బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 21, 2020 , 01:25:16

కరోనాపై అప్రమత్తం

కరోనాపై అప్రమత్తం

  • విస్తృతంగా అవగాహన  కార్యక్రమాలు
  • 31 వరకు విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, పార్కులు బంద్‌
  • ఆలయాల మూసివేత
  • కలెక్టర్‌ కార్యాలయంలో శానిటైజర్లు ఏర్పాటు
  • ఆర్టీసీ సిబ్బందికి సైతం పంపిణీ
  • మహారాష్ట్ర సరిహద్దు పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద అవగాహన 
  • కరోనా నివారణలో భాగంగా జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు 

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్కులను ఈ నెల  31వరకు మూసి ఉంచనున్నారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాలను మూసివేసి భక్తులు రాకుండా చర్యలు చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు చేతులను శుభ్రపర్చుకునేలా శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మండలాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా పర్యటిస్తూ  ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు శానిటైజర్లు పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్‌లో నియమించిన ప్రత్యేక బృందాలు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాయి.

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: కరోనా వైరస్‌పై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. తాజాగా జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం తర్వాత ఆయన ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. జిల్లాకు చెందిన వారు గల్ఫ్‌తో పాటు వివిధ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లగా కొందరు చదువు కోసం, ఉద్యోగం కోసం, పర్యాటన నిమిత్తం వెళ్లి వస్తున్నారు. ఇలా జిల్లాకు ఇప్పటి వరకు 585 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక వైద్య బృందాలతో ఆరా తీయిస్తున్నారు. వీరంతా 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, బయట తిరగవద్దని కట్టుదిట్టం చేశారు. అనుమానం ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 13మందికి దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉండగా, అనుమానంతో వీరందరికీ పరీక్షలు చేయించారు. హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు పంపి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. వీరి నమూనాలను పుణెకు పంపగా.. అందరికీ కరోనా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. జిల్లాలో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్‌ లక్షణాలు లేవు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికార యంత్రాంగం మరిన్ని చర్యలను చేపట్టింది. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

31 వరకు విద్యా సంస్థలు, సినిమా హాళ్లు బంద్‌..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31వరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూసి వేశారు. మరోవైపు ఇంటర్‌ పరీక్షలు పూర్తవగా, పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో ఏ సమస్య రాకుండా, ప్రతి రోజు బెంచీలు, కుర్చీలు, గదులు, బాత్రూంలు, కారిడార్లు శుభ్రం చేయిస్తున్నారు. జిల్లాలో 46పరీక్షా కేంద్రాలు ఉండగా.. అన్ని చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్సీ, అదనపు కలెక్టర్‌, డీఎంహెచ్‌వో నలుగురితో కూడిన కమిటీ ఉండగా, మండల స్థాయిలో ఎస్‌హెచ్‌వో, తహసీల్దారు, ఎంపీడీవో, మెడికల్‌ ఆఫీసర్‌, గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పోలీసు అధికారి, ఏఎన్‌ఎం/అంగన్వాడీ టీచర్‌, /ఆశ కార్యకర్త ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. వీరంతా ప్రతి రోజు ఏం జరుగుతుందో వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి.. ఏమైనా ఫిర్యాదులు అనుమానాలుంటే సెల్‌ నెంబర్‌ 99591 62746కు ఫోన్‌ చేయాలని ఇచ్చారు. మరోవైపు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లా దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు

కరోనా నేపథ్యంలో జిల్లా కేంద్రం ఆస్పత్రిలో 10బెడ్లతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. ఐదుగురికి ఐసీయూ ఏర్పాటు చేయగా.. అవసరాన్ని బట్టి మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవసరాన్ని బట్టి ఐసీయూ బెడ్లు రెండు రోజుల్లో మరిన్ని పెంచనున్నారు. ఇతర దేశాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టారు. జిల్లాకు సరిహద్దుల్లో ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతం ఉండడంతో, తానూర్‌ మండలం బెల్‌తరోడా అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారు, కరోనా అనుమానితులు, లక్షణాలు ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నారు. వీరికి అవగాహన కల్పించడంతో పాటు. అవసరాన్ని బట్టి ఏరియా దవాఖానకు తీసుకొస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని మాత్రం క్వారంటైన్‌ పంపుతున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా చూడాలని అన్ని మతాల పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. సాధ్యమైనంత తక్కువ మంది ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఫంక్షన్‌ హాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటి వరకు బుకింగ్‌ అయిన పెళ్ళిళ్లలనే అనుమతిస్తుండగా, అవి 200మంది లోపే ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టగా.. కరోనా ఉన్నన్ని రోజులు పారిశుద్ధ్య నిర్వహణపై మరింత దృష్టి పెట్టనున్నారు. 

వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యం: అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

ఎదులాపురం: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా  వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమని  అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో శుక్రవారం శానిటైజర్ల శిబిరం ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే  ఉద్యోగులు, ఇతరులు ముందుగా శానిటైజర్లతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఆ తర్వాతే కార్యాలయంలోకి రావాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అధికారులకు సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

వైరస్‌ను అరికట్టాలని పూజలు

ఇంద్రవెల్లి: కరోనా వైరస్‌ గ్రామానికి విస్తరించకుండా చూడాలని కోరుతూ డోంగర్‌గాం జీపీ పరిధిలోని భీమ్‌జీతండా గ్రామస్తులు శుక్రవారం జగదంబాదేవికి, గ్రామపొలిమేరలోని అయిదేవతకు పూజలు చేశారు. కరోనా వైరస్‌ కారణంగా గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాలను వాయిదా వేశామని సర్పంచ్‌ రాథోడ్‌ రామ్‌చందర్‌ అన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఒకరు 21రోజులపాటు ఉపవాసాలు పాటించాలని నిర్ణయించామన్నారు. గ్రామంలోకి ఇతరులు రాకుండా నిబంధనలు విధించామన్నారు. 


logo