గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Mar 21, 2020 , 01:37:16

మైనారిటీ గురుకులాల్లో ఇంటర్‌ విద్య

మైనారిటీ గురుకులాల్లో  ఇంటర్‌ విద్య

  • వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం
  • 80 మంది విద్యార్థులకు ప్రవేశం
  • పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం అవకాశం

పేద విద్యార్థులకు  కార్పొరేట్‌ చదువులను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నది. సకల సౌకర్యాలు, సన్నబియ్యంతో కూడిన పోషకారం అందిస్తున్నది. దీంతో జిల్లాలో గురుకుల పాఠశాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. పట్టణాలతోపాటు గ్రామాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేద విద్యార్థులు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో భాగంగా మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల్లో ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మైనారిటీ గురుకులంలో 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో పేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గురుకుల పాఠశాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం ఆరు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు పేద విద్యార్థులు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షలు పూర్తయిన విద్యార్థులకు కార్పొరేట్‌ తరహాలో సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పిస్తున్నది. జిల్లాలోని ఆదిలాబాద్‌లో  రెండు బాలురు, రెండు బాలికలు, ఇచ్చోడలో బాలురు, ఉట్నూరులో బాలుర రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతో జిల్లాలో గురుకుల పాఠశాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. పట్టణాలతోపాటు గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. 

160 మంది విద్యార్థులకు ఉచిత ఇంటర్‌..

జిల్లాలో ఆరు మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉండగా ఇందులో ఆదిలాబాద్‌  బాలుల పాఠశాలలో 40 మంది, బాలికలు పాఠశాలల్లో 40 మంది మొత్తం 80 మంది విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరికి 5 తరగతి నుంచి ప్రవేశాల కల్పించి పదో తరగతి వరకు అన్ని సౌకర్యాలతో విద్య అందిస్తున్నారు. ఈ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కొత్తగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించనున్నారు. ప్రతి గ్రూపులో 40 మంది చొప్పున ప్రవేశం కల్పిస్తారు. ఆదిలాబాద్‌ బాలురు, బాలికల స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్య ప్రారంభకానుండగా 160 మంది విద్యార్థులకు ప్రవేశం లభించనుంది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం లభించనుంది. ప్రభుత్వం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ..

2010-21 విద్యాసంవత్సరానికిగానూ కొత్తగా ప్రారంభించనున్న మైనారిటీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. శుక్రవారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 12న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం జూన్‌ 12 నుంచి తరగతులను ప్రారంభిస్తారు.

ఇంటర్‌ కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాకు రెండు మైనారిటీ జూనియర్‌ కళాశాలలు మంజూరయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. ప్రవేశ పరీక్ష అనంతరం విద్యార్థులను ఎంపిక చేస్తాం. ఆదిలాబాద్‌ సమీపంలోని బంగారుగూడలో కళాశాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో అధ్యాపకులను నియమిస్తాం.

- కృష్ణవేణి, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారిlogo
>>>>>>