శనివారం 28 మార్చి 2020
Adilabad - Mar 22, 2020 , 02:44:09

వైరస్‌ నివారణకు కృషి చేద్దాం..

వైరస్‌ నివారణకు కృషి చేద్దాం..

  • కలెక్టర్‌ శ్రీదేవసేన
  • జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందాం.. 

తాంసి : జిల్లాలో కరోనా వైరస్‌ నివారణకు కృషి చేద్దామని, దాని కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, రెవెన్యూ, పోలీసు సిబ్బందిని బృందాలుగా నియమించి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని గుర్తించడంకోసం గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. విదేశాల నుంచి 17మంది వచ్చారని, వారికి హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించారని, వారికి కూడా వ్యాధి లక్షణాలు లేవన్నారు. మరో 30 మందికి కూడా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేకున్నా.. వారి ఇంటివద్దనే ఐసోలేషన్‌ జరుగుతోందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ప్రజలు అధికారులకు తెలుపాలని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగం గా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లా ప్రజలు తమ ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఐదు నిమిషాల పాటు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి మద్దతు తెలుపాలని కోరారు. తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి మానసికంగా ధైర్యం అందించాలన్నారు. కరోనా మహమ్మారిని తరిమేందుకు తామంతా ఐకమత్యంగా ఉన్నామని నిరూపించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్‌, ఆదిలాబాద్‌ ఆర్డీవో సూర్యనారాయణ ఉన్నారు.  


logo