బుధవారం 03 జూన్ 2020
Adilabad - Mar 31, 2020 , 03:03:31

ఓ వైపు కరోనా కట్టడి.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు

ఓ వైపు కరోనా కట్టడి.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యావత్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను పారదోలేందుకు తెలంగాణ ప్రభుత్వం అలుపెరగని పోరా టం చేస్తున్నది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జల వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఈ దఫా యాసంగిలో వరి పంట భారీగా సాగైంది. పంట చేతికొచ్చే సమయం ఆసన్నం కావడంతో రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్‌ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్‌ పాటిస్తూనే, సామాజిక దూరాన్ని కొనసాగిస్తూనే పంట ఉత్పత్తులను సేకరించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. గతానికి భిన్నంగా ప్రతి గ్రా మంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి పంట ఉత్పత్తులు సేకరించేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో గరిష్ఠంగా 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా ఇప్పుడేకంగా 526 కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి.

క్లిష్ట సమయంలో.. సమన్వయంతో..

యాసంగిలో వరి పంట రికార్డు స్థాయిలో సాగు చేశా రు. పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌ వచ్చింది. తద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉండడంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ప్రతి గ్రామంలో ఒక్కో కేంద్రం ఏర్పాటుతో పాటు అవసరమైతే అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నారు.  గోనె సంచుల కొరత లేకుండా చూడనున్నారు.  

కలెక్టర్‌ శరత్‌ నేతృత్వంలో పటిష్ట ఏర్పాట్లు..

వరి పంట చేతికి వచ్చే సమయం వచ్చింది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంట కోతకు రానుంది.  లక్షలాది ఎకరాల్లో పంట సాగైంది. 4.50 లక్షల మెట్రికల్‌ టన్నుల మేర ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీన బీర్కూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా గోదాములు, రైస్‌ మిల్లులకు తరలించే ఏర్పాట్లపైనా అధికారులు కసరత్తు చేపడుతున్నారు.  

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం...

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి గ్రామాని కి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు సై తం తీసుకుంటాం. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే కర్షకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం.  

- శరత్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌


logo