ఆదివారం 05 జూలై 2020
Adilabad - May 17, 2020 , 02:07:07

వలస కూలీల లారీ బోల్తా

వలస కూలీల లారీ బోల్తా

నిర్మల్‌ అర్బన్‌/ సోన్‌ : నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజా మున లారీ బోల్తాపడ్డ ఘటనలో 28 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 70 మంది వలస కూలీలతో ఓ లారీ హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌కు వెళ్తున్నది. అర్ధరాత్రి డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను లారీ ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో 9 మందికి తీవ్ర, 19 మంది స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను హుటాహుటిన ఏరియా దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ తరలించారు. ఎస్పీ శశిధర్‌ రాజు, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. అక్కడే ఉన్న పలువురు వలస కూలీలతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. వారికి అల్పాహారం అందించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారు సొంతూళ్లకు వెళ్తామని చెప్పడంతో మంత్రి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. వాహనాలు సమకూర్చారు. అనంతరం ఏరియా దవాఖానకు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ, ఎస్పీ శశిధర్‌రాజు క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, సీనియర్‌ నాయకులు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సర్పంచ్‌లు గంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ దేవేందర్‌రెడ్డి, నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, పట్టణ సీఐ జాన్‌దివాకర్‌, సోన్‌ సీఐ జీవన్‌ రెడ్డి, ఎస్‌ఐ కృష్ణకుమార్‌, పలువురు కౌన్సిలర్‌ ఉన్నారు.

ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి

భైంసా రూరల్‌ : మండలంలోని దేగాం గ్రామ సమీపంలోని హరియాలి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడడంతో జాదవ్‌ దత్తు(25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాదవ్‌ దత్తు భైంసా నుంచి ఖాళీ ట్రాలీతో పిప్రి గ్రామానికి వెళ్తున్నాడు. హరియాలి పెట్రోల్‌బంకు వద్ద అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా పడింది. గమనించిన స్థానికులు 108లో ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. 

కామోల్‌ గ్రామ శివారులోని సుద్దవాగు వంతెన నుంచి ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. కామోల్‌కు చెందిన గడ్డం దత్తు తన ట్రాక్టర్‌తో సుద్దవాగులో ఇసుక కోసం వెళ్తుండగా, అదుపుతప్పి పడిపోయింది. దత్తుకు స్వల్పగాయాలయ్యాయి.

నేరడిగొండ : మండలంలోని ఆరెపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో జాదవ్‌ హరి (53) అక్కడికక్కడే మృతి చెందాడు. తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వైపు పోతున్న ఓ లారీ ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో పక్క నుంచి టీవీఎస్‌ మోపెడ్‌ వాహనంపై వెళ్తున్న హరిని ట్రాక్టర్‌ బలంగా తాకింది. దీంతో హరికి తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


logo