శుక్రవారం 30 అక్టోబర్ 2020
Adilabad - Jun 23, 2020 , 23:09:42

ప్రతి పంటా సర్కారు కొంటుంది

ప్రతి పంటా సర్కారు కొంటుంది

  • రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి 
  • జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ యూనిట్‌ పరిశీలన
  • రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో మొదటిదని వెల్లడి

తాంసి : రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి పంటనూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేసిన జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ యూనిట్‌ను మంగళవారం సంబంధిత అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన యూనిట్‌ రాష్ట్రంలోనే మొదటిదన్నారు. రానున్న కాలంలో పత్తి పండించే ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వం ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఆదిలాబాద్‌ యూనిట్లో 2 వేల క్వింటాళ్ల పత్తిని బేళ్లుగా మారుస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని రైతులకు ఇబ్బందులు లేకుండా పంటలు కొంటున్నామని, రాబోయే రోజుల్లోనూ కొనుగోలు చేస్తామన్నారు. గతంలో ఏ సర్కారు కూడా పంటలను కొనలేదని విమర్శించారు. తెలంగాణ సర్కారే కొంటున్నదన్నారు. ఇందులో మార్క్‌ఫెడ్‌ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా కష్టాలున్నా రైతుల మేలు కోసం రైతుబంధు సాయాన్ని వారి ఖాతాల్లో జమచేసిందన్నారు. ఆయన వెంట ఆదిలాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్లయ్య, తదితరులు ఉన్నారు.