మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Mar 20, 2020 , 03:00:44

‘కరోనా’ భయం వద్దు

‘కరోనా’ భయం వద్దు

  • స్వీయ నియంత్రణ అవసరం
  • జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు
  • ఇప్పటికే అన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు
  • ఎస్సెస్సీ విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ
  • జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు
  • అందుబాటులో టోల్‌ ఫ్రీ నంబరు08732- 220462 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కరోనా విషయంలో భయాందోళనలు వద్దని, ప్రజలు స్వీయ నియంత్రణ  పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్‌ -19 సోకకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ప్రబలకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌, ఉట్నూరు దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి బెడ్లను అందుబాటులో ఉంచారు. రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులతో ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొవిడ్‌-19 రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు గుంపుగా తిరగవద్దని, జనసంచారం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లా ప్రజలు తమ అవసరాలు, ఉద్యోగాలు, ఉపాధి చదువుల కోసం వివిధ దేశాలతో పాటు పలు రాష్ర్టాలకు వెళ్తుంటారు. జిల్లాలో వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వ్యాపారం చేస్తూ ఇక్కడ స్థిరపడిపోయారు. జిల్లా వాసులకు మహారాష్ట్ర ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. జిల్లాకు సరిహద్దున మహారాష్ట్రకు చెందిన చంద్రాపూర్‌, నాందేడ్‌, యావత్‌మల్‌ జిల్లాల గ్రామాలు ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ లాంటి పట్టణాలు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు  జిల్లా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ ప్రభలుతున్న  నేపథ్యంలో ప్రజలు భయ పడాల్సిన పని లేదని, తమకు ఏమీ కాదనే నిర్లక్ష్యం చేయకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌, వైద్య, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సూచించిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని అంటున్నారు. కరోనా నివారణ కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుతున్నారు.

జిల్లాలో పకడ్బందీ చర్యలు.. 

కరోనా వైరస్‌ను నివారించడానికి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రజలకు సేవలు అందించడానికి కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి 08732- 220462 నంబరును సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌, ఉట్నూరు దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులతో ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలను నియమించి కొవిడ్‌-19 రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు సైతం సోషల్‌ మీడియాలో కరోనాపై వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సాప్‌ నంబర్‌ 8333986898కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. 

అందరూ సహకరించాలి

గుడిహత్నూర్‌ రూరల్‌ :  కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అందరూ సహకరించాలని  అధికారులు కోరారు. గురువారం మండలంలోని మచ్చాపూర్‌, గోండ్‌ అర్కాపూర్‌, గర్కంపేట్‌ గ్రామాల్లో   కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు.  సర్పంచులు మందాడి మంజుల, నీలాబాయి, సంగీత, వీఆర్‌వోలు దేవిక, లక్ష్మి, చిన్నయ్య , బాలాజీ , గ్రామ కార్యదర్శి  సురేందర్‌,  వీఆర్‌ఏలు పుండలిక్‌ , రాజన్న, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్‌పై అవగాహన

బోథ్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ మనదరికి చేరదని గురువారం మండలంలోని కౌఠ (బీ), కరత్వాడ గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరిగి గ్రామస్తులకు ముందు జాగ్రత్త చర్యలు వివరించారు. కౌఠ (బీ)లో ఎంపీటీసీ పి శిరీషరెడ్డి, ఏఎన్‌ఎం చంద్రకళ, కే గంగాధర్‌, జీపీ కార్యదర్శి అంజయ్య, రవి, సంతోష్‌, రాజు, ఆశకార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది  ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. కరత్వాడలో సర్పంచ్‌ దుర్వ సింధు, విశ్వేశ్వర్‌రావు, వీఆర్వో హఫీజ్‌, ఏఎన్‌ఎం శశికళ, అంగన్‌వాడీ టీచర్‌ ప్రమీల, జీపీ సిబ్బంది అవగాహన కల్పించారు. 

పరిశుభ్రత పాటించండి

గుడిహత్నూర్‌ : కరోనాతో భయపడాల్సిన అవసరంలేదని పరిశుభ్రత పాటిస్తే దరి చేరదంటూ సర్పంచ్‌ జాదవ్‌ సునీత అవగాహన కల్పించారు. మండల కేంద్రంలో గురువారం వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.     

కరోనాపై కళాజాత

తాంసి : కరోనా వైరస్‌పై గ్రామాల్లో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కళాకారులు రవి, రమేశ్‌, వెంకట్రావు అన్నారు. గురువారం మండలంలోని పొన్నారిలో వైరస్‌పై కళా ప్రదర్శన నిర్వహించారు. వైరస్‌ సోకడంతో కలిగే  ఇబ్బందులను పాటల రూపంలో వివరించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశకార్యకర్తలు, అధికారులు ఇంటింటికీ తిరుగుతూ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం కప్పర్ల, జామిడి, తాంసి, పొన్నారి, హస్నాపూర్‌లలో నేతలు, అధికారులు కరోనా వైరస్‌తో కలిగే ఇబ్బందులను వివరించారు. సర్పంచులు కేమ సదానందం, కృష్ణ, నర్సింగ్‌, కేశవరెడ్డి, వెంకన్న తదితరులున్నారు.

నేరడిగొండలో...

నేరడిగొండ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని నేరడిగొండ తహసీల్దార్‌ శ్రీదేవి తెలిపారు. గురువారం మండల కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్‌ను నివారించవచ్చని సూచించారు.  ఇన్‌చార్జి ఎంపీడీవో శోభన, వైద్యాధికారి ఆనంద్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సోంపల్లిలో

సిరికొండ : కరోనాపై భయం వీడాలని సోంపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని సోంపల్లి గ్రామంలో కరోనాపై ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు.  ఉపాధ్యాయులు భూమయ్య, అమృత్‌రావు, స్వప్న, మాలతి, లలిత, పాఠశాల చైర్మన్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తత చాలు

భీంపూర్‌ : కరోనా వైరస్‌పై భయాందోళనలు చెందే అవసరం లేదని అదే సమయంలో  అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత, పరిసరాల శుభ్రత   పాటించాలని భీంపూర్‌ తహసీల్దార్‌ స్వాతి కోరారు. గురువారం ఎంపీడీవో శ్రీనివాస్‌, వైద్య సిబ్బందితో కలిసి భీంపూర్‌లో  అవగాహన కల్పించారు.  బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి. 


logo
>>>>>>