గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Mar 23, 2020 , 02:29:57

జన చేతనకు జై

జన చేతనకు జై

  • జనతా కర్ఫ్యూ జయప్రదం
  • స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు
  • పట్టణాలతో పాటు గ్రామస్తుల మద్దతు
  • నిర్మానుష్యంగా మారిన రహదారులు
  • మహారాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల నిలిపివేత
  • భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద డ్రైవర్లకు భోజన వసతి
  • ఇండ్లకే పరిమితమైన ప్రజలు  
  • అందరి సహకారంతో విజయవంతం
  • జనం కర్ఫ్యూకు జనాలు జై కొట్టారు. కరోనాపై 

యుద్ధానికి తాము సైతం అంటూ మద్దతుగా నిలిచారు. జనతా కర్ఫ్యూలో సబ్బండ వర్ణాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. పల్లె,  పట్టణం తేడా లేకుండా వీధులు, రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కాగా ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కలేదు. మహారాష్ట్ర సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో వాహనాలను నిలిపివేశారు. వైద్య సేవలు అందిస్తున్న వారికి సంఘీభావంగా సాయంత్రం 5 గంటలకు జిల్లా ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. జిల్లాలో పాలు, కూరగాయలు, 104, 108 సేవలు యథాతథంగా కొనసాగాయి. నిర్మల్‌, భైంసా ఆర్టీసీ డిపోల పరిధిలో డిపోకు ఐదు బస్సుల చొప్పున బస్సులను అత్యవసర సేవల కోసం ఉంచారు. మిగతా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక్క వాహనాన్ని కూడా జిల్లాలోకి అనుమతించలేదు. ఇంద్రవెల్లి మండలం సమక గ్రామంలో ఆదివారం జరుగాల్సిన ఓ వివాహాన్ని కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. కాశీ నుంచి వస్తున్న యాత్రికులకు అధికారులు జిల్లా సరిహద్దులో నిలిపివేసి అవగాహన కల్పించారు. 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రజల పాలిట ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ది. వైరస్‌ రాకుండా వైద్యసేవలు మెరుగపర్చడమే కాకుండా ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలు సామూహికంగా తిరగకపోవడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి భా రీ స్పందన లభించింది. కొవిడ్‌-19 ప్రబలకుండా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ప్రజల కోసం.. ప్రజల ద్వారే చేపట్టిన జనతా కర్ఫ్యూకు అన్ని వర్గాల ప్రజలు జై కొట్టారు. జనతా కర్ఫ్యూ  గురించి మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరగడంతో  ఆదివారం ఉదయం ఆరు గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా నివారణలో భాగం గా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా భావించి కుటుంబసభ్యులతో కలిసి ఇండ్లలోనే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకు ఫైర్‌ ఇంజిన్‌తో ఆదిలాబాద్‌లో సైరన్‌ మోగిస్తూ వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు సైతం జనతా కర్ఫ్యూను పర్యవేక్షించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు కూరగాయలు, పాలు, పండ్లు, మందులు, ఇతర వస్తువులను ముందుగా సమకూర్చుకుని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఐక్యంగా పోరాటం.. 

కరోనా మహమ్మారిని పారదోలేందుకు చేపట్టిన జన తా కర్ఫ్యూ ప్రజల్లో ఐక్యతను చాటింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ సహకారాన్ని అందించారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, ఎంపీ సోయం బాపురావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్నతో పాటు మండలాలకు చెందిన నాయకులు, అధికారులు ఇండ్లలో కుటుంబసభ్యుతో కలిసి జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. కొవిడ్‌ -19ను పారదోలేందుకు గ్రామాల ప్రజలు సైతం తమ ఐక్యతను చాటిచెప్పారు. దీంతో పల్లెలు సైతం జన సంచారం లేక వెలవెలబోయాయి. ఇండ్లలో ప్రజలు కుటుంబసభ్యులతో కలిసి కాలక్షేపం చేయగా, పలువురు టీవీలు చూస్తూ గడిపారు. మరికొందరు  తమ ఇండ్లను  శుభ్రపర్చుకున్నారు. 

భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద డ్రైవర్లకు భోజనం 

రోజూ వందలాది వాహనాలు, లక్షల్లో జనాలతో రద్దీగా ఉండే రహదారులు, వీధులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. నేరడిగొండ నుంచి జైనథ్‌ మండలం పిప్పర్‌వడ వరకు ఉన్న 80 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండగా అధికారులు మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిలిపివేశారు. జైనథ్‌ మండలం భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద రవాణాశాఖ అధికారులు రాత్రి నుంచి వాహనాలను అడ్డుకోవడంతో భారీ సంఖ్యలో  వాహనాలు నిలిచిపోయాయి. రవాణాశాఖ అధికారులు వాహనాల డ్రైవర్లకు భోజన వసతి కల్పించారు. బోథ్‌ మండలం ఘన్‌పూర్‌, తలమడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద పోలీసులు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. పిప్పర్‌వాడ టోల్‌ ప్లాజా వద్ద కాశీ నుంచి ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ బృందాలు అడ్డుకున్నాయి. 

బస్సులు, రైళ్లు  బంద్‌.. 

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ డిపోల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏ ఒక్క బస్సును కూడా ఆర్టీసీ అధికారులు నడపలేదు. జిల్లా కేంద్రం నుంచి నడిపే పలు రైళ్లు నిలిచిపోయాయి. వేరే ప్రాంతాల నుం చి రైళ్లు సైతం రాలేదు. ట్యాక్సీలు, ఆటోలు కూడా నడువలేదు. ప్రజలు జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో మోటార్‌ సైకిళ్లు సైతం రోడ్డు ఎక్కలేదు. దీంతో జిల్లా కేంద్రంలోని వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా మారింది.


logo