మంగళవారం 07 జూలై 2020
Adilabad - Apr 25, 2020 , 02:57:19

తరుగు తీస్తే క్రిమినల్‌ కేసులు

తరుగు తీస్తే క్రిమినల్‌ కేసులు

  • మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించొద్దు
  • సమీక్షా సమావేశాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

నిజామాబాద్‌/కామారెడ్డి జిల్లా ప్రతినిధులు: తరుగు పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై యంత్రాంగం కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని, అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి మిల్లును సీజ్‌ చేస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వంద శాతం ధాన్యాన్ని మనం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మండలానికి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, మిల్లర్ల మోసానికి రైతులు గురికాకుండా నిరంతరం వీరు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంను ఏర్పాటు చేసుకొని పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశాల్లో నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, శరత్‌, సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, అధికారులు పాల్గొన్నారు.  

కరోనా కట్టడిలో యంత్రాంగం సేవలు భేష్‌: మంత్రి 

కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, శరత్‌, సీపీ కార్తికేయ, అధికారులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశంసించారు.  నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 61 పాజిటివ్‌ కేసులకు 30 మంది నెగెటివ్‌ ఫలితాలు రావడంతో డిశ్చార్జి అయ్యారని, మిగిలిన 31 మంది కూడా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 12 పాజిటివ్‌ కేసుల్లో చికిత్స తర్వాత ఐదుగురికి నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జి అయ్యారని వివరించారు. మిగిలిన ఏడుగురికి  చికిత్స అందుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ప్రజలంతా లాక్‌డౌన్‌ను మే 7 వరకు సంపూర్ణంగా పాటించాలని సూ చించారు. ప్రజలకు గుడ్డతో తయారు చేసిన మాస్కులను పంపిణీ చేయడానికి మహిళా సంఘాల ద్వారా, దాతల సహకారంతో సిద్ధం చేయించాలని సూచించారు. గ్రామాల్లో ఐకేపీ ద్వారా మాస్కులు కుట్టించి వాటిని దాతలు, జీపీల ఆధ్వర్యంలో కొనుగోలు చేయించి ప్రతి ఒక్కరికీ రెండు మాస్కుల చొప్పున పంచాలన్నారు.

కరోనా వేళ రెండు కీలక నిర్ణయాలు 

మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆపన్నులకు అండగా ఉండేందుకు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా లో అనాథలు, తిండి దొరక్క అలమటిస్తున్న వలస కార్మికుల కడుపునింపేందుకు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమన్వయం చేసుకొనేందుకు నోడల్‌ ఆఫీసర్‌ను నియమించు కోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ‘నిజామాబాద్‌ అన్నదాతలం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదానం చే సేందుకు ముందుకు వస్తున్న వారిని సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ భోజనాలు అందించాలో  ఈ అధికారి సమన్వ యం చేసుకోవాల్సి ఉంటుంది.  భరోసా పేరుతో మరో కార్యక్రమాన్ని మంత్రి జిల్లాలో ప్రారంభించారు. పాజిటివ్‌ వచ్చిన 61మంది కుటుంబాలను  సమాజం అంటరాని వారుగా చూడడం దారుణమని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే   వారికి సరిపడే నిత్యావసరాలు ఇంటి వద్దకే తీసుకెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు  మంత్రి ప్రకటించారు.

మంత్రికి విరాళాలు అందజేత

ఇందూరు: కరోనా బాధితుల కోసం ఆర్‌బీవీఆర్‌ఆర్‌ విద్యాసంస్థ ప్రతినిధులు కలెక్టర్‌, సీఎం, పీఎం సహాయ నిధులకు రూ. మూడు లక్షలు, సాయిశక్తి కన్‌స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధికి రూ. లక్ష విరాళాన్ని  మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కలెక్టర్‌ చాంబర్‌లో శుక్రవారం అందజేశారు.


logo