సోమవారం 03 ఆగస్టు 2020
Adilabad - Jul 13, 2020 , 00:54:04

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌

తాంసి: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్క్‌ఫెడ్‌ ఆవరణలో 2016లో రాష్ట్ర మంత్రిగా ఉన్న జోగురామన్న ఈ యూనిట్‌కు భూమిపూజ చేశారు. రూ.5కోట్ల నిధులతో ఈ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ యూనిట్‌ పనులను మొదలుపెట్టారు. 2019లో పనులు పూర్తి చేసుకొని, అదే ఏడాది అందుబాటులోకి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌ విజయవంతంగాపనిచేసింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ యూనిట్‌ను నెలకొల్పారు. అధికంగాపత్తి పండిస్తున్న జిల్లాల్లో ఆదిలాబాద్‌ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. 

రోజుకు 2వేల క్వింటాళ్ల ప్రెస్సింగ్‌..

జిల్లాలో ప్రారంభించిన ఈ యూనిట్‌ విజయవంతంగా నడుస్తోంది. ప్రారంభించిన నాటి నుంచి నిత్యం 2 వేల క్వింటాళ్ల పత్తిని బేళ్లుగా మారుస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని మొదట ప్రెస్సింగ్‌ చేసి బేళ్లుగా మారుస్తారు. ఇది భవిష్యత్‌లో మరింతగా పెంచే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి పెరిగితే, సంస్థకు మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్లాంటును కూడా విస్తరించడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో పత్తి పండే ప్రాంతాల్లో ఏర్పాటు..

ఇటీవలే మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ మార గంగారెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ యూనిట్‌ను సంబంధిత అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలోనే ఈ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ యూనిట్‌ మొదటిదని, రానున్న కాలంలో పత్తి పండించే ప్రతి జిల్లాలో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆయన ప్రకటనతో రాష్ట్రంలోని మిగతా పత్తి పండించే జిల్లాల్లో కూడా ఈ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ యూనిట్లు ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే పత్తి రైతులకు మరింత లబ్ధి చేకూరనున్నది.logo