సోమవారం 13 జూలై 2020
Adilabad - Jun 04, 2020 , 01:53:01

రహస్య మార్గాల శంకర్‌లొద్ది

రహస్య మార్గాల శంకర్‌లొద్ది

ఆదివాసుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది

రాతిగుహల్లో కొలువైన శివలింగం, జంగుబాయి   

ఐదు రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తుల రాక

యేడాదిలో రెండుసార్లు జనారణ్యాన్ని తలపిస్తోంది.. 

ఆరోగ్యం బాగుండాలని.. వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు

చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చదనాన్ని పరుచుకున్న అడవి ప్రాంతం.. 

గలగల పారే సెలయేళ్లు.. కొండను ఆనుకుని రాతి గుహలు.. పక్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల అరుపులు.. మనుషుల అలికిడిలేని కారడవి.. తోడుంటే తప్ప ఒంటరిగా వెళ్లలేని ప్రదేశం.. అదే శంకర్‌లొద్ది.. ఇదీ తెలంగాణ-మహారాష్ట్ర రాష్ర్టాల సరిహద్దుల మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం ఏడాదిలో రెండు సార్లు వేలాది మంది ఆదివాసులతో వారం రోజులపాటు జనారణ్యాన్ని తలపిస్తుంది. ఇక్కడికి తెలంగాణ, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకోవడానికి తరలివస్తారు. సంస్కృతీ, సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే.. ఆధ్మాత్మిక ఆచారాలకు జీవం పోసే శంకర్‌ లొద్ది గుహల్లో కొలువైన దేవతలు కోరికలు తీరుస్తారని ఆదివాసుల ప్రగాఢవిశ్వాసం.  

- కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో ఆదివాసుల పుణ్యక్షేత్రంగా శంకర్‌లొద్ది వెలుగొందుతోంది. లొద్ది వద్ద నిట్టనిలువునా ఉన్న రాతి కొండకు మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న గుహలో ఉన్న శివలింగానికి అద్భుతమైన మహాత్మ్యం ఉందని ఆదివాసుల విశ్వాసం. ఈ గుహకు సుమారు ఒక కిలోమీటర్‌ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మరో రాతి గుహ ఉంది. ఆదివాసుల ఆరాధ్య దేవతైన జంగుబాయి ఈ గుహల్లో తపస్సు చేసి దేవతగా వెలిసిందని వారి నమ్మకం. భూమికి సమాంతరంగా పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య ఒక పెద్ద సొరంగంలా కనిపిస్తుంది. దీనిని పాండవుల గుహగా, భీముని గుహగా కూడా పిలుస్తారు. భీముడు ఇక్కడ తపస్సు చేసినట్లుగా చెబుతారు. పైనుంచి చూసేందుకు బండల మధ్య ఏర్పడిన చిన్న సొరంగంలా కనిపించే ఈ ద్వారం గుండా ఒకే సారి నలుగురు మాత్రమే వెళ్లొచ్చు. కొంత దూరం వెళ్లాక రాళ్ల మధ్య దూరం పెరిగి విశాలంగా కనిపిస్తుంది. యేటా పుష్యమాసంలో ఒక సారి, గుహవద్ద వర్షాకాలంలో విత్తనాలు వేసే సమయంలో మరోసారి ఆదివాసులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

రహస్య మార్గాలకు నెలవు..

ఆదివాసుల ఆధ్మాతిక ప్రాంతాలను కలిపేందుకు శంకర్‌లొద్ది గుహల నుంచి రహస్యమార్గాలు ఉన్నాయని ఆదివాసులు చెబుతుంటారు. మహారాష్ట్రలోని మహోర్‌కు,  చంద్రాపూర్‌ వద్ద ఉన్న మహంకాళి ఆలయానికి, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం  గుడిరేవు వద్ద ఉన్న పద్మల్‌పురి కాకో వద్దకు, చిన్నయ్య-పెద్దయ్య దేవస్థానాల వద్దకు,  కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గోవెన వద్దకు, వాంకిడి మండలంలోని జంగున్‌ బుయారి వద్దకు, ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు వద్ద ఉన్న రాయల్‌కోఠి వద్దకు గుహలో నుంచి రహస్యమార్గాలు ఉన్నట్లు ఆదివాసులు చెబుతుంటారు. పుష్యమాసంలో శంకర్‌లొద్ది వద్ద ఉన్న వాగు(కప్లయ్‌)లో స్నానం చేసి నియమ నిష్ఠలతో సంప్రదాయబద్ధంగా ఆదివాసులు గుహ వద్దకు చేసుకుని పూజలు చేస్తారు. గుహ ఎదుట ఆదివాసుల దేవతలకు గుర్తుగా జెండాలు పెడతారు. ఆ తరువాత ఆదివాసీ పెద్దలు సుమారు 100 మంది మాత్రమే కాగడాలు చేతబూని గుహలోకి వెళ్తారు. కొంతదూరం వెళ్లాక గుహలోపల విశాలమైన ప్రాంతంలో శివలింగం, జంగుబాయి దేవతల ప్రతిమలు దర్శనమిస్తాయి. వీటి వద్ద ఆదివాసులు తమ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆధ్యాత్మిక చింతనకు..  దైవభక్తికి ప్రతీకలు..

గుహలో కొలువైన శివలింగం, జంగుబాయి దేవతను కొలిస్తే తమ జీవనాధారమైన వ్యవసాయం బాగుంటుందని, నిత్యం అడవుల్లో సంచరించే ఆదివాసులకు ఆపద రాదని విశ్వాసం. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని, రోగాలు రావని, ఆదివాసులు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. ఈ గుహల్లోని దైవమే వారి ఇలవేల్పుగా  భావిస్తుంటారు. ఐదు రాష్ర్టాల ఆదివాసులకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న  జంగుబాయి గుహలు ఆధ్యాత్మిక చింతనకు, దైవభక్తికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.


logo