మంగళవారం 26 మే 2020
Adilabad - May 23, 2020 , 01:48:26

సమగ్ర సాగుకు సమాయత్తం

సమగ్ర సాగుకు సమాయత్తం

 ఉమ్మడి జిల్లాలోప్రతిపాదితసాగు ప్రణాళిక రెడీ

 గణనీయంగా పెరుగనున్న పత్తి, కంది సాగు విస్తీర్ణం

 కాస్త తగ్గనున్న వరి.. భారీగా తగ్గిపోనున్న సోయాబీన్‌

 మక్క వేయవద్దని వ్యవసాయాధికారుల సూచన 

రాష్ట్ర సర్కారు సమగ్ర సాగు విధానానికి శ్రీకారం చుడుతున్నది.. సర్కారు చెప్పిన బాటలో పయనించేందుకు ఉమ్మడి జిల్లా రైతాంగం సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి వానకాలం సాగు ప్రణాళిక కూడా రెడీ అయ్యింది. తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పలు మార్పులు చేశారు. సమగ్ర సాగు విధానాన్ని అమలు చేసేందుకు నియంత్రిత పంటలు వేసేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో పత్తి, కంది సాగు గణనీయంగా పెరుగనున్నది. మరోవైపు వరి విస్తీర్ణం స్వల్పంగా తగ్గుతుండగా.. సోయాబీన్‌ సాగు గణనీయంగా పడిపోనున్నది. ఇక మక్క అసలే వేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.       

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, సోయా సాగు చేస్తారు. వీటితోపాటు కందులు, మక్కజొన్న, పప్పు దినుసులు, ఆయిల్‌ పంటలు వేస్తుంటారు.  ఉమ్మడి జిల్లాలో గతేడాది వానకాలంలో 8,52,422 ఎకరాల్లో పత్తి వేయగా.. ఈసారి రికార్డు స్థాయిలో పత్తి పెరుగనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12,30,638 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈసారి 2,78,216 ఎకరాల్లో పత్తి విస్తీర్ణం పెరుగనుంది. ఈ లెక్కన గతంలో కంటే 30 శాతం పత్తి విస్తీర్ణం పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు పత్తితోపాటు కంది సాగు కూడా గణనీయంగా పెరుగనుంది. నిర్మల్‌ జిల్లాలో 91,255 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 85,088 ఎకరాలు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 65,550 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 36,323 ఎకరాల్లో పత్తి సాగు గతేడాది కంటే ఈసారి పెరుగనుంది. గతేడాది 83,459 ఎకరాల్లో కంది సాగు చేయగా.. ఈసారి 2,30,742 ఎకరాల్లో కంది సాగు వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ లెక్కన గతేడాది కంటే ఈసారి 1,47,283 ఎకరాల్లో కంది విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టారు. గతంలో కంటే ఈసారి మూడు రేట్లు పెంచేలా అధికారులు దృష్టి సారించారు. నిర్మల్‌ జిల్లాలో 80,732 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 25,742 ఎకరాలు, ఆసిఫాబాద్‌లో 26,309 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 14,500 ఎకరాల్లో కంది పంట గతేడాది కంటే ఈసారి అధికంగా సాగు చేయనున్నారు. కందిని గతంలో అంతర పం టగా వేసేవారు. పత్తి, సోయాబీన్‌లో మధ్యలో 10 నుంచి 20 వరుసలకు కంది పంట వేసేవారు. ఈసారి కందిని పెద్ద మొత్తంలో సాగు చేస్తుండగా అందుకనుగుణంగా అధికారులు రైతులను ప్రోత్సహించనున్నారు.

స్వల్పంగా తగ్గనున్న వరి

వరి విషయానికొస్తే గతేడాది వానకాలంలో 3,22,872 ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి 2,91,293 ఎకరాల్లో వేయాలని భావిస్తున్నారు. గతంలో కంటే ఈసారి స్వల్పంగా తగ్గనుంది. సుమారు 31,579 ఎకరాల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, ఎల్లంపల్లి, కుమ్రం భీం, సరస్వతీ కాలువ, సదర్మాట్‌ కాలువలతోపాటు గూడెం ఎత్తిపోతల కింద వరి సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బోరుబావుల కింద సాధ్యమైనంత కంది, పత్తి సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పత్తి, కంది పంటలకు నీరివ్వడం వల్ల దిగుబడి బాగా పెరుగుతుందని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.

పూరిస్థాయిలో తగ్గనున్న సోయాబీన్‌

జిల్లాలో గతంలో నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పత్తి తర్వాత అధికంగా సోయాబీన్‌ సాగు చేసేవారు. ఈ ఏడాది సాధ్యమైనంత సోయా తగ్గించేలా అధికారులు దృష్టి పెట్టారు. నిర్మల్‌ జిల్లాలో 96 వేల ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 1.05 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 12,500 ఎకరాల్లో సోయా సాగు చేయాలని ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసినా విత్తనాల సమస్య ఏర్పడుతోంది. ఇతర రాష్ర్టాల నుంచి విత్తనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుపై ప్రభావం పడనుంది. ప్రభు త్వ పరంగా 30 శాతం వరకే విత్తనాలు సరఫరా అవుతాయని, మిగతావి ప్రైవేట్‌లోనే కొనాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నా రు. దీంతో సోయాబీన్‌ సాగు విస్తీర్ణం తగ్గనుం ది. మరోవైపు వానకాలంలో అసలు మక్కల సాగు వేయవద్దని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సూచించారు. గతేడాది వానకాలంలో ఉమ్మడి జిల్లాలో 26 వేల ఎకరాలకు పైగా సాగయ్యా యి. యాసంగిలో రికార్డుస్థాయిలో లక్ష ఎకరా ల వరకు సాగైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మక్కజొన్న వేయవద్దని వచ్చే రెండు, మూడు ఏళ్ల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి మక్క సాగు అసలే వద్దని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు తగ్గట్లు రైతులు కూడా ప్రభుత్వం, అధికారులు సూ చ న మేరకు సాగుకు సమయాత్తమవుతున్నారు.


logo