ఆదివారం 24 మే 2020
Adilabad - Mar 22, 2020 , 02:37:31

జనం కోసం.. జనం చేత.. జనతా కర్ఫ్యూ

జనం కోసం.. జనం చేత.. జనతా కర్ఫ్యూ

  • కరోనా వైరస్‌పై కామన్‌ మ్యాన్‌ వార్‌
  • 24 గంటల పాటు జిల్లాలో స్వచ్ఛంద కర్ఫ్యూ నిర్వహణ
  • నేడు ఉదయం 6గంటల నుంచి అమలు
  • విజయవంతం చేయాలని ప్రముఖుల పిలుపు
  • మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
  • బస్సులు, దుకాణాలు, అన్ని సేవల నిలిపివేత
  • ఎమర్జెన్సీ కోసం అందుబాటులో టోల్‌ ఫ్రీ నంబర్‌

ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలను కోరాయి. కేంద్రం పిలుపు స్ఫూర్తితో .. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు 24గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం.. సురక్షితమైన రాష్ట్రం, దేశం కోసం జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తామంటూ సబ్బండ వర్ణాలు పేర్కొంటున్నాయి. జనతా కర్ఫ్యూలో నేను సైతం.. అంటూ ప్రతి ఒక్కరూ భాగస్వాములమవుతామని ముందుకొస్తున్నారు.  రాష్ట్ర, దేశ మానవాళి శ్రేయస్సు దృష్ట్యా  24గంటల పాటు జనతా కర్ఫ్యూలో పాల్గొని ప్రభుత్వానికి సహకరిస్తామని చెబుతున్నారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని, ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ప్రముఖులు, అధికారులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 08732-220462 కు కాల్‌ చేయాలని అధికారులు సూచిస్తునారు. 

ఆదిలాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి:  జిల్లాలో కరోనా మహమ్మారి కట్టడికి అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నది. గ్రామీణ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు, ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు టీంలను కూడా ఏర్పాటు చేసింది. నేడు నిర్వహించే జనతాకర్ఫ్యూను విజయవంతం చేసేందుకు కలెక్టర్‌ శ్రీదేవసేన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కర్ఫ్యూలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

గ్రామస్థాయిలో 620 టీంలు.. 

జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా అధికారులు గ్రామ స్థాయిలో 620 టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలను సభ్యులుగా చేర్చారు. ఈ బృందం సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడం, వారి వివరాలు ఉన్నతాధికారులకు చేరవేయడం తదితర పనులు చేపడుతున్నారు. వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి ఇంటికి తిరిగి రాగానే చేతులను సబ్బుతో కడుక్కోవడం, నోటికి మాస్క్‌లు కట్టుకోవడం, దగ్గినా, తుమ్మినా రుమాలును అడ్డంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో కూడా తహసీల్దార్‌, మండల వైద్యాధికారి, ఎస్సైతో కూడిన 20 బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి తగిన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇంటి నుంచి 14 రోజుల పాటు ఎటూ వెళ్లొద్దని, ఇంట్లోనే ఐసోలేషన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో ఏడు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు.. 

జిల్లాకు సరిహద్దుల్లో మహారాష్ట్ర ఉండడంతో కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏడు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర సరిహాద్దు ప్రాంతాలైన జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా, ఆనందర్‌పూర్‌, బేల మండలం కొబ్బాయి, రాజుగూడ, తలమడుగు మండలం లక్ష్మీపూర్‌, బోథ్‌ మండలం ఘన్‌పూర్‌ వద్ద ఈ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో కూడా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షిస్తూ.. కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. 

పెండ్లీలు, శుభకార్యాలు వాయిదా.. 

జిల్లాలో నేడు జనతా కర్ప్యూ ఉన్నందున ప్రజలు పెండ్లీలు ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు. వారాంతపు సంతలను బంద్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు 24 గంటల పాటు కర్ఫ్యూలో పాల్గొనేందుకు ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. రోజంతా కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడిపేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.  

టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు.. 

జిల్లాలో కరోనా వ్యాధిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా సమాచారం అందించేందుకు 08732- 220462 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రజలు ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా, ఆ లక్షణాలు ఉన్నా కూడా ప్రజలు ఈ ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చు. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ 24గంటల పాటు పనిచేస్తుంది. జిల్లాలోని చాలా చోట్ల నిర్వహించే వారాంతపు సంతలు వాయిదా పడ్డారు. జనం నేడు 24గంటల పాటు ఇండ్లలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని చెబుతున్న నేపథ్యంలో అందుకు సిద్ధమయ్యారు. 

ఫంక్షన్‌హాళ్ల తనిఖీలు

నిర్మల్‌ జిల్లాలోని పలు ఫంక్షన్‌హాళ్లను అధికారులు తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఇప్పటికే నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌లో పలు ఫంక్షన్‌హాళ్లపై కేసులను నమోదు చేశారు. ఫంక్షన్‌హాళ్ల యజమానులతో పోలీసులు సమావేశాలు నిర్వహించి వీటిని తెరువద్దని, తెరిస్తే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పదోతరగతి పరీక్షలను వాయిదా వేయగా.. సోమవారం నుంచి పరీక్షలు లేవు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31వరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూసి వేయగా.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పరిస్థితి అలాగే కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో జిల్లా కేంద్ర దవాఖానలో 10బెడ్లతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. ఐదుగురికి ఐసీయూ ఏర్పాటు చేయగా.. అవసరాన్ని బట్టి మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవసరాన్ని బట్టి ఐసీయూ బెడ్లు రెండు రోజుల్లో మరిన్ని పెంచనున్నారు. అనుమానితులు, వ్యాధి లక్షణాలు ఉన్న వారికి దవాఖానల్లో  వైద్యంతో పాటు కౌన్సెలింగ్‌ చేయనున్నారు. మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో జనాలు రద్దీగా ఉండవద్దని ఇప్పటికే మతపెద్దలకు అధికారులు స్పష్టం చేశారు. 

కరోనాను నివారిద్దాం..

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి. ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతుంది. మనకోసం మన కుటుంబం కోసం మన రాష్ట్రం, దేశం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందాం. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా సామాజిక బాధ్యతగా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి.

-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,  రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి 

జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి... 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 24గంటల పాటు నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి. ఇంట్లోనే ఉండి వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నాం. గ్రామ, మండల స్థాయిలో అధికారులను అప్రమత్తం చేశాం. ఆదివారం ఉదయం 5.30గంటలకే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది కర్ఫ్యూపై మైకుల ద్వారా చెబుతాం. ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రజలు వారి ఇంటి ముందుకొచ్చి మనకోసం నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది కోసం చప్పట్లతో సంఘీభావం తెలపాలి. గ్రామాల్లో దండోరా, పట్టణాల్లో మున్సిపల్‌ స్వచ్ఛ ఆటోల ద్వారా వీధుల్లో ఈ జనతా కర్ఫ్యూపై ప్రచారం చేశాం. 

-ముషారఫ్‌ అలీ ఫారూఖీ,  నిర్మల్‌ కలెక్టర్‌


ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి.. 

24గంటల పాటు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలి. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలు గుమిగూడకుండా గుంపులు గుంపులుగా ఉండకుండా ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండేందుకే ఈ జనతా కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తున్నది. 24గంటల పాటు పాల్గొని కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో గ్రామ, మండలస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని సంఘాలు, అసోసియేషన్ల వారితో మాట్లాడారు. మెడికల్‌ దుకాణాలు, 108, 104, ప్రెస్‌ తప్ప మిగతా వారంతా 24గంటల పాటు స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను పారదోలాలి.  

-ఎ.భాస్కర్‌రావు, నిర్మల్‌ అదనపు కలెక్టర్‌logo