మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Mar 21, 2020 , 01:36:04

కమలంలో కల్లోలం

కమలంలో కల్లోలం

  • నిర్మల్‌ జిల్లా బీజేపీలో ముదిరిన గ్రూపు రాజకీయాలు 
  • రెండు వర్గాలుగా చీలిపోయిన జిల్లా బీజేపీ
  • జిల్లా అధ్యక్షురాలికి వ్యతిరేకంగా సీనియర్లు
  • రాజీనామాకు సిద్ధమైన భైంసా మున్సిపల్‌ కౌన్సిలర్లు
  • రసాభాసగా మారిన పార్టీ జిల్లా సమావేశం
  • ఇరుగ్రూపుల వాగ్వాదం, బాహాబాహీ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: కమలం పార్టీలో కల్లోలం నెలకొంది. జిల్లా భారతీయ జనతా పార్టీలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి తీరును, వ్యవహార శైలిని, ఆమె నాయకత్వాన్ని మొదటి నుంచీ సీనియర్‌ నాయకులు వ్యతిరేకిస్తుండగా..  తాజాగా వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులంతా కలిసి.. పార్టీ అధ్యక్షురాలితో పాటు జిల్లా ఇన్‌చార్జిని అడ్డుకోవడం కలకలం రేకెత్తిస్తోంది. శుక్రవారం నిర్మల్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో ఇటీవల సభ్యత్వ నమోదు చేపట్టగా, కొన్ని గ్రామాలు, మండలాల్లో గ్రామ, మండల కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ, మండల కమిటీల ఏర్పాటుపై సమీక్షించేందుకు రాష్ట్ర సంఘటన్‌ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి  శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవితోపాటు నాయకులు.. లోనికి వెళ్లేందుకు రాగా అదే పార్టీకి చెందిన భైంసా మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్‌ నాయకులు అడ్డుకున్నారు. లోపలికి రాకుండా పార్టీ కార్యాలయం ఎదుట వారు బైఠాయించారు. జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర సంఘటన్‌ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారితోపాటు మిగతా నాయకులను లోనికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రమాదేవి వర్గానికి, భైంసా బీజేపీ కౌన్సిలర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒక దశలో గొడవ తీవ్రమైంది. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

అందుబాటులో ఉండడంలేదని ఆరోపణలు

జిల్లాలో కార్యక్రమాలకు ఆమె అందుబాటులో ఉండడం లేదని.. దీంతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని కౌన్సిలర్లు, పార్టీ సీనియర్‌ నాయకులు ఆరోపించారు. భైంసా మున్సిపల్‌ ఎన్నికల్లో అర్హులకు కాకుండా అనర్హులకు టికెట్లు కేటాయించారని విమర్శించారు. భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధితులకు అండగా నిలువాల్సింది పోయి, కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా జిల్లా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించాలని, లేనట్లయితే తాము కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. అందరినీ  వారించడంతో గొడవ సద్దుమణిగింది. చివరికి ఎలాగోలా సమావేశం నిర్వహించి, మొత్తానికి సమావేశం పూర్తయిందని ముగించారు.

తొలినుంచీ వ్యతిరేకత

తొలిసారి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పటి నుంచి రమాదేవి నాయకత్వంపై ముథోల్‌తో పాటు నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, శ్రేణుల్లో వ్యతిరేకత ఉంది. ముథోల్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులంతా ఆమె నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఆమె వ్యవహార శైలి సరిగా లేదని.. సీనియర్లు, పార్టీ కోసం పని చేసే వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 2014, 2018ఎన్నికల్లో ఆమె ముథోల్‌ నుంచి పోటీ చేయగా, బీజేపీ సీనియర్లతో పాటు వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, ఏబీవీపీ నాయకులు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 2018లో ఆమెకు టికెట్‌ ఇవ్వవద్దని, ఇస్తే సామూహికంగా రాజీనామానాలు చేస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. అయినప్పటికీ రెండోసారి టికెట్‌ ఇవ్వడంతో ఎవరూ సరిగా పని చేయలేదని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ముదిరిన గ్రూపు రాజకీయాలు

ఇటీవల కాలంలో కొందరు సీనియర్లు, పార్టీ కోసం పని చేసే వారిని పదవుల నుంచి తప్పించి కొత్తవారికి ఇవ్వడంతో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరాయి. భైంసాలో ఇటీవల అల్లర్లలో బాధితులకు అండగా నిలవలేదని, మున్సిపల్‌ ఎన్నికల్లో అర్హులకు టికెట్లు ఇవ్వలేదని పార్టీలోని మరో వర్గం నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా రెండో సారి అధ్యక్షురాలిగా నియామకంకాగా, అభిప్రాయ సేకరణ సరిగా చేయలేదని ఆరోపిస్తున్నారు. చిట్టీలు రాశాక చూపించకుండానే నియమించడాన్ని పార్టీ సీనియర్లు, కౌన్సిలర్లు తప్పుబడుతున్నారు. పార్టీలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా రెండో సారి నియమించడం సరికాదంటూ ఆందోళనకు దిగారు. వారం రోజుల్లోగా ఆమెను తప్పించకుంటే తామంతా కౌన్సిలర్‌ పదవులకు, పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు, సీనియర్లు అల్టిమేటం జారీ చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.


logo
>>>>>>