బుధవారం 03 జూన్ 2020
Adilabad - Apr 10, 2020 , 02:19:13

మరింత కట్టుదిట్టం..

మరింత కట్టుదిట్టం..

  • కర్ఫ్యూ నీడలో నిర్మల్‌..
  • నాలుగు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ 

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో మరిన్ని పకడ్బందీ చర్యలకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా నిర్మల్‌ జిల్లాలో గురువారం రాత్రి నుంచి నాలుగురోజుల పాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నిజామాబాద్‌లోనూ బందోబస్తు మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో మరిన్ని బలగాలను రంగంలోకి దించారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాలపై నిఘాను మరింత పెంచారు. కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నిర్మల్‌ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండడంతో కఠిన నిబంధనల అమలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నది. అయినా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరడంతో గురువారం రాత్రి 7గంటల నుంచి సోమవారం సాయంత్రం వరకు నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. వరుసగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ప్రకటించారు. నాలుగు రోజులపాటు సంపూర్ణ కర్ఫ్యూ ఉన్నందున మెడికల్‌ షాపులు, దవాఖానలు, డెయిరీలు తప్పా మిగితావన్నీ మూసి ఉంచుతారు. అంబులెన్స్‌, అత్యవసర దవాఖాన వాహనాలు తప్ప.. ఇతర వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తారు. ఇప్పటికే జిల్లాలో వెయ్యికి పైగా వాహనాలను సీజ్‌ చేశారు. పాలు, కూరగాయలు, సరుకుల సరఫరాకు  అనుమతించారు. 

ఒకేరోజు ఐదు పాజిటివ్‌ కేసులు...

జిల్లాలో గురువారం ఒక్కరోజే ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. భైంసాలో 3, చాక్‌పల్లిలో 3, నిర్మల్‌లో 5, పెంబి మండలం రాయదారి, లక్ష్మణచాంద కనకాపూర్‌, రాచాపూర్‌, మామడ మండలం న్యూలింగంపల్లిలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఇప్పటికే మృతిచెందా రు. దీంతో అధికారులు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో రోడ్లు, దారులన్నీ బారికేడ్లు పెట్టి మూసివేయడంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు ఆ ప్రాంతాల్లో ఇంటికే పంపిస్తున్నారు. జిల్లాలో 14 గ్రామాలను కంటైన్‌మెంట్‌ ఏరియాలుగా గుర్తించి ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 220 మంది శాంపిళ్లను పంపగా.. ఇందులో 175 నెగెటివ్‌ వచ్చాయి. 30 మంది శాంపిళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 15మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇతర దేశాలు, ఢిల్లీలోని మర్కజ్‌ నుంచి వచ్చిన 114 మందికి నెగెటివ్‌ రిపోర్టులు రావడంతో ఇప్పటివరకు 59 మందిని వారి ఇండ్లకు పంపించారు. మరో 55మందిని నేడు (శుక్రవారం) ఇండ్లకు పంపించనునున్నారు. మరో 120మంది భైంసా, నిర్మల్‌లోని క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారు.  జిల్లాలో 30వేల ఇండ్లను సర్వే చేయాలని నిర్ణయించగా..ఇప్పటికే 20వేల ఇండ్ల సర్వే పూర్తయింది. నిర్మల్‌లో 105, భైంసాలో 42 సర్వే బృందాలు పనిచేస్తుండగా.. గ్రామాల్లో నాలుగైదు బృందాలు పనిచేస్తున్నాయి. నర్సాపూర్‌ (జీ) మండలం చాక్‌పల్లి వీఆర్వోకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పటికే తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేశారు. తాజాగా అదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఎంపీడీవో కార్యాలయ మొత్తం సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. 

 ఇందూరులో 47కు చేరిన కేసులు 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో యంత్రాంగం మరింత కట్టుదిట్ట చర్యలకు సిద్ధమైంది. జిల్లాలో గురువారం మరో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 47కు చేరాయి. జిల్లాలో 21 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లకుండా అధికారులు పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. జిల్లాలో  కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టికేంద్రీకరించారు. మూడు పర్యాయాలు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాస్థాయి సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో  బుధవారం పర్యటించారు. బాల్కొండ, వేల్పూర్‌, భీమ్‌గల్‌ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమయ్యారు. జిల్లా కేంద్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏడో బెటాలియన్‌ నుంచి ప్రత్యేక బలగాలను నగరంలో మోహరింపజేస్తున్నారు. ఇప్పటికే ఒక ప్లటూన్‌ దళం జిల్లా కేంద్రానికి వచ్చినట్లు సమాచారం. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ను పకడ్బందీగా నిర్వహిస్తే, కరోనా మహమ్మారి విస్తరించే పరిస్థితులు రాకుండా చేయొచ్చని  జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నది. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఇక ఆంక్షలే ఉండనున్నాయి.  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం రాత్రి కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులపై ఆరాతీశారు. కట్టడి మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తాను స్వయంగా శనివారం జిల్లాకేంద్రానికి వచ్చి కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ పరిధిలో పర్యటిస్తానని, పరిస్థితి  అదుపులో ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, జిల్లాలో  మరో ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  కలెక్టర్‌ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 47కు చేరిందని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. 

తాజాగా మరో ఐదు కేసులు..

నిర్మల్‌ జిల్లాలో ఇప్పటి వరకు 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సంపూర్ణ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. వందశాతం లాక్‌డౌన్‌ అమలు చేస్తాం. ప్రజలెవరూ బయటకు రావద్దు. గురువారం ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో నిర్మల్‌కు చెందిన ఒకరు, నర్సాపూర్‌(జీ) మండలం చాక్‌పల్లికి చెందిన ఇద్దరు, భైంసాకు చెందిన ఇద్దరు ఉన్నా రు.జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. 11 కంటైన్‌మెంట్‌ ఏరియాలను గుర్తించాం.  

-ముషారఫ్‌ అలీ ఫారూఖీ, నిర్మల్‌ కలెక్టర్‌ 

కంటైన్‌మెంట్‌ ఏరియాలో బాన్సువాడ 

బాన్సువాడ , నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 9 కరోనా పాజిటిల్‌ కేసులు నమోదు కావడంతో  అధికారులు అలర్ట్‌ అయ్యారు. బాన్సువాడలోని మదీనా కాలనీ, టీచర్స్‌ కాలనీ, అరాఫత్‌ కాలనీలను కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కాలనీల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా దిగ్బంధం చేశారు. ఈ కాలనీ వాసులకు అధికారులు నిత్యావసర సరుకులు నేరుగా సరఫరా చేస్తున్నారు.  గురువారం ఆరుగురి రిపోర్టులు రాగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. 

క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటుకు భవనాల పరిశీలన

భీమ్‌గల్‌/కోటగిరి /బాన్సువాడ రూరల్‌/రెంజల్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌, కోటగిరిల్లో క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు గురువారం భవనాలను పరిశీలించారు. భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి పట్టణ శివారులోని గిరిజన వసతి గృహాన్ని పరిశీలించారు. కోటగిరిలోని కస్తూర్బా విద్యాల యాన్ని డీఈవో జనార్దన్‌రావు పరిశీలించారు. బాన్సువాడ మండలం బోర్లంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆర్డీవో రాజేశ్వర్‌అధికారులతో కలిసి పరిశీలించారు. క్వారంటైన్‌లో సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికులకు మాస్కులు, డ్రెస్‌లు అందజేశారు.  రెంజల్‌ ఆదర్శ ఆదర్శ పాఠశాల క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న నలుగురికి నెగెటివ్‌  రావడంతో గురువారం వారిని ఇంటికి పంపినట్లు తహసీల్దార్‌ అసదుల్లాఖాన్‌ తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది. 
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 


logo