బుధవారం 08 జూలై 2020
Adilabad - Jun 04, 2020 , 01:56:08

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ స్టడీ

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ స్టడీ

ప్రత్యేక యాప్‌ను రూపొందించిన సర్కారు

బోధిస్తున్న తల్లిదండ్రులు.. ఆసక్తిగా వింటున్న చిన్నారులు..

ఇంటివద్దకే ఆటాపాట సామగ్రి

పల్లెలకు వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్న ఆయాలు

అంగన్‌వాడీ కేంద్రాలపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ

సిరికొండ :  జిల్లావ్యాప్తంగా 1,256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 992 ప్రధాన, 264 మినీ కేంద్రాలు ఉన్నాయి. 20,376 మంది చిన్నారులు, 5500 మంది గర్భిణులు, 6 వేలకుపైగా బాలింతల పేర్లు నమోదై ఉన్నాయి. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలను స్మార్ట్‌గా మార్చింది. అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు కూడా పంపిణీ చేసింది. పారదర్శక కోసం ప్రత్యేకంగా కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (సీఏఎస్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారానే చిన్నారుల, గర్భిణుల హాజరు, పౌష్టికా హారం పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

ప్రత్యేక యాప్‌.. తల్లిదండ్రులతో బోధన..

ప్రభుత్వం అంగన్‌వాడీ పిల్లల కోసం icds.tgwdc.inpreschool వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంకా అంగన్‌వాడీ టీచర్లు తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరాలు.. చిన్న, చిన్న లెక్కలు.. పొడుపు కథలు, రైమ్స్‌ పిల్లల తల్లిదండ్రుల మోబైల్స్‌కు పంపిస్తున్నారు. వీటిద్వారా చిన్నారుల తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో పిల్లలు అటపాటలు నేర్పుతున్నారు. బొమ్మలతో రూపొందించినవి కావడంతో చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం రోజుకు 3 నుంచి 4 గంటలు తల్లిదండ్రులే గురువుగా మారి బోధిస్తున్నారు. 

ఇంటి వద్దకే ఆట వస్తువులు, పౌష్టికాహారం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే సరుకులను అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మారుమూల గ్రామాలకు స్కూటీ పైన వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. చిన్నారులకు బాలామృతం,16 కోడిగుడ్లు, పాలు, ముర్కులు వంటి సరుకులు అందిస్తున్నారు. ఇదివరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్భిణులు, బాలింతలకు పౌష్టికా హారం, అన్నం, పప్పు, పాలు అందించేవారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంతో ప్రస్తుతం ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ఆట వస్తువులను కూడా ఇంటి వద్దకే ఇస్తుండడంతో చిన్నారులు కూడా సరదాగా గడుపుతున్నారు.

ఆసక్తిగా నేర్చుకుంటున్నారు..

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు మూతబడ్డాయి. మా ఇంటిలో ఇద్ద రు పిల్లలు అంగన్‌వాడీకి పంపుతాం. కానీ.. కరోనా కారణంగా కేంద్రాలకు పంపడం లేదు. సర్కారు పిల్లల కోసం తయారు చేసిన ప్రత్యేక యాప్‌  ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో పిల్లలు రోజు 3 నుంచి 4 గంటలు ఆన్‌లైన్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరాలు, చిన్న లెక్కలు, పొడుపు కథలు, రైమ్స్‌ నేర్పిస్తున్నాం. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. అంగన్‌ వాడీ టీచర్‌, ఆయా ప్రతినెలా పౌష్టికా హారం ఇంటి వద్దకే తెచ్చిస్తున్నారు.                  - సుమలత, అంగన్‌వాడీ చిన్నారి తల్లి

పౌష్టికాహారం అందిస్తున్నం.. 

కరోనా నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికీ వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారు. అంగన్‌వాడీ చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్‌ రూపొందించింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారులకు స్మార్ట్‌ఫోన్‌లో పాఠాలు చూపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

- మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్‌


logo