బుధవారం 03 జూన్ 2020
Adilabad - Apr 08, 2020 , 02:41:40

పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

నమస్తే తెలంగాణ యంత్రాంగం:  కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పకడ్బందీగా అమలవుతున్నది. మంగళవారం సైతం ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పట్టణాల్లోని ప్రధాన రోడ్లతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. ఆయాప్రాంతాల్లో నిర్ణీత వేళల్లో కిరాణా, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంచారు. తమ గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు ఎవరూ రాకుండా వీడీసీ సభ్యులు, యూత్‌ సభ్యులు కాపలాకాశారు. రేషన్‌ బియ్యం, పింఛన్ల పంపిణీ కొనసాగుతున్నది. సామాజిక దూరం పాటించేలా డీలర్లు, అధికారులు చర్యలు తీసుకుంటూ బియ్యం, పింఛన్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దనోరా(బీ) గ్రామంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ బియ్యం పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని తాంసి బస్టాండ్‌ ప్రాంతంలో ఉదయం సమయంలో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. కలెక్టరేట్‌ చౌరస్తాలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. 

సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ..

భైంసా పట్టణంలోని వీధుల్లో, కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్‌ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. భైంసా మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు.  మాచారెడ్డి, పిట్లం, బోథ్‌, జక్రాన్‌పల్లి, సిరికొండ, దస్తురాబాద్‌ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 

బిచ్కుంద మండలంలోని 27 గ్రామపంచాయతీలకు 1470 లీటర్ల సోడియంహైపోక్లోరైట్‌ ద్రావణం పంపిణీ చేసినట్లు ఎంపీడీవో ఆనంద్‌ తెలిపారు. 


logo