బుధవారం 03 జూన్ 2020
Adilabad - Apr 07, 2020 , 03:17:58

ఆదిలాబాద్‌లో అలర్ట్‌!

ఆదిలాబాద్‌లో అలర్ట్‌!

నమస్తే తెలంగాణ యం త్రాంగం: ఆదిలాబాద్‌ జిల్లాలో 10 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు నిఘాను మరింత పటిష్టం చేశారు. జిల్లా కేంద్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాలతో పాటు నేరడిగొండ, ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.  సోమవారం సాయంత్రం కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు తాంసిలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు ఆదిలాబాద్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తొడసం చందు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వారు 124 మంది ఉన్నారని, ఇటీవల మర్కజ్‌కు వెళ్లివచ్చిన 70 మందితో పాటు మరో 13 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా 45 మంది రిపోర్టు రాగా, ఇందులో 35 మందికి నెగిటివ్‌, పది మందికి పాజిటివ్‌ వచ్చిందని వివరించారు.  పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు 70మందిని  కార్వంటైన్‌లో ఉంచామన్నారు. వారి శాంపిళ్లను గాంధీ దవాఖానకు పంపించినట్లు తెలిపారు.  రిమ్స్‌లో చికిత్సపొందుతున్న కరోనా వైరస్‌ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. సోమవారం ఆయన రిమ్స్‌ను పరిశీలించారు. 

కామారెడ్డి జిల్లాలో.. 

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణానికి చెందిన ఏడుగురికి పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలోని అరాఫత్‌ కాలనీ, మదీనా కాలనీ, టీచర్స్‌ కాలనీలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆయా కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. పట్టణంలోని తొమ్మిది వేల కుటుంబాల వివరాలు సేకరించారు. ఇటీవల విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వారిని ఇప్పటికే హోంక్వారంటైన్‌లో ఉంచారు. నిత్యం వైద్య బృందాలు వారి కదలికలను గమనించే పనిలో ఉన్నాయి. బాన్సువాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ లో 110 మంది, 8 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

నిర్మల్‌ జిల్లాలో మరో మూడు

నిర్మల్‌ జిల్లాలో మర్కజ్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం మరో ముగ్గురికి పాజిటివ్‌ రాగా, వారు కూడా మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్‌ కేసులు నమోదుకాగా అందులో నిర్మల్‌కు చెందిన ఒకరు మృతి చెందారు. నిర్మల్‌లో ఇద్దరు, భైంసాలో ఒకరు,నర్సాపూర్‌ (జీ) మండలం చాక్‌పెల్లిలో మరొకరికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరు నివసించే ప్రాంతాలను కంటైన్‌ మెంట్‌ ఏరియాగా ప్రకటించారు. జిల్లా నుంచి 64 మంది మర్కజ్‌ వెళ్లిరాగా, వారితో పాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటై న్‌ చేశారు.  జిల్లాలో ఇప్పటివరకు 140 శాంపిళ్లను పరీక్షల కోసం పంపించారు. ఇందులో 68 మంది నివేదికలు వచ్చాయి. ఇందులో నాలుగు పాజిటివ్‌ రాగా, 64 మందికి నెగెటివ్‌ వచ్చాయి. ముందుగా 37 శాంపిళ్లు పంపగా ఇందులో 35 మంది ఫలితాలు ఆదివారం వచ్చాయి. అందులో ఒకరికి పా జిటివ్‌ రాగా మిగతా 34 మందికి నెగెటివ్‌ వచ్చింది. సోమవారం 33 శాంపిళ్ల ఫలితాలు రాగా, ఇందులో మూడు పాజిటివ్‌, 30 మంది కి నెగెటివ్‌ వచ్చింది. మరో 43 శాంపిళ్లను హైదరాబాద్‌కు పంపించారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు పాజిటివ్‌ కేసులు ఉండడంతో.. వీరు కలిసిన వ్యక్తుల రక్త నమూనాలను కూడా పరీక్షలకు పంపించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఆంక్షలు మ రింత కఠినతరం చేయనున్నారు.


logo