మంగళవారం 26 మే 2020
Adilabad - May 23, 2020 , 01:48:23

అమ్మకు అండ

అమ్మకు అండ

 పట్టణాలతో పాటు గ్రామీణ మహిళల్లోనూ చక్కటి అవగాహన

 మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 50,362 కాన్పులు

 ఇప్పటి వరకు 35, 665 కిట్ల పంపిణీ

 రాష్ట్రంలో ఆదిలాబాద్‌ మూడో స్థానం

 ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళలు

ఎదులాపురం: కాన్పు అంటేనే పెద్ద ఆపరేషన్‌ చేసే ప్రైవేటు దవాఖానల బారి నుంచి మహిళలను కాపాడుతున్న కేసీఆర్‌ కిట్‌ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలకు వేలు పోసే బాధ తప్పడంతో పాటు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఇంటికి చేరుతుండడంతో, సర్వత్రా ఆదరణ పొందుతోంది. 2017 జూన్‌ 3న జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభించారు. ఈ ఏడాది మే 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానలు, జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో కలిపి 50,362 ప్రసవాలు జరిగాయి. 35, 665 మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అందజేశారు. కాగా కిట్ల పంపిణీలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. కిట్‌లో తల్లీబిడ్డకు అవసరమైన 15 రకాల వస్తువులతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు మూడు విడుతల్లో అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీల ద్వారా ఎప్పటికప్పడు సమాచారం సేకరిస్తున్న వైద్య సిబ్బంది, గర్భం దాల్చిన మహిళల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం జరిగితే తల్లీబిడ్డను వైద్యసిబ్బంది అప్రమత్తంగా చూడడంతో పాటు వసతి, భోజనం సదుపాయం కల్పిస్తారు. దవాఖాన నుంచి ఇంటికి వేళ్లేందుకు ఉచితంగా 102 అంబులెన్స్‌ సదుపాయం ఉంది. 

‘కేసీఆర్‌ కిట్‌'కు విశేష స్పందన

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వైద్యశాలల్లో గర్భిణులు ప్రసవాల కోసం క్యూ కడుతున్నారు. ఇంటి, ప్రైవేట్‌ దవాఖానల్లో ప్రసవాలను అరికట్టి, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసీఆర్‌ కిట్లపై పూర్తి స్థాయిలో అవగాహన రావడంతో పాటు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న స్వయంగా తన కారులో కేసీఆర్‌ కిట్‌ ఉంచి వివిధ కార్యక్రమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్ల ద్వారా అందించే వస్తువులు నవజాత శిశువులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు తల్లికి కూడా ఉపయోగపడేలా ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగిన వెంటనే కేసీఆర్‌ కిట్లను అందజేస్తున్నారు.

పేదలకు అండగా..

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం కోసం వచ్చే పేద గర్భిణులకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది. దవాఖానలో ప్రసవం జరిగిన తర్వాత 2 రోజుల వ రకు వైద్యుల పర్యవేక్షణలో ఉండే తల్లీబిడ్డల కోసం వసతితో పాటు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దవాఖాన నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా 102 అంబులెన్స్‌ సదుపాయం కల్పిస్తున్నారు. జననీ సురక్ష యోజన ద్వారా రూ. వెయ్యి పారితోషకాన్ని ఇస్తున్నారు. ఇక నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రతి గర్భిణికి ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు మూడు విడుతల్లో అందజేస్తున్నారు. 5,7 నెలల్లో టీకాల తర్వాత మొదటి విడతగా రూ.4వేలు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే మరో రూ.4వేలు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే మరో రూ.4వేలు, శిశువుకు 5 నెలలు పూర్తయిన తర్వాత మరో రూ.4వేలు అందిస్తున్నారు. ఈ నగదు మొత్తాన్ని నేరుగా గర్భిణి పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాల్లో మాత్రమే జమ చేస్తారు. ఇన్ని రకాల సదుపాయాలు ఉండడంతో ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవం చేసుకునేందుకు గ్రామీణులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగింది.

గర్భం దాల్చగానే అన్ని వైద్య పరీక్షలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. కడుపు లోని బిడ్డను కాపాడుతూ గర్భిణులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైద్యపరీక్షలు ఉచితంగా అందుతున్నాయి. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగింది. బిడ్డ పుట్టిన తర్వాత 15రకాల వస్తువులను ఇచ్చి, 102అంబులెన్స్‌లో ఉచితంగా ఇంటికి పంపడం ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు.                                             

-నిఖిత, తలమడుగు మండలం

రిమ్స్‌లో ప్రసవాల సంఖ్య పెరిగింది

కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రిమ్స్‌లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీలైనంత వరకు వైద్యులు సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. ప్రసవం అయిన వెంటనే కేసీఆర్‌ కిట్‌ను ఇస్తున్నాం. ఈ పథకం బాగుందని చాలా మంది మాతో చెబుతున్నారు. గతంలో  కంటే ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఏడుగురు గైనకాలజిస్ట్‌లు ఉన్నారు. నలుగురు రెగ్యులర్‌ సేవలు అందిస్తుండగా, మరో ముగ్గురు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు.

- బీ బలరాం నాయక్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌ logo