శనివారం 16 జనవరి 2021
Adilabad - Jul 18, 2020 , 00:01:49

నేటి నుంచి పీహెచ్‌సీల్లోనే..

నేటి నుంచి పీహెచ్‌సీల్లోనే..

  • n కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్న వైద్య సిబ్బంది
  • n ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ పూర్తి
  • n జిల్లాకు చేరిన 1,378 ఆర్‌ఏటీ కిట్లు

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 70 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. మొదట మర్కజ్‌ కేసులు రాగా, తర్వాత ముంబై వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించింది. ఇటీవల వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు ఉట్నూర్‌, నేరడిగొండ, ఇచ్చోడ, జైనథ్‌ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వారి కోసం రిమ్స్‌లో చికిత్సలు అందిస్తున్నారు. వంద పడకలతో ఐసొలేషన్‌ వార్డును సిద్ధం చేశారు. వెంటిలేటర్‌ సౌకర్యం సైతం ఉండగా, 26 మంది వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రెండు నెలలుగా ఇక్కడే పరీక్షలు చేస్తున్నారు. ట్రూనాట్‌, సిబినాట్‌ల ద్వారా వైరస్‌ను నిర్ధారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి రిమ్స్‌లోని కొవిడ్‌ ల్యాబ్‌కు ఎక్కువగా శాం పిళ్లు వస్తుండడంతో  పరీక్షలు చేయడంలో కొంత ఆలస్యమవుతున్నది. రోజుకు 25 వరకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్థానికంగా టెస్టులు నిర్వహించాలని  అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం జిల్లాకు 

ర్యాపిడ్‌ యాంటిజన్‌ కిట్లను పంపిణీ చేసింది.

పీహెచ్‌సీల్లో కొవిడ్‌ పరీక్షలు..

జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నేటి నుంచి ఈ పరీక్షలు ప్రారం భం కానున్నాయి. ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్ట్‌ (ఆర్‌ఏటీ)లు నిర్వహిస్తారు. ముక్కులోంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు గానూ 1,378 ఆర్‌ఏటీ కిట్లు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా వైధ్యాదికారి కార్యాలయానికి 1,278 కిట్లు, ఉట్నూర్‌ కమ్యూనిటీ దవాఖానకు 100 కిట్లు వచ్చా యి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వా రికి, ఆ ప్రాంతాల్లోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, 65 సంవత్సరాలు దాటిన వారికి ఈ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తారు.

ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ.. 

కరోనా పరీక్షలు ఎలా చేయాలనే విషయంపై రిమ్స్‌ మైక్రోబయాలజీ నిపుణులు శుక్రవారం పీహెచ్‌సీల ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చా రు. జిల్లా వైద్యాధికారి నరేంద్‌ రాథోడ్‌, ఇతర వైద్యాధికారుల పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. ఆర్‌ఏటీ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు 30 నిమిషాల్లో వెలువడుతాయని వైద్యాధికారులు తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిని రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తారు. నెగెటివ్‌ వచ్చినా లక్షణాలు తీవ్రంగా ఉంటే రిమ్స్‌ లో మరోసారి పరీక్షలు చేస్తారు. గ్రామస్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్‌ ఉన్న వారికి సత్వరమే వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు..

గ్రామస్థాయిలో కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం తో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. టెస్టుల నిర్వహణలో భాగంగా ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చాం. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ప్రైమరీ కాంటాక్టులు, 65 సంవత్సరాలు పైబడిన వారికి పరీక్షలు నిర్వహిస్తారు. 30 నిమిషాల్లో ఫలితాలు వెలువడుతాయి. 

- వై.సీ శ్రీనివాస్‌, జిల్లా సర్వైవ్‌లెన్స్‌ అధికారి

లక్షణాలుంటేనే టెస్టులు చేయాలి

ఎదులాపురం : కంటైన్‌మెంట్‌ జోన్‌లో కరో నా లక్షణాలున్న వారికే టెస్టులు చేయాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, సూపర్‌వైజర్లతో పాటు ఇతర సిబ్బందికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టు కిట్‌పై శుక్రవారం శిక్షణనిచ్చారు.  జిల్లాలోని ప్రైవేట్‌ వైద్యశాలల్లో కరోనా నిర్ధారణ టెస్టులకు ఎలాంటి అనుమతి లేదని, ప్రజలు గమనించాలని డీఎంహెచ్‌వో సూచించారు. టెస్టులు ఎవరికి చే యాలి? ఎలా చేయాలి? అనే విషయాలను రిమ్స్‌ కొవిడ్‌ ల్యాబ్‌ నోడల్‌ ఆఫీసర్‌ పద్మవల్లి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సర్వైవ్‌లెన్స్‌ అధికారి డాక్టర్‌ వైసీ శ్రీనివాస్‌, ట్యూటర్లు దీప్తి, జిల్లా కొవి డ్‌ నోడల్‌ ఆఫీసర్‌ అశోక్‌, జిల్లా  అదనపు వైద్యాధికారి శ్రీకాంత్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాధన, తదితరులు  ఉన్నారు.