బుధవారం 21 అక్టోబర్ 2020
Adilabad - May 08, 2020 , 06:35:58

రోహణిలో అలికితే ప్రయోజనాలెన్నో..

రోహణిలో అలికితే ప్రయోజనాలెన్నో..

  • ప్రారంభంలో నారుపోస్తే అధిక దిగుబడులు
  • కార్తెలకు అనుగుణంగా సాగు.. రైతుకు మేలు
  • సీఎం కేసీఆర్‌ పిలుపుతో అంతటా ఇదే చర్చ

నిర్మల్‌, ప్రధాన ప్రతినిధి/నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/బీర్కూర్‌/రుద్రూర్‌ విలేకరులు  : రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి పెద్దపీట వేయడంతో కొన్నేండ్లుగా జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఎక్కడ చూసినా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంటున్నది. కాళేశ్వరం జలాల రాకతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. దీంతో ఆయకట్టుకు భరోసా ఏర్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మరోవైపు బోరుబావుల్లోనూ నీరు పుష్కలంగా ఉంటున్నది. మండుటెండల్లోనూ చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వానాకాలంలో వర్షాల కోసం ఎదురుచూడకుండా.. రైతులు రోహిణి కార్తె నుంచే సేద్యం ప్రారంభిస్తే బాగుటుందని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు సూచించారు. రోహిణి కార్తెకు అనుకూలంగా సేద్యం ప్రారంభిస్తే.. రెండు పంటలకు ఎలాంటి చీడపీడ సమస్యలూ ఉండవని, అకాల వర్షాల సీజన్‌ను తట్టుకోవచ్చనే అభిప్రాయాన్ని  వ్యవసాయరంగ నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు పంట దిగుబడులు సైతం బాగా వస్తాయని చెబుతున్నారు. అన్నదాతకు అనేక విధాలుగా మేలు జరుగుతున్నదన్న సీఎం కేసీఆర్‌ అభిప్రాయంతో జిల్లాలోని వ్యవసాయ అధికారులు ఏకీభవిస్తున్నారు. రోహిణి కార్తెలోనే పంటలు వేసుకుంటే అక్టోబర్‌ నాటికి పంట చేతికొస్తుందని.. నవంబర్‌లో యాసంగి ప్రారంభమైతే మార్చి రెండో వారం నాటికి పంట లు చేతికి వస్తాయని, దీంతో వడగండ్ల వాన బెడద తప్పుతుందని చెబుతున్నారు. రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమవుతుండగా.. ఆ కార్తెలో వరినాట్లు వేయాలంటే ఈ వారం, పది రోజుల్లో నారు పోసుకోవాలి. 18-21 రోజుల మధ్య నారును నాట్లుగా వేసుకునే వీలుంటుందని వ్యవసాయ అధికారులు, నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. చెరువులు, బావులు ఉన్నవారు నాట్లు వేసుకునేందుకు రోహిణి కార్తె అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. బోర్లు, కాలువలు వచ్చాక రోహిణి కార్తెలో నాట్లు వేయడం లేదని, జూలై నెలాఖరు, ఆగస్టు రెండో వారం వరకు నాట్లు వేస్తుండడంతో వానాకాలం కోత ఆలస్యమవుతున్నది. తర్వాత యాసంగి పంటకు సైతం ఆలస్యమై మే రెండోవారం వరకు వరి కోతలు కొనసాగుతుండడంతో వడగండ్ల వానలకు పంట పొలాలతో పాటు కల్లాల్లోనూ పంటలు తడిచి రైతులు నష్టపోతున్నారు. రోహిణి కార్తెలో నాట్లు వేయడంతో మూడు పంటలు పండించుకోవచ్చు. మరోవైపు నవంబర్‌ రెండోవారంలో రెండో పంటగా వరినాట్లు వేస్తే మార్చి రెండోవారం నాటికి యాసంగి కోతలు కోయవచ్చు. తద్వారా వడగండ్ల వాన సమస్యను అధిగమించవచ్చు. 180 నుంచి 210 రోజుల పాటు పంటకాలం ఉండే వరి రకాలు రోహిణి కార్తెలో నాటుకోవడమే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

రోహిణి కార్తెలో నాట్లు వేయడం మంచిదే.. 

రోహిణి కార్తెలో నాట్లు వేయడం ద్వారా  పైరుకు చీడపీడలు, తెగుళ్లు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అక్టోబరు రెండో వారం నాటికి కోతలు కోసుకోవ చ్చు. అక్టోబరు నెలాఖరు వరకు యాసంగిలో పప్పుధాన్యాలు, కూరగాయలు, నూనె గింజల పంటలు వేసుకోవచ్చు. తర్వాత జనవరి నెలాఖరులో నీటి వసతి, నేల స్వభావాన్ని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులతోపాటు  పశుగ్రాసం పండించుకోవచ్చు. 

    -శ్రీధర్‌, రుద్రూర్‌ వరి పరిశోధనా కేంద్రం అధిపతి

రైతుకు మేలు.. 

రోహిణి కార్తెలో విత్తనాలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. రోహిణిలో వరి సాగు చేసుకుంటే తరువాయి సీజను పంటను సకాలంలో వేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. బోధన్‌ ప్రాంతంలో సన్న రకాలను సాగుచేసే రైతులు రోహిణిలోనే విత్తనాలు అలుకుతారు. రోహిణిలో అలికిన పంటలకు చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఎస్సారెస్పీ వరద కాలువ లాంటి ప్రాంతాల్లో రోహిణిలో సన్నరకాల వరి పంట వేసుకోవచ్చు.  

-గోవింద్‌ నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి, నిజామాబాద్‌


logo