బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Mar 20, 2020 , 02:49:10

పది పరీక్షలు షురూ..

పది పరీక్షలు షురూ..

  • మొదటి రోజు 10,388మంది విద్యార్థుల హాజరు, 43 మంది గైర్హాజరు
  • పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్టేట్‌ అబ్జర్వర్‌, అదనపు కలెక్టర్‌
  • కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులకు మాస్కుల పంపిణీ
  • కొవిడ్‌-19పై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది
  • విద్యార్థులను ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించిన అధికారులు

ఆదిలాబాద్‌ రూరల్‌: పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10431 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు గాను మొత్తం 51 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌-1 పరీక్షలు నిర్వహించగా.. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు 8.30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించి వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి మాస్కులను పంపిణీ చేశారు.

తొలిరోజు 10388 మంది హాజరు..

పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ విద్యార్థులు 10376 మంది హాజరుకావాల్సి ఉండగా 29 గైర్హాజరయ్యారు. 10347 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈవో  రవీందర్‌ రెడ్డి తెలిపారు. 55 మంది ప్రైవేట్‌  విద్యార్థులకు గాను 41 మంది హాజరుకాగా.. 14 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం 10388మంది విద్యార్థులు తొలి రోజు పరీక్షలకు హాజరైనట్లు వివరించారు. 

విద్యార్థులకు మాస్కుల పంపిణీ...

కరోనా వైరస్‌ నివారణ కోసం విద్యార్థులకు విద్యాశాఖ తరఫున పలు పరీక్షా కేంద్రాల్లో మాస్కులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో డీఈవో రవీందర్‌రెడ్డి మాస్కులను పంపిణీ చేశారు. పలు కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే ముఖానికి కర్చీఫ్‌లు, మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు.  

పరీక్షా కేంద్రాల తనిఖీ..

జిల్లా కేంద్రంలోని లిటిల్‌స్టార్‌ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి డీఈవోతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న విద్యార్థులకోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించాలని సూచించారు. కేంద్రా ల్లో హ్యాండ్‌వాష్‌లు, మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులు గుంపులుగా లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర అబ్జర్వర్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణరెడ్డి జైనథ్‌, గిమ్మ, అందర్‌బంద్‌, పెండల్‌వాడ కేంద్రాలను తనిఖీ చేశారు. 


logo
>>>>>>