శనివారం 08 ఆగస్టు 2020
Adilabad - Jul 05, 2020 , 23:05:17

అడవులకు పునర్జీవం

అడవులకు పునర్జీవం

మోడువారిన మొదళ్లు ఏపుగా పెరుగుతున్నాయి. స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేలకూలిన వృక్షాలు సహజ సిద్ధంగా పెరిగి, దట్టమైన అడవులను తలపిస్తున్నాయి.. తెలంగాణ సర్కారు తీసుకున్న ఎయిడెడ్‌ నేచురల్‌ రీజనరేషన్‌(ఏఎన్‌ఆర్‌) విధానంతో అడవులు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి.. అంతరించిపోతున్న వనాలు జీవం పోసుకుంటున్నాయి.. మూడేండ్లుగా హరితహారంలో భాగంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో సంరక్షణ చర్యలు తీసుకుంటుండడం సత్ఫలితాలిస్తున్నది. ఆదిలాబాద్‌ జిల్లా పచ్చలహారంగా మారుతున్నది. ఇగ, ఆదిలాబాద్‌ మీదుగా వెళ్లే జాతీయ రహదారి మావల వద్ద దట్టమైన అడవులతో చూపరులను కనువిందు చేస్తున్నది.    

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఐదు విడుతలుగా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో జిల్లా పచ్చదనాన్ని సంతరించుకున్నది. ఆరో విడుతలో మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, మావల, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, ఇచ్చోడ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, తలమడుగు, తాంసి మండలాలు దట్టమైన అడవులతో కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 1,706 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం ఉండగా.. భూభాగంలో దాదాపు 41.1 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. అడవులను కలప కోసం స్మగ్లర్లు నరికి వేయడంతో క్రమంగా అంతరించి పోయాయి. ఫలితంగా దట్టమైన అడవులు పలుచబడ్డాయి. స్మగ్లర్లు చెట్ల మొదళ్ల వరకు నరికి వేయడంతో మొదళ్లు అలానే ఉండి పోయాయి. ఈ క్రమంలో అడవుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. క్షీణించిన అడవులకు పునర్జీవం పోయడానికి ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ అటవీ డివిజన్లలో వివిధ పనులు చేపట్టారు.

సంరక్షణ చర్యలు

గతంలో ఇచ్చోడ మండలంలోని ముల్తానీలు కలప స్మగ్లింగ్‌కు పాల్పడేవారు. అడ్డుకున్న అధికారులపై పాశవికంగా దాడులు చేసేవారు. అక్రమ కలప నివారణకు అటవీశాఖ, పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో టేకు, ఇతర కలపతో ఫర్నిచర్‌ తయారు చేసి పలు ప్రాంతాలకు తరలించేవారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న కలప స్మగ్లర్లను గుర్తించిన పోలీసులు వారిపై కఠిన తీసుకున్నారు. ముగ్గురు అక్రమార్కులపై పీడీ యాక్టు కింద కేసులు కూడా నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. దీంతో  కలప రవాణాకు అడ్డుకట్ట పడింది.

అడవుల అభివృద్ధికి కార్యక్రమాలు..

జిల్లాలో క్షీణించిన అడవులను అభివృ ద్ధి చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏఎన్‌ఆర్‌ విధానంలో మూడు అటవీ డివిజన్‌లోని అడవులు గత వైభవాన్ని సంతరించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. మావల, దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో వెయ్యి హెక్టార్లలో అడవులు దట్టంగా పెరుగుతున్నాయి. హరితహారంలో భాగంగా అటవీ ప్రాంతాల్లోని బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేస్తున్నారు. సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాం. - ప్రభాకర్‌, జిల్లా అటవీశాఖ అధికారి, ఆదిలాబాద్‌

ఏఎన్‌ఆర్‌ విధానంలో పెంపకం

స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురైన అటవీ ప్రాంతాల్లో చెట్ల మొదళ్లు ఏపుగా పెరగడానికి  అధికారులు ఎయిడెడ్‌ నేచురల్‌ రీజనరేషన్‌(ఏఎన్‌ఆర్‌) పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మూడెండ్లుగా దాదాపు 55 వేల హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల హెక్టార్లలో అడవులు దట్టంగా పెరిగాయి. రానున్న నాలుగేండ్లలో జిల్లావ్యాప్తంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ విధానంలో స్మగ్లర్లు నరికిన చెట్ల మొట్లు(మొదళ్లు) తిరిగి పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సహజంగా పెరిగే చెట్లకు చుట్టు పక్కల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. వంట చెరుకు ఎవరూ తీసుకుపోకుండా చర్యలు తీసుకున్నారు. పశువులు, మనుషులు అడవుల్లోకి రాకుండా చుట్టూ కందకాలు  తవ్వి గచ్చికాయ మొక్కలు నాటి చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా టేకు ఇతర చెట్లు  నరికివేసిన మొదళ్లు ఏపుగా పెరుగుతున్నాయి. అటవీ అధికారులు సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తుండడం, సంరక్షణ చర్యలు తీసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతం దట్టంగా మారుతోంది. మావల అటవీ ప్రాంతం గుండా వెళ్లే  ఆదిలాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా దట్టంగా చెట్లు పెరిగి ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.


logo