సోమవారం 25 మే 2020
Adilabad - Mar 30, 2020 , 02:20:24

ఆపన్న హస్తాలు..

ఆపన్న హస్తాలు..

  • ఆపన్న హస్తాలు..
  • నిరాశ్రయులకు సరుకుల పంపిణీ
  • పోలీస్‌, వైద్య సిబ్బందికి పండ్లు.. 
  • పలుచోట్ల అన్నదానాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడోరోజు లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు, వైద్య సిబ్బంది ముమ్మరంగా అవగాహన కల్పించారు. ఆదివారం కావడంతో దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. నిబంధనలు పాటించని వారిని పోలీసులు హెచ్చరించారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా సాగుతున్నది. ఏడో రోజూ ఆదివారం ఆదిలాబాద్‌, బోథ్‌, ఉట్నూర్‌ నియోజకవర్గాల్లోని ప్రజలెవరూ ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను పోలీసులు అడ్డుకొని తిప్పి పంపిస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారిని అనుమతించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పట్టణంలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక మార్కెట్‌ను పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని గ్రామాలను సందర్శించి సర్పంచులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంపీ సోయం బాపురావు ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. ప్రత్యేక వార్డులు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక అంగడిబజార్‌లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. జైనథ్‌ మండలం మహారాష్ట్ర సరిహద్దులోని ఆనంద్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. బోథ్‌-కిన్వట్‌ అంతర్రాష్ట్ర రహదారి నిర్మానుష్యంగా మారింది. బోథ్‌, సొనాల, కౌఠ (బీ), ధన్నూర్‌ (బీ) తదితర గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా  స్వీయ గృహ నిర్బంధం పాటించారు. బోథ్‌ సీఐ రవీందర్‌, ఎస్సై రాజు, డాక్టర్‌ నవీన్‌రెడ్డి, ఆర్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి, పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించారు.  

నిర్మల్‌ జిల్లాలో..

కొవిడ్‌ -19(కరోనా వైరస్‌) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఆదివారం ఏడో రోజుకు చేరుకుంది. గ్రామీణ రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకు అన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం ఉదయం కిరాణా, కూరగాయల దుకాణాలు, మటన్‌, చికెన్‌, చేపల విక్రయ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటించి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలు స్వీయ నిర్బంధం పాటించారు. పలు మండలాల్లో ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. బాసరలో శ్రీవారి సేవా సమితి సభ్యులు, పోలీసులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను సీజ్‌ చేశారు. 

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఉన్న రోగుల సహాయకులకు దారుల్‌ అన్సార్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం వివిధ చౌరస్తాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, మున్సిపల్‌ సిబ్బందికి పండ్ల రసాలు, నీళ్ల ప్యాకెట్లు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని చౌరస్తాల్లో సేవలందిస్తున్న పోలీసులకు  పండ్లు, ఫ్రూట్‌ జ్యూస్‌, వాటర్‌బాటిళ్లను పంపిణీ చేశారు. ఉట్నూర్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌, రెవెన్యూ, వైద్యారోగ్య సిబ్బందికి మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన వైట్‌ యూత్‌ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు.

పేదలకు సరుకుల పంపిణీ

బోథ్‌లోని పలు కాలనీల్లోని పేదలకు అంజుమన్‌ ఫలాహె దరేన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎంపీటీసీ రజియాబేగం, నాసర్‌ అహ్మద్‌ సీఐ రవీందర్‌తో కలిసి సబ్బులు పంపిణీ చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని మిలింద్‌నగర్‌లో నిరుపేద కుంటుంబాలకు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారుతి డోంగ్రే ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. లోకేశ్వరం మండలంలోని మన్మథ్‌ గ్రామంలో, ఖానాపూర్‌ మండలం గోసంపల్లి గ్రామం లో పేదలకు, భిక్షాటన చేసే కుటుంబాలకు బీజేపీ కార్యకర్తలు నిత్యావసర సరుకులు అందజేశారు.

వలస కూలీలకు.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలకు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహారాష్ట్ర నుంచి బజార్‌హత్నూర్‌ నుంచి సిరికొండ మండల కేంద్రం మీదుగా మహారాష్ట్రలోని గడ్‌చందాకు కాలినడకన వెళ్తున్న 20 మంది కూలీలకు సర్పంచ్‌ నర్మద పది కిలోల బియ్యం, పప్పులు  అందించారు.  

అన్నదానం అభినందనీయం: నిర్మల్‌ ఎస్పీ

ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అభినందనీయమని నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందికి  సాయిదీక్షా సేవాసమితి సభ్యులు ఆదివారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...కరోనా మహ మ్మారికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతుండగా పోలీసు కుటుంబ సభ్యులు 24గంట లు ప్రజల రక్షణ కోసం కష్టపడుతున్నారని అన్నా రు. సాయిదీక్షా సేవాసమితి సభ్యుడు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి అన్నదానం చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్‌దివాకర్‌, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులున్నారు.


logo