ఆదివారం 09 ఆగస్టు 2020
Adilabad - Jul 14, 2020 , 03:38:27

కరెంట్‌తో జాగ్రత్త

కరెంట్‌తో జాగ్రత్త

  • వానకాలంలో ప్రమాదాలెక్కువ..
  • నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు
  • సొంత మరమ్మతులు అసలే వద్దు
  • పల్లెలు, పట్టణాల్లో అధికారుల అవగాహన
  • సమస్యలుంటే సమాచారమివ్వండి : ఏఈ చంద్రశేఖర్‌

అసలే వర్షకాలం.. ఇంటా.. బయటా.. విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశలెక్కువ. గాలివానకు స్తంభాలు పడిపోయి.. విద్యుత్‌ తీగలు తెగిపడి.. ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని టాన్స్‌ కో  ఏఈ చంద్రశేఖర్‌ సూచిస్తున్నారు. విద్యుత్‌ వాడకం-తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు.       - సిరికొండ

సొంత మరమ్మతులు వద్దు..

చాలా మంది రైతులు కరెంట్‌ సమస్యలు వస్తే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వ కుండా ఏమవుతుందిలే అన్న ధోరణిలో సొంతంగా మరమ్మతులు చేస్తుంటారు. అది సరికాదు. కరెంట్‌ స్టార్టర్లకు కచ్చితంగా తలుపులు అమర్చుకోవాలి. మోటర్లపై మందపాటి ప్లాస్టిక్‌ కవర్‌ను కప్పి ఉంచాలి. లేదంటే వర్షానికి తడిసి ఒక ఫేస్‌ తీగ కాలితే మోటర్‌ మొత్తానికి విద్యుత్‌ సరఫరా అవుతుంది. దానిని తాకగానే షాక్‌ కొడుతుంది.

ఇండ్లలో పాటించాల్సినవి..

n వేడి నీరు ఉన్న ప్రదేశాల్లో విద్యుత్‌ తీగలను, పరికరాలను ఉంచవద్దు.

n చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్‌ పరికరాలు, స్విచ్‌లను తాకవద్దు

n పిల్లలకు అందనంత ఎత్తులో ప్లగ్గులను ఏర్పాటు చేయాలి.

n ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్‌ తప్పనిసరి. n అతికించిన తీగలను అసలే వాడద్దు

n స్విచ్చాఫ్‌ చేయకుండా ప్లగ్గులను బయటకు తీయద్దు.

n పరికరాలకు ఉన్న తీగలను పట్టుకుని లాగవద్దు.

n పాడైన ప్లగ్గులను, బల్బులను, హోల్డర్లను వినియోగించవద్దు. ప్లగ్‌ పిన్నులకు చేతి వేళ్లను తాకించవద్దు. n నూతనంగా నిర్మిస్తున్న భవనాలను నీటితో తడుపుతున్నప్పుడు దగ్గరలో ఉన్న తీగలను, పరికరాలను గమనించాలి. n బట్టలు ఆరవేసేందుకు ఇనుప తీగలను ఉపయోగించవద్దు.  n విద్యుత్‌ తీగల కింద మొక్కలను నాటవద్దు

n తీగలకు తగిలిన చెట్లను ఎక్కవద్దు.  n విద్యుత్‌ స్తంభానికి ఆధారంగా ఉన్న స్టే తీగను తొలగించవద్దు. n పాడైన ఇనుప కమ్మీలను, బోరుకేసింగ్‌ పైపులను తీసుకెళ్తున్నపుడు విద్యుత్‌ తీగలకు తగిలించవద్దు.

అవగాహన సదస్సులు..

తెలంగాణ ప్రభుత్వం వానకాలంలో జరిగే విద్యుత్‌ ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కాగా, ఈ మూడేళ్లలో కరెంట్‌ షాక్‌తో 174 మంది మృతి చెందారు. 511 మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు.

జాగ్రత్తగా ఉండాలి

వానకాలంలో విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైన సమస్య ఉంటే విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. సొంతంగా మరమ్మతులు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పొలాల్లోని కరెంట్‌ మోటర్లు, ఇండ్లలో నాణ్యమైన తీగలు, స్విచ్‌లను వాడాలి. కరెంట్‌ ప్రమాదాల నివారణకు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పల్లెలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

- చంద్రశేఖర్‌, సిరికొండ  టాన్స్‌కో ఏఈ

ఈ జాగ్రత్తలు పాటించండి..

n బోర్‌వెల్‌ వేసేటప్పుడు పైన 11కేవీ, ఎల్‌టీ తీగలు ఉన్నయో లేదో చూసుకోవాలి.

n మోటరు సామర్థ్యానికి తగ్గట్లుగా నాణ్యత ఉన్న తీగలను వాడాలి.

n వ్యవసాయ పంపుసెట్‌కు ఎర్తింగ్‌ తప్పనిసరి.

n వ్యవసాయ పంపుసెట్‌ (మోటర్‌)కు సంబం ధించిన తీగలను నేలమీద ఉంచరాదు. 

n పంపుసెట్‌కు సరైన ఫ్యూజులను అమర్చాలి.

n పంపు సెట్లకు సరిపడా కెపాసిటర్లు, రాపిడిలేని ఫుట్‌వాల్వ్‌ వాడాలి.

n ఐఎస్‌ఐ ముద్ర ఉన్న పరికరాలనే వాడాలి.

n విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి సమస్య వచ్చినా అధికారులకు తెలియజేయాలి.

n తడి దుస్తులతో పంపుసెట్‌ను  ఆన్‌ చేయరాదు.

n పంపుసెట్‌ పాడైతే స్వయంగా మరమ్మతులు చేయవద్దు

n గాలి వీచినప్పుడు, వర్షం కురిసినప్పుడు విద్యుత్‌ లైన్ల కింద నిలబడవద్దు

n ఎవరైనా విద్యుదాఘాతానికి గురైతే వెంటనే మెయిన్‌ స్విచ్చాఫ్‌ చేయాలి. పొడికర్రతో గాని, విద్యుత్‌ ప్రవహించని ఇతర ప్లాస్టిక్‌ వస్తువుతోగాని సదరు వ్యక్తిని తప్పించాలి. 

n దొంగచాటున విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవద్దు. ఇలా చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.


logo