బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 20, 2020 , 02:49:53

క్షయపై సమరం..

క్షయపై సమరం..

  • వ్యాధి నివారణపై ప్రత్యేక దృష్టి
  • నిర్ధారణ కోసం రిమ్స్‌లో సీబీనాట్‌ ఏర్పాటు
  • ఖరీదైన మందులు, 
  • పౌష్టికాహారానికి నెలకు రూ.500సాయం
  • రోగులను గుర్తించి రిపోర్టు చేసిన వారికి రూ.500 

క్షయ అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధి. శరీరంలో వెంట్రుకలు తప్ప మిగిలిన ఏ అవయవానికైనా సోకే రోగమిది. ఆరేడు దశాబ్దాల క్రితం ప్రపంచాన్ని వణికించింది. ఈ వ్యాధి వచ్చిందంటే చావు తప్ప మరోటి లేదన్న స్థాయిలో విజృంభించిన మహమ్మారి. అలాంటి క్షయ (టీబీ) క్రమంగా తగ్గుముఖం పట్టినా ఇంకా మానవుడిని వదిలిపోలేదు. ఇప్పటికీ వెయ్యి మందిలో ఇద్దరు, ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా క్షయపై సమరభేరి మోగించాయి. జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో సర్కారు అధునాతన యంత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత ఖరీదైన వైద్యం అందిస్తున్నది. ఒక్కో క్షయ రోగికి నెలకు రూ.లక్షన్నర చొప్పున ఆరు మాసాల వ్యవధిలో రూ.ఐదు లక్షల దాకా ఖర్చుచేస్తున్నది. 

ఎదులాపురం: చాపకింద నీరులా విజృంభిస్తున్న క్షయపై నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా క్షయపై సమరభేరి మోగించాయి. జిల్లా కేంద్రాల్లోని రిమ్స్‌ దవాఖానలో సర్కారు అధునాతన యంత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత ఖరీదైన వైద్యం అందిస్తున్నది. క్షయ రోగికి ఒక్కొక్కరికీ నెలకు రూ.50వేలు చొప్పున ఆరు మాసాల వ్యవధిలో రూ.ఐదు లక్షల దాకా ఖర్చు చేస్తున్నది.  

2017లో ప్రపంచ వ్యాప్తంగా 1.7మిలియన్‌ మంది టీబీ వ్యాధి బారిన పడి మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య, వైద్య విభాగాలు వెల్లడించాయి. ప్రాణాంతకమైన ఈ టీబీ తెలంగాణలోనూ గణనీయమైన స్థాయిలో ఉందని అప్పుడే తెలిపాయి. ఈ వ్యాధిని 2025 వరకు పూర్తిగా అరికట్టాలనే సంకల్పంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షయపై సమరం ప్రకటించింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాయి. 

సీబీనాట్‌ యంత్రంతో చికిత్సకు అంకురార్పణ..

సీబీనాట్‌ యంత్రంతో ప్రభుత్వ దవాఖానల్లో క్షయ చికిత్స మొదలు పెడుతున్నారు. వ్యాధిని నిర్ధారించేందుకు కొత్తగా ఆవిష్కరించిన సీబీనాట్‌(కాట్రింట్జ్‌ బేస్డ్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌ అప్లికేషన్‌ టెస్ట్‌) యంత్రాన్ని ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. రూ.40 లక్షల విలువచేసే ఈ యంత్రాన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో 2018 సంవత్సరంలో ప్రారంభించారు. టీబీని అతివేగంగా ఇది నిర్ధారిస్తుంది. క్షయ నిర్ధారణకు కొన్ని దశాబ్దాల నుంచి తెమడ పరీక్ష నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తెమడ తీసుకొని.. మైక్రోస్కోప్‌ యంత్రం కింద ఉంచి టీబీ బ్యాక్టీరియాలను గుర్తిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతిలో తెమడలో లక్ష నుంచి పది లక్షల వరకు టీబీ బ్యాక్టీరియాలు ఉన్నప్పుడే వ్యాధిని నిర్ధారించడం సాధ్యమవుతున్నది. లక్ష కంటే తక్కువ టీబీ బ్యాక్టీరియాలుంటే మైక్రో స్కోపిక్‌ పద్ధతిలో గుర్తించడం సాధ్యం కాదు. సీబీనాట్‌ యంత్రంతో టీబీని ఆరంభ దశలోనే గుర్తించే అవకాశముంది. మనిషి నుంచి సేకరించిన తెమడను, క్రాటింట్జ్‌ బాక్స్‌లో ఉంచి రెండు గంటల పాటు సీబీనాట్‌ యంత్రంలో పెడుతారు. రెండు గంటల పాటు తెమడను పరీక్షించిన తర్వాత యంత్రం ఫలితాన్ని ప్రకటిస్తుంది. తెమడలో 50 బ్యాక్టీరియాలున్నా టీబీ పాజిటివ్‌గా నిర్ధారిస్తుంది. రోగ నిరోధక శక్తిని తెలియజేస్తుంది. దీంతో వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. ప్రారంభదశలోనే గుర్తించడంతో అతి సులువుగా వ్యాధి నయం చేసే అవకాశం ఉంటుంది. సీబీనాట్‌ యంత్రం ద్వారా తెమడతో పాటు వెన్నుపూస నుంచి తీసిన ప్లూయిడ్‌ ద్వారా సైతం టీబీని గుర్తించే అవకాశముంది. శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన ప్లూయిడ్స్‌ను స్వీకరించి కూడా పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. రిమ్స్‌లో సీబీనాట్‌ యంత్రం ద్వారా పరీక్షలు ఆరంభం కాగా.. ఇప్పటి వరకు 3,265 మందికి పరీక్షలు చేశారు. వారిలో 1,548 మందిని గుర్తించి వైద్యచికిత్సలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,648 మంది వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం తరుఫున ప్రతి నెలా ఇవ్వవలసిన రూ.500 చొప్పున 2,198 మంది అకౌంట్‌లో డబ్బులు జమచేశారు. మిగిలిన 260 మందికి అండర్‌ ప్రోగ్రెస్‌ పేమెంట్‌లో ఉన్నాయి. 

రోగాన్ని వ్యాపింపజేసే ఎక్స్‌డీఆర్‌ స్టేజ్‌..

క్షయలో చివరి స్టేజీని ఎక్స్‌డీఆర్‌ (ఎక్స్‌టెన్సివ్లీ డ్రగ్‌ రెసిస్టెంట్‌) అని వైద్యులు పేర్కొంటున్నారు. సీబీనాట్‌ యంత్రంలో తెమడ పరీక్ష సందర్భంలోనే ఎక్స్‌డీఆర్‌ స్టేజ్‌ కేసులు సైతం బయటపడతాయి. ఎక్స్‌టెన్సివ్లీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ స్టేజీగా పేర్కొనే ఈ దశ అత్యంత ప్రమాదకరమైంది. ఒక రోగి వద్ద నుంచి క్షయవ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఈ దశలోనే ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోగి నుంచి క్షయ ఎవరికైతే సోకుంతుందో వారు నేరుగా ఎక్స్‌డీఆర్‌ స్టేజీకి చేరుకుంటారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ వ్యాధిని నయం చేసేందుకు మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ స్టేజీలో ఇచ్చే మందులతో పాటు, ప్రత్యేకంగా ఇతర మందులను సైతం అందజేస్తున్నారు. వారానికి మూడు సార్లు బెడాక్విలిన్‌ అనే మాత్రను రోగికి ఇస్తుంటారు. బెడాక్విలిన్‌ ఒక్క మాత్ర ఖరీదు బయట మార్కెట్‌లో రూ.మూడు వేలు ఉండడం గమనార్హం. ఎక్స్‌డీఆర్‌ స్టేజీలో ఉన్న రోగికి వారానికి మూడు చొప్పున నెలకు పదిహేను మాత్రలు ఇస్తుంటారు. వీటికి బయట మార్కెట్‌లో రూ.45వేల ధర ఉండగా బెడాక్విలిన్‌తో పాటు, మరో రూ.50వేల విలువ కలిగిన ఎమ్‌డీఆర్‌ స్టేజ్‌ మందులను రోగికి ఇస్తూనే ఉంటున్నారు. జిల్లాలో ఎక్స్‌డీఆర్‌ స్టేజీలో వైద్యం పొందుతున్న రోగులు ఆరుగురు ఉన్నారు. వీరికి నెలకు రూ.లక్ష విలువైన మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూ వైద్యం చేయిస్తున్నది.

ఖరీదైన చికిత్స..

ప్రభుత్వ దవాఖానల్లో క్షయకు ఖరీదైన చికిత్స అందిస్తున్నారు. సగటున రోగికి మందులు, మాత్రల కోసం నెలకు లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఆరు నెలల కాలంలో రోగికి రూ.5లక్షల విలువ చేసే మందులను అందిస్తున్నారు. సీబీనాట్‌ యంత్రం ద్వారా వ్యాధిని గుర్తించిన అనంతరం ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తారు. సాధారణ స్థాయిలో ఉంటే పౌష్టికాహారం, సాధారణ మందులతో వ్యాధిని నయం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒక వేళ వ్యాధి 4వ దశలోకి చేరితే సీబీనాట్‌ యంత్రం మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ ట్యూబర్‌క్యులోసిస్‌గా పేర్కొంటుంది. ఈ స్థాయిలో ఖరీదైన మందులతో వైద్యం ప్రారంభిస్తున్నారు. ఆరు మాసాల పాటు, నెలకు రూ.50వేల విలువైన మందులను రోగి ఇంటికి వెళ్లి అందజేస్తూ.. కావాల్సిన వైద్యం అందిస్తారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రోగి పరిస్థితిని పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 28 మంది రోగులు మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ స్టేజీలో చికిత్స పొందుతున్నారు. వీరికి నెలకు రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. దాదాపు ప్రతినెలా రూ.35 లక్షల విలువైన మందులను సరఫరా చేస్తున్నది. 

టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడమే ఆలస్యం.. 

టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడమే ఆలస్యం. వెంటనే చికిత్సను ప్రారంభిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా మందులు, చికిత్సకు అయ్యే ఖర్చులను అందిస్తున్నాయి. గతంలో టీబీ నోటిఫికేషన్‌ బాగానే ఉందనుకున్నా టార్గెట్‌కు మించి వ్యాధిగ్రస్తులను గుర్తించాం. ఈ సంవత్సరం అందరి సహకారంతోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరుగుతున్నది. ప్రైవేట్‌ సంస్థల నుంచి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఆశకార్యకర్తలు వ్యాధిగ్రస్తులను గుర్తించి వెంటనే జిల్లా కేంద్రంలోని క్షయ వ్యాధి నివారణ కేంద్రానికి పంపించాలి. లక్షమందిలో 190 మందిగాను టీబీ ఉంటుంది. ఇప్పుడున్న జిల్లా జనాభా లెక్కల ప్రకారం సుమారు ఏడు లక్షల జనాభాలో 1,330 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. రిమ్స్‌లో నూతనంగా క్లీనిక్‌ను ఏర్పాటు చేశాం. 

-డాక్టర్‌ ఈశ్వర్‌రాజ్‌, జిల్లా క్షయ నివారణ అధికారి, ఆదిలాబాద్‌   


logo