగా ఐటీడీఏ పరిధిలోని ఉట్నూర్‌ డివిజన్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ‘జనన నిరీక్షణ’ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది విజయవంతమై తే ఐటీడీఏ పరిధిలోని మిగతా ప్రాంతాల్లోనూ కొనసాగించేందుకు చర్యలు చేపట్టారు. 

మొదటగా హైరిస్క్‌ గ్రామాల ఎంపిక..

ఈ ప్రాజెక్ట్‌ కోసం ఉట్నూర్‌ డివిజన్‌లోని ఉట్నూర్‌, దంతన్‌పల్లి, హస్నాపూర్‌, శ్యాంపూర్‌తో పాటు ఇంద్రవెల్లి, నార్నూ ర్‌, పిట్టబొంగరం, గాదిగూడ, ఝరి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలను ఎంపికచేశారు. వీటి పరిధిలోని మారుమూల, రోడ్డు సౌకర్యం లేని 70 గ్రామాలను ఎంపికచేశారు. గర్భిణులపై పర్యవేక్షణ కొనసాగిస్తూ 10 రోజుల ముందే శిబిరానికి తరలించనున్నారు. ఇప్పటికే జూలై మాసంలో డెలివరీకి సిద్ధంగా ఉన్న వారి వివరాలను సేకరించారు.

పౌష్టికాహారం అందజేత..

ఏజెన్సీలో గర్భిణుల మరణానికి రక్తహీనత కూడా ఒక కారణం. దీనిని నివారించేందుకు జననీ నిరీక్షణ శిబిరానికి తరలించనున్నారు. ఇందులో బాదం, ఇప్పలడ్డూలు, కిస్‌మిస్‌, ఖర్జూర, పల్లిపట్టీ, అంజీరా, బిస్కట్‌తో కూడిన కిట్‌ ఇస్తారు. కాస్మోటిక్స్‌తో ఉన్న మరో కిట్‌ను కూడా అందిస్తున్నారు. వీటి ద్వారా హిమోగ్లోబిన్‌ పెరిగేందుకు దోహదపడనుంది. దీంతో డెలివరీ సురక్షితంగా అయి తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని వైద్యాధికారులు భావిస్తున్నారు.

గర్భిణులు 10 రోజులపాటు ఈ శిబిరంలో ఉండనుండడంతో అవసరమైన చర్యలు చేపట్టారు. వారికి పౌష్టికాహారంతో పాటు ప్రతిరోజూ భోజనం, కాలక్షేపానికి టీవీ, దోమతెరలతో కూడిన పడకగదులు, అటాచ్‌ బాత్‌రూంలు ఏర్పాటుచేశారు. ఫిల్టర్‌ వాటర్‌తో కూడిన ప్లాంట్‌, ప్రత్యేక వంటగది సౌకర్యాలు కల్పించారు. దోమలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డెలివరీ అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా 102 వాహనంలో వారింటికి చేరవేసేందుకు చర్యలు చేపట్టారు.

మాతాశిశు మరణాలు లేకుండా చేయడమే లక్ష్యం.. 

ఏజెన్సీలో మాతాశిశు మరణాలు లేకుండా చేయాలన్నది మా ప్రయత్నం. దీనికి సంబంధించిన సిబ్బంది మా వద్ద ఉన్నారు. డెలివరీకి ముందు గర్భిణుల వివరాలను మూడు నెలల ముందు నుంచి సేకరిస్తున్నాం. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే జననీ నిరీక్షణ శిబిరం ఏర్పాటు చేశాం. ఇందులో గర్భిణికి అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రత్యేక వైద్యం అందిస్తూ నిత్యం పర్యవేక్షిస్తుంటాం. దీని ద్వారా మాతాశిశు మరణాలు తగ్గి మంచి ఫలితాలు వస్తాయి. - మనోహర్‌, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి

VIDEOS

తాజావార్తలు


logo