మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Mar 17, 2020 , 01:56:27

రిమ్స్‌లో టీబీ ప్రత్యేక క్లినిక్‌ ప్రారంభం

రిమ్స్‌లో టీబీ ప్రత్యేక క్లినిక్‌ ప్రారంభం
  • పాత ఓపీ భవనంలో ఏర్పాటు
  • వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు చికిత్స ఒకేచోట
  • సేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో చందు సూచన

ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానల్లో టీబీ వ్యాధికి వైద్యాన్ని అందిస్తున్నామని సేవలను సద్వినియోగించుకోవాలని జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తొడసం చందు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ పాత ఓపీ భవనంలో నూతనంగా టీబీ స్పెషాలిటీ క్లినిక్‌-2025ను రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొడసం చందు మాట్లాడుతూ... రిమ్స్‌కు ప్రతి రోజూ టీబీ వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కౌంటర్‌ నుంచి టీబీ స్పెషాలిటీ క్లీనిక్‌ వరకు ఇబ్బందులు పడకుండా ఈ మార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు.  ఇక నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఒకేచోట చేస్తారని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరంతో బాధపడడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో టీబీ వ్యాధి గ్రస్తులకు ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు.  సగటున నెలకు రూ.లక్ష వరకు ఖరీదైన మందులు, మాత్రలు అందిస్తున్నామన్నారు. కేంద్ర పభుత్వం 2025వ సంవత్సరం వరకు దేశం నుంచి టీబీని నిర్మూలించాలనే లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. జిల్లాలో ఎక్కడ టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నా గుర్తించి వైద్యచికిత్సలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో (ప్రోగామ్‌ ఆఫీసర్‌) ఈశ్వర్‌రాజ్‌, శ్వాసకోశ వైద్య నిపుణుడు డాక్టర్‌ సందీప్‌ జాదవ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ సాయిప్రియ, డీఆర్‌టీబీ కోఆర్టినేటర్‌ చెన్న మల్లయ్య, ఎస్‌టీఎస్‌ నాగభుషణం పాల్గొన్నారు.


logo
>>>>>>