మంగళవారం 04 ఆగస్టు 2020
Adilabad - Jul 02, 2020 , 03:41:41

రిమ్స్ లోనే చికిత్స

రిమ్స్ లోనే చికిత్స

కరోనా నిర్ధారణ పరీక్షలూ ఇక్కడే

  • n పాజిటివ్ తేలితే వైద్యం
  • n 100 పడకలతో  ప్రత్యేక ఐసోలేషన్
  • n ఇప్పటికే 9 మంది డిశ్చార్జి
  • n మరో 14 మందికి ట్రీట్
  • n 20 మందికి వెంటిలేటర్ సౌకర్యం
  • n ప్రత్యేక వార్డులో  26 మంది వైద్యులు, సిబ్బంది సేవలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా అనుమానితుల శాంపిళ్లకు ఈ వైద్యశాలలోని ల్యాబ్ టెస్ట్ చేస్తుండగా, పాజిటివ్ తేలిన వారికి వైద్యబృందం ఇక్కడే చికిత్స అందిస్తున్నది. ఇందుకోసం వంద పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా, 20 మందికి వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉన్నది. రిమ్స్ ఇప్పటి వరకు 23 మందికి చికిత్స అందించగా, తొమ్మిది మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 14 మంది చికిత్స పొందుతుండగా, ఆరుగురు వైద్యులతో పాటు 20 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. సర్కారు దవాఖానలో అందుతున్న వైద్యంపై చికిత్స పొందుతున్న వారితో పాటు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.                   - ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ

ఎట్లుండాల్నో చెప్పిన్రు..

నేను నా కుటుంబంతో కలిసి 20 ఏళ్ల కిందట ఉపాధి కోసం ముంబైకి పోయిన. అక్కడ ధారావిలో నివాసం ఉంటూ కుటుంబమంతా కూలీ పనికి పోతున్నం. ఏడాదికి ఒకటి, రెండు సార్లు ఉట్నూర్ వచ్చిపోతుంటం. కరోనాతో అక్కడ లాక్ పెట్టిన్రు. పని దొరుకుడు కష్టమైంది. చాలా రోజులు చూసినం. ఇగ పని దొరకదని తెలిసి, ఉట్నూర్ వచ్చినం. మేం రాగానే డాక్టర్లు వచ్చి పరీక్షలు చేసిండ్రు. ఇంటి నుంచి బయటకు రావద్దని, మీకు కరోనా పరీక్షలు చేస్తమని చెప్పిన్రు. ఆ తర్వాత రక్త నమూనాలు తీసుక పోయిన్రు. డాక్టర్లు రోజూ వచ్చి చూసిపోయోటోళ్లు. దగ్గు, జర్వం ఉందా..అని అడిగేటోళ్లు. నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ వచ్చిందని చెప్పి అంబులెన్స్ రిమ్స్ తీసుకుపోయిండ్రు. మొదట చానా భయమైంది. అక్కడ మంచి బెడ్ ఉన్న రూంలో ఉంచి అన్ని సౌలతులు చేసిండ్రు. రోజు రెండుసార్లు డాక్టర్లు వచ్చి చూసేటోళ్లు, నర్సులు మందు గోళీలు ఇచ్చి వేసుకోమని చెప్పిండ్రు. ఒక పూట టిఫిన్, రెండు పూటల మంచి భోజనం, గుడ్లు ఇచ్చేటోళ్లు. బాటిళ్లలో నీళ్లు ఇచ్చిండ్రు. మీకు ఏమీ కాదు.. ధైర్యంగా ఉండుండ్రి అని చెప్పేటోళ్లు. తగ్గడానికి ఎట్లుండాల్నో కూడా వారే చెప్పిన్రు. 14 రోజుల్లో మీరు ఇంటికి పోతరని చెప్పేటోళ్లు. రిమ్స్ డాక్టర్లు, సిబ్బంది చేసిన వైద్యం వల్లే ఇంటికి వచ్చినం. రక్త పరీక్షలు చేసి, తగ్గిన తర్వాతే అంబులెన్స్ ఇంటికి పంపించిన్రు. ప్రైవేటు దవాఖానల్లో కూడా గిటువంటి సౌలతులు ఉండవు. సర్కారు దవాఖానలో మంచిగా చూస్తున్నరు.    - శాంతాబాయి, ఉట్నూర్

  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రిమ్స్ కరోనా రోగులకు చికిత్స అందించడానికి మార్చిలో ఏర్పాట్లు చేశారు. వంద పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడంతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించారు. జిల్లాలో పాజిటివ్ నమోదైన వారిని రిమ్స్ తరలించి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 20 మందికి సరిపడా వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. రిమ్స్ ఏర్పాటు చేసిన కరోనా చికిత్స కేంద్రంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ వచ్చి రిమ్స్ చికిత్స పొంది, పూర్తిగా కోలుకున్న వారు కూడా అక్కడి సేవలను కొనియాడుతున్నారు. వైద్యులు, సిబ్బంది తమలో మనో ధైర్యం కల్పించారని, మంచి ఆహారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియజేశారని తెలిపారు.

అనువైన వసతులు..

రిమ్స్ ఏర్పాటు చేసిన వంద పడకల కరోనా ఐసోలేషన్ వార్డును రోగులకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. వార్డును సిబ్బంది  శుభ్రంగా ఉంచుతున్నారు. ఇందుకోసం 20 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తారు. వార్డు మొత్తం సెంట్రల్ ఏసీ సౌకర్యం ఉంటుంది. మంచాలు కూడా సౌకర్యవంతంగా పడుకునేలా, కూర్చునేలా ఉంటాయి. ప్రత్యేక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. చికిత్స కోసం వచ్చిన వారు ప్రశాంతంగా ఉండడానికి అనుకూలమైన వాతావరణం కల్పించారు.  

అనుభవజ్ఞులైన వైద్యులు..

రిమ్స్ కరోనా వచ్చిన వారికి చికిత్సలు అందించడానికి 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. మూడు షిప్టుల వారీగా ఆరుగురు వైద్యులు, మరో 20 మంది సిబ్బంది వార్డులో విధులు నిర్వర్తిస్తున్నారు. క్రమంగా వారికి అవసమరమైన మందులు ఇవ్వడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. చికిత్సలు పొందుతున్న వారికి బీపీ, హార్ట్ బీటింగ్ పరిశీలిస్తారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే గాంధీ దవాఖానకు తరలిస్తారు. 

వైద్యుల సేవలు భేష్..

కరోనా పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సలు అందించే వైద్యులు ఎంతో ఓపిగ్గా ఉంటున్నారు. చికిత్స పొందుతున్న వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వారికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఎప్పుడు ఏఏ మందులు వేసుకోవాలో రోగులకు సూచించి, సిబ్బంది సరైన సమయంలో వారికి మందులు ఇచ్చేలా చూస్తారు. ఇందుకు సంబంధించి వివరాలు రాసుకుంటారు. వైద్యు లు, సిబ్బందికి అవసరమైన పీపీ ఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, హెడ్ చేతి గ్లవ్స్ ప్రభుత్వం పంపిణీ చేసింది. 

చికిత్సా విధానం..

పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులో చేరుస్తారు. 14 రోజుల పాటు వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉండి చికిత్స పొందాలి. వైద్యులు రోజు వీరికి పరీక్షలు చేసి అవసమరమైన మందులు రాస్తారు. వార్డులో విధులు నిర్వహించే సిబ్బంది చికిత్స పొందుతున్న వారికి మందులు ఇస్తారు. అజిత్రోమైసిన్, మిటమిన్ సీ, బీ కాంప్లెక్స్, పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇతర ముందులు అందుబాటులో ఉండగా చికిత్సలో భాగంగా అవసరమైన మందులు ఇస్తారు. వీరి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చి, పూర్తిగా కోలుకున్న వారికి అవసరమైన సలహాలు, సూచనలు తెలియజేస్తారు.

పౌష్టికాహారం అందజేత..

చికిత్స పొందుతున్న వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మంచి ఆహారం ఇస్తున్నారు. ఇందుకోసం డైట్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్వాహకులకు సూచనలు చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. వాటర్ బాటిళ్లు, సబ్బులు ఇతర సామగ్రి కూడా అందిస్తున్నారు. రిమ్స్ కరోనా చికిత్స తీసుకుంటున్న వారికి డ్రైఫ్రూట్స్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 

23 మందికి చికిత్స, 9 మంది డిశ్చార్జి..

రిమ్స్ ఇప్పటి వరకు 23 మందికి చికిత్సలు అందించగా, వీరిలో 9 మంది పూర్తిగా కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం14 మంది చికిత్స పొందుతుండగా, వారిని కూడా తర్వలో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

నిర్ధారణ పరీక్షలు ఇక్కడే..

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లకు రెండు షిఫ్టుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. ల్యాబ్ సిబ్బంది ఒక్కో షిఫ్టులో 20 శాంపిళ్లను పరీక్షిస్తారు. రోజూ 40 పరీక్షలు జరుపవచ్చు. త్వరలో మూడు షిఫ్టుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటి వరకు 903 అనుమానితులకు పరీక్షలు చేశారు.


logo