శనివారం 05 డిసెంబర్ 2020
Adilabad - Jun 10, 2020 , 00:28:27

శనగ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

శనగ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

  • రూ.103 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం
  • సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

కరోనా రక్కసి విజృంభిస్తున్నా.. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. తెలంగాణ సర్కారు రైతుల పక్షాన నిలిచి ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంట ఉత్పత్తి కొనుగోలు చేసింది. లాక్‌డౌన్‌ వేళ సర్కారు వద్ద పైసలు లేకున్నా కొనుగోలు చేసిన శనగలకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ డబ్బులు పెట్టుబడికి ఉపయోగపడుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.     

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ జిల్లాలో రెండో పంటగా శనగను అధికంగా సాగు చేస్తారు. ఈ యాసంగిలో 24 వేల హెక్టార్లలో సాగవగా.. వానలు సమృద్ధిగా కురవడం, వాతావరణం అనుకూలంగా ఉండడంతో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. కరోనా నేపథ్యంలో మార్కెట్‌ యార్డుల్లో కాకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఫంక్షన్‌ హాళ్లలో పంటను సేకరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) తమ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు కూపన్లు అందజేశారు. రైతు లేదా కుటుంబ సభ్యులు పట్టా పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, కూపన్లను తీసుకొచ్చి పంటను విక్రయించే అవకాశం కల్పించారు. జిల్లాలో ఏప్రిల్‌ 7న ప్రారంభమైన పంట కొనుగోళ్లు మే 20తో ముగిశాయి. 45 రోజులపాటు జిల్లాలోని అన్ని గ్రామాల రైతులు తమ పంటను అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. రైతులు తప్పనిసరి మాస్కులు ధరించాలని సూచించారు. సిబ్బంది  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

రూ.103 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ

ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ద్వారా జిల్లావ్యాప్తంగా 2,64,650 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేశారు. 16,633 మంది రైతుల వద్ద నుంచి మద్దతు ధర క్వింటాలుకు రూ.4,875 చొప్పున సేకరించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 138.41 కోట్లు శనగ పంటను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.103 కోట్ల రైతుల ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు తెలిపారు. మిగతా డబ్బులు వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో పడుతాయన్నారు. కరోనా కష్టకాలంలో తమ పంటలు అమ్ముకునేందుకు సర్కారు చేసిన ఏర్పాట్లు, పంట విక్రయాల డబ్బులు వెంటనే అందడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో పండుగ వాతావరణం

శనగ పంటేసి, సర్కారోళ్లకు అమ్మినోళ్లందరి బ్యాంకు ఖాతాల్లో పైకం జమైనట్టు సెల్‌ మెసేజ్‌లు సూడంగనే సంబురమైంది. మేము పంటేసే కాలానికి పెట్టుబడిలా పనికత్తయ్‌. నిజం సెప్పాలంటే సర్కారు రైతుబంధు, రుణమాఫీ అమలు నుంచి మా గ్రామంల దళారీ అనేటోడు గుర్తుకత్తలేడు. మా అద్ద దోచుకున్న మధ్యలోళ్లు లేకపోయే సరికి పైసల్‌ మొత్తం మా ఖాతాల్లో పడతన్నయ్‌. మా చేనులో ఏసిన శనగ తాలూకు డబ్బుతో పెట్టుబడికి ఢోకా లేదు. నాతోటి అమ్మినోల్లందరికి పైసల్‌ జమైనట్లు మెసేజ్‌లు అచ్చాయట. సర్కారుకు వందనాలు.

             - రెడ్డివార్‌ రమేశ్‌ యాదవ్‌, రైతు, కరంజి(టి), భీంపూర్‌ మండలం.